రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పర్వదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా భక్తులు ప్రతియేటా జరుపుకుంటారు. శ్రావణమాసం కృష్ణపక్షం – అష్టమి తిథిన దేవాది దేవుడు ఆవిర్భవించాడు. నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురలో దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా కంసుని కారాగృహంలో భగవానుని ఆవిర్భావం జరిగింది. ఈ శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా... భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్ని రేఖామాత్రంగానూ, ఆ తర్వాత ఆ పర్వదినాన ఆచరించ వలసిన విధులనూ తెలుసుకుందాం...
పూర్వం దానవ రాజుల అకృత్యాలతో భూమాత తల్లడిల్లింది. తన ఇబ్బందులను వినిపించేందుకు బ్రహ్మదేవుని చెంతకు భూమాత చేరింది. భూలోక పరిస్థితులను విన్న బ్రహ్మ తాను కూడా కలత చెంది క్షీరసాగరంలో శయనించిన విష్ణువును దేవతలందరితో కలసి వెళ్లి స్తుతిస్తారు. వీరి మొర ఆలకించిన దేవాదిదేవుడు త్వరలోనే వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తానన్న తన దివ్య సందేశాన్ని బ్రహ్మ ద్వారా తెలియజేస్తాడు. తదనంతరం శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవతలందరూ తమకు నిర్దేశించిన రీతిలో యదువంశంలో జన్మిస్తారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు తానే స్వయంగా దేవకీ దేవి అష్టమ గర్భాన కృష్ణునిగా అవతరించాడు.
ధర్మాచరణం
ధర్మ స్థాపన కొరకు దేవాది దేవుడి శ్రీ కృష్ణ అవతారం చాలా ప్రముఖమైనది. క్రూరుడు అయిన కంసుడిని వధించి యదువంశాన్ని రక్షించాడు. బాల్యలీలల ద్వారా పూతనను సంహరించాడు. గోవర్ధనగిరి అనే పర్వతాన్ని చిటికన వేలితో ఏడురోజులపాటు ఎత్తి యాదవులందరిని కాపాడాడు. కాలియుడనే విష సర్పం గర్వాన్ని అణిచివేసి పడగలపై నృత్యం చేశాడు జరాసంధుడు, శిశుపాలుడు వంటి ఎందరో దానవులను మట్టుబెట్టారు. కుచేలుడు, కుంతీదేవి, ద్రౌపది వంటి వారెందరికో తన కృపను ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో పాండవులకు ఎల్లవేళలా రక్షణ ఇచ్చి చివరకు అర్జునుడికి రథ సారధి అయ్యాడు. యుద్ధభూమిలో కర్తవ్య నిర్వహణకు సందేహించిన అర్జునుడికి జీవితసత్యాలతో భగవద్గీత బోధించాడు. ఈ గ్రంథం సర్వమానవాళికి గొప్ప మార్గదర్శం.
జన్మాష్టమి రోజు చేయాల్సినవి
భగవానుడికి చేరువయ్యేందుకు భక్తులు ఉపవాసం చేస్తారు. అర్ధరాత్రి కృష్ణుడి జన్మ సమయం వరకు భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీ కృష్ణుని లీలలను శ్రవణం చేస్తారు. కృష్ణుడి విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు, అటుకులు, వెన్న, మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉట్టి కొట్టడం, సాంస్కృతిక ప్రదర్శనలు, కృష్ణ అలంకరణ వంటివి కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇలా దేవాదిదేవుడి జన్మదినం సర్వమానవాళికి శుభం కలిగించే మహోత్సవంగా జరుపుతారు.
– దేవిశెట్టి శ్రీనివాస్
భగవంతుడనే పదానికి స్వాగతం కృష్ణా...
ప్రపంచంలోని మతాలన్నీ ఆయా సంస్కృతులు, భాషానుసారం భగవంతుణ్ణి వివిధ నామాలతో సంబోధిస్తుంటాయి. ఆ నామాలన్నీ నిస్సందేహంగా భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ తెలుపబడినవే, కాని అవి భగవంతుని అనంతమైన గుణాల్లో ఒక్కోగుణాన్ని ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ తెలుపబడినవి.‘భగవంతుడు’ అనే పదానికి అత్యంత సరళమైన ఒక నిర్వచనం. అంటే, ‘ఎవరినుంచైతే సర్వం ఆవిర్భవిస్తుందో వారే’ అని అర్థం. (శ్రీమద్భాగవతం 1.1.1)విశేషమైన ప్రామాణిక వైదిక వాఙ్మయాన్ని పరిశీలిస్తే, ‘భగవంతుడు’ అన్న పదానికి వేదవ్యాసుల తండ్రియైన పరాశరముని ఒకచక్కటి నిర్వచనాన్ని అందించారు.
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసఃశ్రియః
జ్ఞాన వైరాగ్యయోశ్చైవషణ్ణాం భగవతీంగన
‘‘జ్ఞాన, బల, ఐశ్వర్య, కీర్తి, సౌందర్య, వైరాగ్యాలనే ఆరు విభూతుల నిధనమే దేవాదిదేవుడైన భగవంతుడు.’’ (విష్ణు పురాణం 6.5.47) జన్మాష్టమి అంటే శ్రీ కృష్ణుడు అవతరించిన దివ్యతిథి. పరమపూజ్యశ్రీ శ్రీల ప్రభుపాదుల వారి విశేష కృషి ఫలితంగా నేడు జన్మాష్టమి మహోత్సవం ప్రపంచమంతటా జరుపుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఈ జన్మాష్టమి రోజున మీకు సమీపంలోని మందిరాన్ని సందర్శించి, పవిత్ర భగవన్నామాలను జపిస్తూ ఉత్సవాల్లో భాగస్తులై శ్రీ కృష్ణుడిని మీ జీవితాల్లోనికి స్వాగతించండి. హరే కృష్ణ!
– శ్రీ మాన్ సత్య గౌర చంద్ర దాస, అధ్యక్షులు, హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి: అన్నదాన మహిమ!


