బియ్యం, పప్పు మొదలు ఉల్లి వరకు భారీగా పెరిగిన ధరలు
పెట్రోల్ నుంచి వంట నూనెల దాకా ధరలు సలసల
బెంబేలెత్తిస్తున్న కూర‘గాయాలు’.. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
కుటుంబ బడ్జెట్‌కు రూ.8వేల నుంచి రూ.10 వేల అదనపు భారం
ధరల దెబ్బకు కుటుంబ బడ్జెట్లు తారుమారు.. అప్పులే దిక్కు
ఆదాయం పెరగక, ఖర్చులు తగ్గక దిగువ మధ్యతరగతి కుటుంబాలు విలవిల
ధరలు భారీగా పెరిగినా ఏమాత్రం పట్టించుకోక మొద్దు నిద్రలో సర్కారు
ధరల పెరుగుదల తీరును సీఎం డ్యాష్ బోర్డే వెల్లడిస్తున్నా చర్యలు నిల్
చంద్రబాబు సర్కారు ఉపశమన చర్యలు చేపట్టక పోవడంపై ప్రజలు ఆగ్రహం
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడంతో సామాన్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ఒకప్పుడు రూ.40 వేలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు.. ఇప్పుడు అదే అవసరాలకు మరో రూ.8ృ10 వేల వరకు అదనంగా వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యం, పంచదార, నూనె, పప్పులు, ఉల్లిపాయలు, కూరగాయలు.. ఇలా వంటింట్లో అడుగుపెట్టిన ప్రతి సరుకూ ధరల షాక్ ఇస్తోంది. సామాన్యుల ఆదాయం పెరగక.. ఖర్చులు తగ్గించుకోలేక.. చివరకు ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: విశాఖలోని ఎండాడలో ఉంటున్న సత్యకృష్ణది నలుగురు సభ్యుల సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈమెతో పాటు భర్త నగేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. ఇద్దరు స్కూల్‌కు వెళ్లే పిల్లలతో సంసారం నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా జీతం చేతికందే రోజు లెక్కలు వేసుకొని ఖర్చు చేస్తున్నారు. అయితే ఆరు నెలలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు వీరికి శరాఘాతంగా మారాయి. నెలకు రూ.40 వేల ఖర్చుతో కూడిన వీరి బడ్జెట్ తల్లకిందులైంది. గత ఆరు నెలలతో పోలిస్తే ఇప్పుడు అధికంగా మరో ఎనిమిది వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెరగక పోవడంతో ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం అప్పు చేయక తప్పని పరిస్థితి. ఇవన్నీ తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినవి కావడంతో ప్రతి నెలా అప్పు కోసం చేయి చాచాల్సి వస్తోంది. ఇలా కేవలం ఒక్క సత్యకృష్ణే కాదు.. రాష్ట్రంలో ఏ దిగువ మధ్య తరగతి వారిని కదిపినా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలు ఇంతగా విలవిల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. బియ్యం, పంచదార, ఎండుమిర్చి, నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు, కూరగాయలు, పెట్రోల్.. ఇలా ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది.
చౌక ధరలు, రైతు బజార్ల ద్వారా సరుకులు సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం అలాంటి ఆలోచనే చేయడం లేదు. గత ఆరు నెలలుగా ధరలు విపరీతంగా పెరిగిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్యాష్ బోర్డే గణాంకాలతో సహా వివరిస్తున్నా, ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించక పోవడం దారుణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అప్పులపాలవుతున్న పేదలు
ప్రభుత్వ డ్యాష్ బోర్డులో హోల్‌సేల్ ధరల కంటే రిటైల్ మార్కెట్లో ధరలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం రిటైల్ మార్కెట్‌లో కేజీ బియ్యం రూ.58–60 ఉంటే ఇప్పుడే అదే రకం ధర రూ.75కు చేరింది. జూలైలో రూ.45గా ఉన్న కిలో పంచదార (చక్కెర) ఇప్పుడు రూ.70 దాటింది. నెల రోజుల క్రితం రూ.100కు మూడు కేజీల ఉల్లిపాయలు వస్తుంటే, ఇప్పుడు రూ.150కి కేవలం రెండు కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ఇక మిర్చి పేరు ఎత్తగానే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. కనీసం రూ.350 పెడితే కానీ కిలో ఎండుమిర్చి లభించని పరిస్థితి.
వంట నూనెల విషయానికి వస్తే ఏడాది క్రితం రూ.120–150 మధ్య ఉంటే లీటరు వంట నూనె ధర ఇప్పడు రిటైట్ మార్కెట్లో ఏకంగా రూ.160–190 అయ్యింది. ఏ కూరగాయ తీసుకున్నా ఒక్క బెండకాయ మినహా కిలో రూ.40 పైమాటే. ఇలా వంట గ్యాస్, పెట్రోల్.. ఇతర నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. పెరిగిన ధరలతో సరిపడా సరుకులు కొనలేక, కుటుంబాన్ని ఎలా నడపాలో అర్థంకాక లక్షలాది కుటుంబాలు అప్పులపాలయ్యే పరిస్థితి తలెత్తింది.
మొద్దు నిద్రలో సర్కారు
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి తాకి రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూడా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. చౌక ధరల దుకాణాల ద్వారా పంచదార, కందిపప్పు, వంట నూనెలు వంటివి అందించి.. సామాన్యులకు ఊరట కలిగించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆరు నెలలుగా పెరిగిన ధరలపై కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. బియ్యం ధరలు పెరిగినప్పుడు రైతు బజార్లు ద్వారా చౌకగా అందిస్తామంటూ చేసిన ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
ఇప్పుడు ఉల్లిపాయలు, కూరగాయల ధరలు పెరిగిపోయినా రైతు బజార్ల ద్వారా చౌకగా అందించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్న తరుణంలో ఏం వండుకుంటాం.. ఏం తింటాం.. అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి.. మళ్లీ వంటింట్లో లొల్లి
కొద్ది రోజులుగా ఉల్లి వంటింట్లో మళ్లీ కలకలం రేపుతోంది. ఉన్నట్లుండి ఉల్లి ధర అమాంతం పెరగడమే ఇందుకు కారణం. కర్నూలు వ్యవసాయ మార్కెట్ శుక్రవారం క్వింటా కనిష్ట ధర రూ.1,201 కాగా, గరిష్ట ధర రూ.3,975 పలికింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హోల్‌సేల్ మార్కెట్‌లోనూ మహారాష్ట్ర పాత ఉల్లిపాయల ధర క్వింటాలు రూ.4,200 పలికింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో ఏకంగా 65–70 అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులు రాజ్యమేలుతున్నారని మండిపడుతున్నారు.
ధరలు షాక్ కొడుతున్నాయి
రిటైల్ మార్కెట్‌లో కేజీ పంచదార రూ.70కి పైగా ఉంది. బియ్యం, నూనె, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీగా పెరిగిన ధరలు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. ఇలా అయితే వచ్చే పండుగలు ఎలా చేసుకునేది? – తాళ్లపూడి పరమేశ్వరరావు, భీమవరం, పశ్చిమ గోదావరి
చేదెక్కిన పంచదార
కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.55 ఉన్న పంచదార ధర ఒక్కసారిగా రూ.70–75 వరకు పెరిగింది. శ్రావణ మాసం మొదలుకుని రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలకు స్వీట్ల తయారీకి పంచదారనే ఎక్కువగా వాడతారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే సామాన్యుడు ఎలా బతకాలి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. – గంధం నరేష్, శ్రీకాకుళం
ఇలాగైతే ఎలా?
నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగాయి. బియ్యం ధర కిలోకు రూ.70 దాటిపోయింది. గతంలో రూ.45 నుంచి రూ.50కి మంచి బియ్యం లభించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాలాంటి మధ్య తరగతి ప్రజలపై భారీగా భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. – కె.నాగమల్లీశ్వరి, విజయవాడ
ఉల్లిపాయల ధరకు మళ్లీ రెక్కలు
ఉల్లిపాయలు కొనే పరిస్థితి లేదు. మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.60–70 ఉంది. ఇలాగైతే ఏం వండుకోవాలి? పంచదార సైతం కిలో రూ.70 దాటింది. పెరిగిన ధరలతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే ఆదాయం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవటం లేదు. పేద కుటుంబాలు చాలా ఇబ్బందులెదుర్కొంటాయి. ప్రభుత్వం ధరలు తగ్గించాలి. – రెహిమా, విజయవాడ
కూరగాయలకు పూటకు రూ.100
మార్కెట్‌కు వెళ్లి రూ.100కు కూరగాయలు కొనుగోలు చేస్తే ఒక్క పూటకు సరిపోతున్నాయి. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలకు కూరగాయల కోసం రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే నెలకు రూ.6,000 కూరగాయలకు ఖర్చు పెడితే.. పేద కుటుంబం ఎలా జీవనం సాగించాలి? గతంలో రూ.100 కూరగాయలు 2 రోజుల పాటు వచ్చేవి. నెలకు రూ.1,500 ఖర్చు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం కూరగాయల కోసం నెలకు రూ.4,500 అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. – సరోజమ్మ, తిరుపతి


