ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం! | Prophet Teachings About Guru And Knowledge | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!

Sep 3 2026 8:37 AM | Updated on Sep 3 2026 8:37 AM

Prophet Teachings About Guru And Knowledge

ఇస్లాం వెలుగు

హోపాధ్యాయ మహాప్రవక్త ‘‘ఈ రోజుల్లో కాస్త కోపం వస్తే చాలు, విరుచుకుపడే మాష్టార్లను చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో... ఒక అమాయకపు పల్లెటూరి మనిషి, మసీదు పవిత్రత తెలియక లోపల మూత్రవిసర్జన చేస్తే, చుట్టూ ఉన్నవాళ్ళు కర్రలెత్తారు. కానీ ఆ మమహనీయులు ఏమన్నారో తెలుసా? ‘‘ఆగండి... అతడిని పూర్తి చేయనివ్వండి.’’ అదీ సహనం అంటే! ఆ తర్వాత అతడిని దగ్గరకు పిలిచి, ప్రేమగా చెప్పి, ఒక బకెడు నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు.

‘‘తప్పు చేశావు!’’ అని గద్దించడం కాదండీ, ‘‘ఏది ఒప్పో’’ తలనిమిరి చెప్పడం గురువు లక్షణం. అలాగే ఒక కుర్రాడు వచ్చి, నాయనా... నాకు వ్యభిచారం చేయడానికి అనుమతివ్వు అని అడిగితే... ఏ సమాజమైనా ఏం చేస్తుంది? కానీ ప్రవక్త గారు నవ్వారు. కూర్చోబెట్టుకున్నారు. ‘‘రా నాయనా... ఇది నీ తల్లికో, నీ చెల్లికో ఇతరులు చేస్తే ఒప్పుకుంటావా?’’ అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న ఆ కుర్రాడి గుండెల్లో నాటుకుపోయింది. మనసు మారిపోయింది. విమర్శించడం కాదు, ఆలోచింపజేయడం! అదీ ఆయన శైలి.

ఖురాన్‌ అంటుంది: ‘‘ఆయనే మీకు జ్ఞానాన్ని, విచక్షణను, సరికొత్త విషయాలను నేర్పించే గురువు’’ అని. అందుకే ఇస్లాంలో గురువు స్థానం సామాన్యమైనది కాదు. హజ్రత్‌ అలీ ఒక మాటంటారు ‘‘నాకు ఒక్క ఒక్క అక్షరం నేర్పినా, నేను జీవితాంతం అతనికి బానిసనే!’’ ఎంత గొప్ప మాటండీ ఇది! ఈ రోజుల్లో గురువులకు ఆ గౌరవం దక్కుతోందా? మనం చనిపోయాక కూడా మనతో వచ్చేది రెండే రెండు... ఒకటి మనం చేసిన మంచి, రెండు మన గురువు మనకు నేర్పిన జ్ఞానం. దాన్నే ‘సదఖాయె జారియా’ అన్నారు.

అంటే తరగని పుణ్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... గురువు అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు అప్పజెప్పే టేప్‌ రికార్డర్‌ కాదండీ... ఒక మనిషిలోని అజ్ఞానాన్ని తుడిచేసి, అతనిలో నిద్రపోతున్న మంచితనాన్ని నిద్రలేపే ఒక ‘అద్భుతమైన శిల్పి’. ఆ శిల్ప కళను ప్రపంచానికి ఆచరించి చూపించిన ఆ మహా ఉపాధ్యాయుడికి మేలును ఎలా మర్చిపోగలం! ఏమంటారు? ఆలోచించండి మరి!
– ముహమ్మద్‌ ముజాహిద్‌

ఇవి చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement