బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉద్యోగ నియామకాల వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రతిపక్షానికి సూటిగా సవాల్ విసిరారు. ‘ఈ వ్యవహారంలో నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు కాదు.. ఆధారాలు బయటపెట్టండి, దర్యాప్తులో నిజం తేల్చండి అంటూ రాజకీయ దాడిని మరింత పదును పెట్టారు. ఆధారాలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
కాగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 24 మంది AEEల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కుమారస్వామి ఆరోపిస్తూ.. ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ‘హిట్ అండ్ రన్ పాలిటిక్స్’ అంటూ కుమారస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ‘నా మీద ఆరోపణలు చేసేవారు పత్రాలతో రావాలి. ఆధారాలు ఉంటే దర్యాప్తు జరగాలి.. నిజాలు బయటకు రావాలి. KPSCకి సంబంధించిన ఏ కేసులోనైనా నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి తమ పాత్ర రుజువైతే బీజేపీ, జేడీఎస్ నేతలు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని ఖర్గే ప్రశ్నించారు.
సీసీటీవీ ఫుటేజీపై అనుమానాలు
AEE నియామక ప్రక్రియలో ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు, సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు వచ్చినట్లు ఖర్గే తెలిపారు. తుది ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే KPSCలోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ నియామకాలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. KPSCలో పరీక్షల నిర్వహణ, ఎంపిక జాబితాల విడుదల, తుది జాబితాను సంబంధిత శాఖకు పంపడం వంటి ప్రక్రియలను వేర్వేరు అధికారులు, సంస్థలు నిర్వహిస్తారని ఖర్గే వివరించారు. అలాంటప్పుడు మొత్తం వ్యవహారానికి మంత్రినే నేరుగా బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొంతమంది అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు రావడంతో KPSC సమీక్ష కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ ఆరోపణలు చేయడం కాకుండా.. ఎక్కడ, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? అక్రమాలకు పాల్పడింది ఎవరు? అన్నది తేల్చాలని కోరారు.
చర్యలు తప్పవు..
నియామకాల్లో అక్రమాలు జరిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని ఖర్గే స్పష్టం చేశారు. యువత ఉద్యోగాలు, భవిష్యత్తును దెబ్బతీసే ఏ అక్రమాన్నైనా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, గత బీజేపీ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన PSI నియామక కుంభకోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో బీజేపీ నేతల పేర్లు కూడా ఆరోపణల్లో వినిపించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న నేతలు గతంలో ఇలాంటి వ్యవహారాలపై ఎలా స్పందించారో ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత


