కోకోపోనిక్స్‌ కూరగాయలు | Cocoonics Farming, How Soil-Less Urban Agriculture Is Making Home Vegetable Growing Easier, Read Story Inside | Sakshi
Sakshi News home page

కోకోపోనిక్స్‌ కూరగాయలు

Sep 1 2026 9:58 AM | Updated on Sep 1 2026 10:54 AM

Sagubadi: cocoponics: a futuristic soilless vegetable production

ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో ఆరుబయట పొలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగు పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్‌ అగ్రికల్చర్‌ను నగర/పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) అభివృద్ధి చేసిన ‘కోకోపోనిక్స్‌’ బహుముఖ ప్రయోజనాలను అందించే అత్యాధునిక అర్బన్‌ వ్యవసాయ పద్ధతిగా రూపుదాల్చింది. 

కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, శిక్షణ ఇస్తున్న ఐఐహెచ్‌ఆర్‌ కృషి ఫలితంగా ఇప్పటికే బెంగళూరు తదితర ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలను మరింత శాస్త్రీయంగా కొందరు సాగు చేస్తున్నారు. ఆరోగ్యాభిలాషులైన మిద్దెతోటలు, ఇంటిపంటల సాగుదారులతో పాటు మహానగరాల్లో, నగర పరిసరాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీల నిర్వహణ సంఘాల ద్వారా పార్కులు, ప్రభుత్వ/ప్రైవేటు స్థలాల్లో కచ్చితమైన ఫలితాలు లక్ష్యంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకాన్ని మరింత విస్తృతంగా చేపట్టడానికి అవకాశం ఉంది. 

ఈ దిశగా పాలకులు యువతను, మహిళా సంఘాలను, విశ్రాంత ఉద్యోగులను అర్బన్‌ అగ్రికల్చర్‌లో నిమగ్నం చేసే దిశగా విధాన నిర్ణయాలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ‘కోకోపోనిక్స్‌’ ప్రయోజనాలు, ప్రత్యేకతలు, యోగ్యతలేమిటో ఈ కథనంలో పరిశీలిద్దాం...

సాంప్రదాయ సాగులో మట్టి, ఎరువుల మిశ్రమంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతారు. అయితే, మట్టి లేకుండానే మొక్కలు బలంగా పెరిగేలా చేసే సాయిల్‌ లెస్‌ సాగు పద్ధతి కోకో΄ోనిక్స్‌.  కొబ్బరి పీచు నుంచి తయారయ్యే కొబ్బపొట్టే కోకోపీట్‌. మట్టికి బదులుగా దీన్ని కుండీలు, మడుల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక సేంద్రియ పదార్థం ఇది. 

సిల్పాలిన్‌ బ్యాగ్‌లలో శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువును నింపి, నిర్ధారిత పరిమాణాల్లో వివిధ రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన ద్రావణాన్ని డ్రిప్‌ ద్వారా అందించడమే ఈ పద్ధతిలో ప్రత్యేకత. వాణిజ్య స్థాయిలో నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సులువుగా పండించేందుకు అవసరమైన శుద్ధి చేసిన కోకోపిట్‌ ఎరువు(అర్కా ఫెర్మెంటెడ్‌ కోకోపిట్‌)ను, పోషకాలతో కూడిన ద్రావణాన్ని (అర్కా సస్యపోషక్‌ రస్‌ను) రూపొందించిన ఐఐహెచ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తెచ్చారు.

తక్కువ ఖర్చు.. తక్కువ శ్రమ
కోకో΄ోనిక్స్‌ పద్ధతిలో అతి తక్కువ పెట్టుబడితో రకరకాల పండ్లు, కూరగాయలు, ఔషధ, పూల పంటలను పండించవచ్చని బెంగళూరులోని ఐసీఏఆర్‌–ఐఐహెచ్‌ఆర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ జి. సెల్వకుమార్‌ తెలిపారు. మట్టి ఆధారిత సాగుతో పోలిస్తే, కోకో΄ోనిక్స్‌ పద్ధతిని టెర్రస్‌లు/బాల్కనీలలో తక్కువ శ్రమతో చేపట్టవచ్చు. సూర్యరశ్మి తక్కువగా ఉండే బాల్కనీలలో నీడను ఇష్టపడే ఔషధ మొక్కలు, ఆకుకూరలను సులభంగా పెంచటం సాధ్యమవుతుందన్నారాయన. 

రోజుకు 30–45 నిమిషాలు చాలు
సాధారణంగా ఎక్కువ మంది వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను ఆరు బయట నేల మీద, గచ్చు మీద, మేడ మీద లేదా గ్రీన్‌/ పాలీహౌస్‌లలో గ్రోబ్యాగ్స్‌లలో పెంచే సాయిల్‌ లెస్‌ సాగు పద్ధతులపై  ఐఐహెచ్‌ఆర్‌ ఒక రోజు శిక్షణ  ఇస్తోంది. ఆకు కూరలు, టమాటా, మిరప కాయలు, క్యాబేజీ, దోసకాయలు, ఫ్రెంచ్‌ బీన్స్, బఠానీలు, పొట్లకాయలు, గుమ్మడికాయలతో పాటు విదేశీ రకాలైన రంగు క్యాబేజీ, జుకిని వంటి రకాలపై ఐఐహెచ్‌ఆర్‌లో మట్టి రహిత సేద్య పద్ధతిలో గ్రోబ్యాగ్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించామని ఐఐహెచ్‌ఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డా. డి. కలైవనన్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 

కూరగాయ మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక ద్రావణాలను సమతులంగా, సకాలంలో అందించడం వల్ల పోషక లోపం లేని కూరగాయలను, ఆకుకూరలను పిండించగలుగుతున్నామని ఆయన అన్నారు. అనేక రకాల స్థూల, సూక్ష్మ పోషకాలను ద్రావణం ద్వారా అందిస్తుండగా, మరికొన్ని పోషకాలు కొబ్బరి పొట్టు ఎరువు ద్వారా, మరికొన్ని నీటి ద్వారా అందుతాయన్నారు. ఈ పద్ధతిలో కూరగాయల పెంచటానికి రోజుకు 30–∙45 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఉద్యోగం చేసే దంపతులకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు.

కోకోపిట్‌ ఎంత వాడాలి?
గ్రో బ్యాగ్‌లో శుద్ధి చేసిన కోకోపిట్‌ ఎరువును నింపి.. విత్తనాలు లేదా మొక్కలు నాటి పోషకాలతో కూడిన ద్రవాన్ని డ్రిప్‌ ద్వారా అందించాలి. 12“12 అంగుళాలు లేదా 15“15 అంగుళాల సైజు గ్రో బ్యాగ్‌లో 8 నుంచి 10 కిలోల వరకు శుద్ధి చేసిన కోకోపిట్‌ ఎరువును వాడాల్సి ఉంటుంది. వంగ, టమాటా, మిరప, చిక్కుడు, బఠాణీ, బెండ మొక్కలతోపాటు.. సొర, బీర, ఆనప, గుమ్మడి వంటి తీగ జాతి మొక్కల్ని సైతం ఈ సైజు గ్రోబ్యాగ్‌లో ఒక్కొక్కటి పెంచి, వాణిజ్య స్థాయిలోనూ మంచి దిగుబడులు పొందవచ్చని డా. కలైవనన్‌ తెలిపారు.  

అదేవిధంగా, ఒక అడుగు ఎత్తు, అడుగు వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే సిల్పాలిన్‌ గ్రో బెడ్‌లో అయితే 45 కిలోల శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు ఎరువు ΄ోసి కూరగాయలు పెంచుకోవచ్చన్నారు. కొబ్బరి పొట్టు ఎరువు ఒక్కసారి కొని వేసుకుంటే చాలు. ప్రతి పంట పూర్తయ్యాక 5–10 శాతం కొబ్బరి పొట్టు ఎరువు వేసి, కలియదిప్పి, కొత్త పంటను వేసుకోవచ్చు. కొబ్బరిపొట్టు కొన్ని పంటల తర్వాత పూర్తిగా చివికి చక్కని ఎరువుగా మారుతుంది. పాతదాన్ని మార్చాల్సిన అవసరం ఉండదని డా. కలైవనన్‌ స్పష్టం చేశారు.
   
పది రోజులు ముందే పూత, కాత
వాణిజ్య స్థాయిలో మట్టి లేని సేద్యంలో కూరగాయలు, ఆకుకూరలను నేల మీద గానీ, మేడ/గచ్చు మీద గానీ గ్రోబ్యాగ్స్‌లో సాగులో మంచి దిగుబడులు తీయవచ్చని డా. కలైవనన్‌ తెలిపారు. జుకిని, ఆకుకూరలు, గ్రీన్‌ క్యాబేజీ, కీరదోస, బఠాణీ వంటివి మట్టిలో కన్నా కోకోపిట్‌లోనే ఎక్కువ దిగుబడి వచ్చింది. బీన్స్, చిక్కుడు, మిరప, కలర్‌ క్యాబేజీ వంటి పంటల్లో మంచి దిగుబడులు వచ్చాయన్నారు. 

అన్ని పంటల్లోనూ పది రోజులు ముందే పూత, కాత రావటం గమనించామన్నారు. కూరగాయల రకాన్ని బట్టి 1 రూపాయి పెట్టుబడికి రూ. 2–11 వరకు ఆదాయం వస్తుందన్నారు.  ఇందులో కలుపు సమస్య అసలు ఉండదని, భూమిని దుక్కి చేసే ఖర్చు కూడా ఉండదన్నారు. 

నీటిలో కలిపే పోషకాలు అత్యంత శుద్ధమైనవి. ఇవి నూటికి నూరు శాతం నీట కరిగి మొక్కల వేర్లకు చప్పున అందుతాయి. మట్టిలో వేసిన రసాయనిక ఎరువుల మాదిరి 50–75% వరకు ఏదో ఒక రకంగా వృథా కావటం.. భూమిని, నీటిని కలుషితం చేయటం అనే సమస్యలు ఇందులో ఉండవని ఆయన అన్నారు. మట్టి లేని సేద్యంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు రుచిగా, ఎక్కువ కాలం తాజాగా ఉంటాయన్నారు. సారవంతమైన భూమి అందుబాటులో లేని చోట్లలో, నగరాలు, పట్టణాల్లో మిద్దెలపైన, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఐఐహెచ్‌ఆర్‌ సూచిస్తున్నట్లు మట్టి లేని సేద్యం ఎంతో ఉపయోగకరం.     

సులభంగా కూరగాయల సాగు
స్థలం పరిమితంగా ఉండే మెట్రో నగరాల్లో సేంద్రియ కూరగాయల తోట పెంచటం ఒక సవాలుగా ఉంటుంది. సిమ్లాకు చెందిన హర్‌ప్రీత్‌ కౌర్‌ బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో ఒక బాల్కనీ కూరగాయల తోట పెంచాలని కలలు కన్నారు. ఆమె తన బాల్కనీలో వివిధ రకాల మొక్కలను పెంచటానికి ప్రయత్నించారు. కానీ, కుండీల్లో మట్టి గట్టిపడటం, పిండి నల్లి వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. 

ఆ తదనంతరం కోకోపోనిక్స్‌ పద్ధతిలో సులభంగా కూరగాయల సాగు చేస్తున్నారు. అలాగే, మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లు, మట్టిని సమకూర్చుకోవటం, కలుపు వంటి సమస్యలను పరిష్కరిస్తుందని తెలుసుకున్నారు. నీటి వినియోగం సగానికి పైగా తక్కువగా ఉండే ఇటువంటి వినూత్న సాంకేతికతలను ఆమె ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.

చికిత్సాత్మకమైన కార్యకలాపం
‘తోట పని ఒక చికిత్సాత్మకమైన కార్యకలాపం. తోట పనిని సులభతరం చేసే కోకోపోనిక్స్‌ వంటి కొత్త సాంకేతికతలు రావటం ఒక శుభ పరిణామమ’ని బెంగళూరులోని ‘పాఖీ లైఫ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌’ వ్యవస్థాపకురాలు రేఖా గోపీనాథ్‌ అంటున్నారు. 

విత్తనాలు మొక్కలుగా పెరిగే క్రమాన్ని గమనించటం, పువ్వులు వికసించడాన్ని గమనించటం, పండ్లు, కూరగాయలు కోయటం వంటి పనులు ఏదో సాధించిన భావనను కలిగిస్తాయని గోపినాథ్‌ తెలిపారు. ‘కోకోపోనిక్స్‌ ద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు. అంతేకాకుండా, ఉత్పత్తులు అధిక నాణ్యతను కలిగి ఉంటాయ’ని బెంగళూరులోని క్యాప్స్‌బర్‌ అగ్రిసైన్స్‌ వ్యవస్థాపకురాలు, సీఈఓ రూప మనోజ్‌ కుమార్‌ అన్నారు.
 డా డి కలైవనన్‌
ఐఐహెచ్‌ఆర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త
పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

(చదవండి: గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement