కుటుంబం: సామాజిక సౌధానికి పునాది | Sakshi Special Story on Traditional Family Values | Sakshi
Sakshi News home page

కుటుంబం: సామాజిక సౌధానికి పునాది

Aug 31 2026 3:33 AM | Updated on Aug 31 2026 3:33 AM

Sakshi Special Story on Traditional Family Values

సనాతన ధర్మం కుటుంబాన్ని కేవలం ఒక నివాస ప్రాంతంగా చూడదు; అది సంస్కారాన్ని నేర్పే తొలి పాఠశాల, వ్యక్తిత్వ వికాసానికి పునాది వేసే పవిత్ర క్షేత్రం. సమాజం అనే మహా సౌధానికి కుటుంబమే మూలస్తంభం. వ్యక్తుల మధ్య ఉండే రక్త సంబంధం కన్నా, హదయాల మధ్య ఉండే ధర్మబద్ధమైన అనుబంధమే కుటుంబానికి అసలైన బలం. నేటి విచ్ఛిన్నమవుతున్న సామాజిక పరిణామాల మధ్య, సనాతన కుటుంబ విలువల పునరుద్ధరణ అత్యంత ఆవశ్యకం.

కుటుంబం ఒక చైతన్యవంతమైన వ్యవస్థ. మొక్కై వంగనిది మానై వంగదన్నట్లు, బాల్యంలో తల్లిదండ్రుల నుండి లభించే సంస్కారం మనిషిని ఉత్తమ  పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. త్యాగం, ఓర్పు, కరుణ వంటి దైవీ గుణాలు ఇక్కడే మొలకెత్తుతాయి. వేరు బలంగా ఉన్నప్పుడే వృక్షం గాలివానలకు తట్టుకుని నిలబడినట్లు, కుటుంబ పునాదులు ధర్మబద్ధంగా ఉంటేనే వ్యక్తి జీవితం సుస్థిరంగా ఉంటుంది. ప్రేమ లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది; అది బాహ్యంగా వైభవంగా కనిపించినా శాంతిని ప్రసాదించలేదు. నూలు పోగులన్నీ కలిస్తేనే వస్త్రంగా మారి మానాన్ని కాపాడుతుంది, విడిపోతే కేవలం దారాలుగా మిగిలిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల ఐక్యతే జీవితానికి రక్షణ కవచం.

అనుబంధాల అమృతం: మమకారం – బాధ్యత నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. ఒకే మొక్కకు పూసిన పూలన్నీ ఒకే రంగు, ఒకే వాసన కలిగి ఉంటాయి. ఒకే చెట్టుకు కాసిన పండ్లు ఒకే రుచి, ఒకే రూపాన్ని సంతరించుకుంటాయి. కానీ, ఒకేతల్లి కడుపున పుట్టిన బిడ్డల ఆలోచనలు మాత్రం ఒకే విధంగా ఉండటం లేదు. ఒకరిది స్వార్థం, మరొకరిది ఐక్యం. ఒకరు కష్టపడి సంపాదించాలనుకుంటే, మరొకరు అధర్మంగా దోచుకోవాలనుకుంటారు. ఒకరిది ధర్మ మార్గం, మరొకరిది అధర్మ మార్గం. ఇదీ నేటి ప్రపంచ వైపరీత్యం.

ఇటువంటి విభజన కుటుంబ పునాదులనే కదిలిస్తుంది. పెద్దల త్యాగమే తర్వాతి తరానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. విత్తనం మట్టిలో కలిసిపోయి వృక్షానికి ప్రాణం పోసినట్లు, కుటుంబం కోసం చేసే నిస్వార్థ త్యాగమే వంశ గౌరవాన్ని కాపాడుతుంది.

ఆర్థిక అంధకారం: దుర దృష్టవశాత్తూ నేడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. మానవ సంబంధాల కన్నా మనీకే విలువ పెరుగుతోంది. కేవలం ఆస్తిపాస్తుల కోసం తప్పుడు మార్గాలు అనుసరించడం పరిపాటిగా మారింది. ధర్మంగా ఉండేవారిని అమాయకులుగా, దోచుకునే వారిని తెలివైనవారిగా వెక్కిరించే కాలమిది. కానీ, అక్రమంగా సంపాదించిన ఆస్తి పిల్లలకు సుఖాన్నివ్వదు; అది కాలనాగు వలె మారి వారి భవిష్యత్తును కాటువేస్తుంది. దీనికి మరో నిదర్శనం – చెదలు పట్టిన చెక్క పైన ఎంత మెరుగు పెట్టినా లోలోపల గుల్లయిపోయి కూలిపోయినట్లు, అధర్మపు సొమ్ముతో పెరిగిన కుటుంబం అంతర్గత కక్షలతో అశాంతికి నిలయమవుతుంది.

అన్యాయార్జితం చివరకు కన్నవారిని సైతం వీధిన పడేస్తుంది. బంధువులు సైతం స్వార్థం కోసం తప్పుడు సలహాలు ఇవ్వవచ్చు, కానీ పాల నుండి నీటిని వేరు చేసే హంస వలె మనకు విచక్షణ ఉండాలి. విచక్షణ లేని సంపాదన చిల్లుల కుండలో నీరు నింపడం వంటిది; అది ఏ క్షణమైనా హరించుకుపోతుంది. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం మన పరమ ధర్మం. ఆస్తిపాస్తుల కన్నా ఉత్తమమైన విలువలను పిల్లలకు వారసత్వంగా ఇవ్వడమే అసలైన సంపద.

మేఘాలు సూర్యుడిని కాసేపు కప్పివేసినా వెలుగు ఆగనట్లు, తాత్కాలికంగా అధర్మం గెలుస్తున్నట్లు కనిపించినా అంతిమంగా ధర్మమే జయిస్తుంది. ప్రతి అడుగు ధర్మబద్ధం కావాలి, ప్రతి ఇల్లు ప్రేమానురాగాలతో విరాజిల్లాలి. భారతీయుల కుటుంబ వైభవం జగత్తుకు దిక్సూచి కావాలి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉషోదయంలా, మన గృహాల్లో ధార్మిక కాంతి ప్రసరించాలి. సంప్రదాయం వికసించాలి, సత్కృత్యాలు వర్ధిల్లాలి, సత్యం నిలవాలి, లోకం సుభిక్షంగా ఉండాలి.
– కె. భాస్కర్‌ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement