ఆరు కేజీల బంగారు కొండ.. అసలు విషయం తెలిస్తే కళ్లలో నీళ్లు! | Six Kg Gold Girl Child Emotional Telugu Story | Sakshi
Sakshi News home page

ఆరు కేజీల బంగారు కొండ.. అసలు విషయం తెలిస్తే కళ్లలో నీళ్లు!

Aug 31 2026 9:45 AM | Updated on Aug 31 2026 9:45 AM

Six Kg Gold Girl Child Emotional Telugu Story

జీవన వేదం

దొక చిన్న పట్టణం. ఆ పట్టణంలో నాలుగు వీధులు కలిసే చోట బాబా గుడి ఉంది. అక్కడికి ఓ భక్తురాలు ప్రతిరోజూ వచ్చేది. గుడి ముందర ఉన్న ఒక అంగట్లో పూలు కొనుక్కుని బాబాకి సమర్పించేది.

అయితే కొన్ని రోజులుగా ఆ భక్తురాలు హడావుడిగా వచ్చి వెళ్లడం గమనించింది పువ్వులమ్మే మహిళ. అదును దొరికిన సమయాన కారణం అడిగింది. ‘మా ఇల్లొక స్వర్గం. మా ఇంట్లో ఆరు కేజీల బంగారం ఉంది. దాన్ని భద్రంగా చూసుకోవాలి’ అని చెప్పింది. పువ్వులమ్మి ఆశ్చర్యపోయింది. ‘ఎన్నో ఏళ్ళుగా పూల వ్యాపారం చేస్తున్నా కోడిగుడ్డంత బంగారం సమకూర్చుకోలేకపోయాము. ఈమె చాలా అదృష్టవంతురాలు. ఒకటి కాదు రెండు కాదు ఆరు కేజీల బంగారం ఇంట్లో పెట్టుకుని ఉంది’ అని ఈర‡్ష్య పడింది.

‘నీవు ఇలాగే ఆలోచిస్తే కడుపుమంట, కడుపులో మంట రెండూ వస్తాయి. ఒకసారి వెళ్లి చూసి రా. నీ కడుపు మంట తగ్గుతుందని’ చక్కని సలహా ఇచ్చాడు భర్త.
ఒకరోజు సాయంత్రం వీలు చూసుకుని ఆ భక్తురాలి ఇంటికి వెళ్ళింది. అది చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి ముందర కానుగ చెట్టుకింద భక్తురాలు ఆరు నెలల చిన్న పాపతో ఆడుకుంటూ కనిపించింది. పువ్వులమ్మిని చూసి నవ్వుతూ పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. తన మనవరాలి గురించిన ముచ్చట్లు చెప్పడం ప్రారంభించింది భక్తురాలు. అంతా ఓపికగా విన్న పువ్వులమ్మి చివరిగా ‘మీ ఇంట్లో ఆరు కేజీల బంగారం ఉందని చె΄్పారు కదా. ఈ జన్మకి అంత బంగారం మేము సంపాదించలేము. కనీసం కళ్ళారా చూసి పోదామని వచ్చాను’ అని చెప్పింది.

ఆ భక్తురాలు పడీపడీ నవ్వుతూ ‘నా చేతిలో ఉన్నది ఆరు కేజీల బంగారమే కదా!’ అని మనవరాలిని చూపింది. ఆశ్చర్యపోయింది పువ్వులమ్మి.
‘మా శ్రీవారి కుటుంబంలో మూడు తరాలుగా ఆడపిల్లలే పుట్టలేదు. ఆరు నెలల ముందు మా కోడలు ఆడబిడ్డను ప్రసవించింది. పాప బరువు ఆరు కేజీలు కాబట్టి ఆరు కేజీల బంగారమని చె΄్పాను. ఇంట్లో ఆడ బిడ్డల కాలిగజ్జెల శబ్దం వినబడితే అదే కదా స్వర్గసీమ. ఆ ఆనందం కరువై వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాము. ఈసారి మా పూజ ఫలించింది. బంగారు కొండ మా ఇంటికి వచ్చింది’ అని చెప్పి తియ్యని లడ్డును పువ్వులమ్మి చేతికిచ్చింది. ‘ఆడబిడ్డలు లేని వారికి కదా తెలుస్తుంది ఆడబిడ్డల విలువ’ అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది పువ్వులమ్మి.
– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

ఇవి చదవండి: ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement