
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్‌లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు.
అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది.
ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు.
కొత్త జీవితం!
ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్‌లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది.
ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్‌లోకి దిగింది. అలా 2023లో అల్వార్‌లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్‌లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది.
(చదవండి: అందరికీ ఒకటే రక్తం!)