అక్కా... టికెట్‌ ఇవ్వండి! | Coimbatore gets its first transwoman TNSTC bus conductor | Sakshi
Sakshi News home page

అక్కా... టికెట్‌ ఇవ్వండి!

Sep 4 2026 1:41 AM | Updated on Sep 4 2026 1:41 AM

Coimbatore gets its first transwoman TNSTC bus conductor

నలుగురిలో ఒకరిగా జీవించడమే కాదు.. సమాజంలో తమ ఉనికిని, గౌరవాన్ని సగర్వంగా చాటుకోవడమే అసలైన విజయం అంటోంది బస్‌ కండక్టర్‌ వినోదిని. సమాజం చూపే వివక్షను దాటుకుని, తమిళనాడు రవాణా సంస్థ కోయంబత్తూర్‌ రీజియన్‌లో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ బస్‌ కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఇది తనకు గొప్ప విజయమే అయినప్పటికీ .. స్కిల్స్‌ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న తనలాంటి మరెందరికో తోడుగా నిలవడమే తన లక్ష్యమంటోంది ఈ 25 ఏళ్ల వినోదిని.

వినోదిని పళని సమీపంలోని పాఠశాలకు వెళ్లే రోజుల్లో.. రోజూ బస్సు ప్రయాణం చేయాల్సివచ్చేది. అలా కండక్టర్ల పనితీరును గమనించిన వినోదినికి.. కండక్టర్‌ ఉద్యోగంపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో తాను 16 ఏళ్ల వయసులో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది.

ఉద్యోగానికి దరఖాస్తు!
గత ఎనిమిదేళ్లుగా కోయంబత్తూర్‌ సెల్వపురంలోని ట్రాన్స్ జెండర్‌ కమ్యూనిటీతో కలిసి ఉంటున్న ఆమె.. స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో తమిళనాడు స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో కండక్టర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. మొదటి ట్రాన్స్‌ జెండర్‌ కండక్టర్‌గా ఎంపికై బాధ్యతలు చేపట్టింది. 

నెల రోజులుగా బస్‌ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినోదిని కేవలం బస్సులో టికెట్లు ఇవ్వడమే కాదు.. తన కమ్యూనిటీ భవిష్యత్‌ను మార్చే మోటివేటర్‌గా కూడా పనిచేస్తోంది. అర్హత ఉండి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న తన లాంటి మరెందరికోసమో పోరాడుతోంది. గౌరవప్రదమైన జీవనోపాధికి అవకాశాలు కల్పిస్తే.. ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజంలో ఉన్న దృక్పథం ఖచ్చితంగా మారుతుందని వినోదిని బలంగా నమ్ముతోంది.

ఆ పిలుపే అసలైన గెలుపు!
ఉద్యోగంలో చేరే ముందు మనస్సులో కొన్ని భయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల నుంచి లభించిన ఆదరణ నా అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. గతంలో సమాజం మమ్మల్ని చులకనగా చూసేది. కానీ ఇప్పుడు బస్సు ఎక్కిన ప్రయాణికులు ఎంతో గౌరవంగా ‘అక్కా.. టికెట్‌ ఇవ్వండి’ అని అడుగుతున్నప్పుడు నా శ్రమకు తగిన గుర్తింపు లభించిందనిపించింది. కష్టపడి సాధించిన ఉద్యోగం సమాజంలో సమానత్వాన్ని తెస్తుంది.

– వినోదిని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement