విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే! | Teachers Day Guru Importance Radhakrishnan | Sakshi
Sakshi News home page

విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!

Sep 3 2026 9:12 AM | Updated on Sep 3 2026 9:13 AM

Teachers Day Guru Importance Radhakrishnan

మాతృదేవోభవ, పితృదేవోభవ అన్న సూక్తి తర్వాత మన సంస్కృతి స్థానం కల్పించింది ఆచార్యుడికే! కన్నవారు జన్మనిస్తే... ఆ జన్మకు సార్థకతను, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. సమాజమనే తోటను సుభిక్షంగా ఉంచే తోటమాలి ఉపాధ్యాయుడు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందని నమ్మిన దేశం మనది. అటువంటి గురు పరంపరకు కృతజ్ఞతలు చెప్పుకునే పవిత్రమైన రోజే ‘గురు పూజోత్సవం’.

భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి, జగద్గురువుగా కీర్తించబడిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి ని (సెప్టెంబరు 5) మనం ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, దేశ అత్యున్నత పదవిని అధిష్టించినా, ఆయన హృదయం ఎప్పుడూ విద్యాబోధన వైపే నిలిచింది. అందుకే, తన పుట్టినరోజును వేడుకగా కాకుండా, దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజుగా జరపాలని ఆయన కోరారు. ఆనాటి నుండి నేటివరకు ఈ రోజును మనం ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం.

సమాజ శిల్పి:
కాలం మారుతున్నా, సాంకేతికత పెరుగుతున్నా గురువు పాత్రను పూరించే శక్తి దేనికీ లేదు. ఒక ఉత్తమ గురువు నిర్వర్తించే విధులు కేవలం నాలుగు గోడలకే పరిమితం కావు: కేవలం పుస్తకాల్లోని అక్షరాలను పాఠాలుగా నూరిపోయడం కాదు, లోకజ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థిలోని సృజనాత్మకతకు పదును పెట్టడం గురువు ప్రథమ కర్తవ్యం.

నైతిక విలువల రూపశిల్పి: విద్యార్థులలో క్రమశిక్షణ, సత్యం, కరుణ, పెద్దల పట్ల గౌరవం వంటి సంస్కారాన్ని నూరిపోసి వారిని సన్మార్గంలో నడిపించే పక్షపాత రహిత మార్గదర్శి గురువు. తరగతి గదిలో ప్రతిభావంతులతో పాటు వెనుకబడిన విద్యార్థులను కూడా సమానంగా ఆదరిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం గురువుకే చెల్లింది.

స్ఫూర్తి ప్రదాత: విద్యార్థుల భయాన్ని పోగొట్టి, వారిలో దాగివున్న ప్రత్యేక నైపుణ్యాలను (కళలు, క్రీడలు, నాయకత్వం) గుర్తించిప్రోత్సహించడం ద్వారా గురువు తాను స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే కాదు, తన శిష్యులను కూడా పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చే మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతాడు.

గురు ఋణం తీర్చుకుందాం
ఈనాటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు. వారిని ఉత్తమ పౌరులుగా మార్చే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. కేవలం సెప్టెంబరు 5వ తేదీన పూలమాలలు వేసి సన్మానించడమే కాదు, జీవితాంతం గురువులను గౌరవించడం, వారు చూపిన సన్మార్గంలో నడవడం ద్వారానే మనం గురు ఋణాన్ని తీర్చుకోగలం. సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయ లోకానికి వందనాలు సమర్పిస్తూ... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
– డా. డి.ఎల్‌. అనూరాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement