తెరపై విలన్‌.. నిజ జీవితంలో సున్నిత మనసు.. | Satyaprakash Reveals His Film Journey And Dream To See Son Nataraj Become A Successful Hero, Read Story Inside | Sakshi
Sakshi News home page

తెరపై విలన్‌.. నిజ జీవితంలో సున్నిత మనసు..

Aug 31 2026 8:44 AM | Updated on Aug 31 2026 10:44 AM

Satya Prakashm Cinema Journey Son Nataraj Hero Dharmasthala Niyojakavargam

లైఫ్‌ స్టోరీ

కళ్లలో కసి.. మనసులో మమత

700 సినిమాలు.. ఎన్నో విలన్‌ పాత్రలు

విశాఖవాసి ప్రముఖ నటుడు సత్యప్రకాశ్‌

కళ్లలో కసి.. మాటల్లో గాంభీర్యం.. తెరపై కనిపిస్తే ప్రత్యర్థులకు భయం పుట్టించే విలన్‌ పాత్రలు. కానీ నిజ జీవితంలో మాత్రం సున్నితమైన మనసున్న కళాకారుడు. తన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖవాసి సీనియర్‌ నటుడు సత్యప్రకాశ్‌.

విశాఖ తిమ్మాపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీ ప్రయాణం, విశాఖతో అనుబంధం, కుమారుడి సినీ భవిష్యత్‌పై తన కలలను పంచుకున్నారు.

అక్కయ్యపాలెం నుంచి వెండితెర వరకు..
అక్కయ్యపాలెంలో పుట్టిన సత్యప్రకాశ్‌కు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి అవకాశం ఇచ్చారని, తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వారిలో మెగాస్టార్‌ చిరంజీవి పాత్ర కూడా మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘పోలీస్‌ స్టోరీ’తో మొదలైన విలన్‌ ప్రయాణం
విలన్‌గా తన సినీ ప్రస్థానం ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రంతో ప్రారంభమైందని సత్యప్రకాశ్‌ తెలిపారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సాగిన ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు 700కు పైగా సినిమాల్లో నటించారు. ‘సరిపోదా శనివారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లోనూ కనిపించిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘స్పిరిట్‌’, ‘ఫౌజి’, నాని నటిస్తున్న ‘ప్యారడైజ్‌’ సినిమాలతో పాటు మరో 14 చిత్రాల్లో నటిస్తున్నారు.

అవార్డుల కంటే చిరు ఇచ్చిన కారు ప్రత్యేకం
సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నప్పటికీ.. మెగాస్టార్‌ చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని సత్యప్రకాశ్‌ చెప్పారు. ‘బిగ్‌బాస్‌ సినిమా సమయంలో చిరంజీవి నాకు ఇచ్చిన కారు నా జీవితంలో ప్రత్యేక జ్ఞాపకం’ అని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.

వైజాగ్‌.. నా అదృష్టం
విశాఖవాసిగా పుట్టడం నా అదృష్టం. ఇక్కడి ప్రజలు సినిమాలను మాత్రమే కాదు.. కళాకారులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు. ప్రకృతి అందాలతో విశాఖ ఓ అద్భుతమైన సినిమా వేదిక అని సత్యప్రకాశ్‌ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన విజువల్స్‌ అందించగల సామర్థ్యం విశాఖకు ఉందని, మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు.

కుమారుడ్ని హీరోగా తీర్చిదిద్దుతూ..
తాను ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన కుమారుడు నటరాజ్‌ను హీరోగా చూడాలన్నదే తన కోరిక అని సత్యప్రకాశ్‌ తెలిపారు. ఇప్పటికే కన్నడంలో ‘మనసు మల్లిగె’, ‘ఉగ్రావతార’, తెలుగులో ‘ఉల్లాలా ఉల్లాలా’, ‘అమ్మదీవెన’ వంటి చిత్రాల్లో నటరాజ్‌ హీరోగా నటించారు.

సెప్టెంబర్‌ 4న ‘ధర్మస్థల నియోజకవర్గం’
నటరాజ్‌ హీరోగా నటించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదల కానుందని సత్యప్రకాశ్‌ తెలిపారు. ఈ చిత్రంలో సాయికుమార్‌, సుమన్‌ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారని, ఇది తన కుమారుడి కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు నటరాజ్‌కు అందాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ఇవీ చదవండి: దండాలయ్యా రీమిక్స్‌ అయ్యా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement