ఇటలీ ప్రధానిగా 1,413 రోజులు మెలోనీకి మోదీ అభినందనలు  | PM Narendra Modi congratulates Meloni on Italy longest-serving PM | Sakshi
Sakshi News home page

ఇటలీ ప్రధానిగా 1,413 రోజులు మెలోనీకి మోదీ అభినందనలు 

Sep 5 2026 5:28 AM | Updated on Sep 5 2026 5:28 AM

PM Narendra Modi congratulates Meloni on Italy longest-serving PM

న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పదవిలో దీర్ఘకాలం కొనసాగిన జార్జియా మెలోనీ(49)కి ప్రధాని మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. 2022 అక్టోబర్‌ 22వ తేదీన ఇటలీ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటి మహిళా ప్రధానిగాను ఆమె రికార్డు నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశ ప్రధాని పదవిలో ఏకబిగిన 1,413 రోజులు కొనసాగిన ఏకైక ప్రధానిగా ఆమె నిలిచారు. ఇటలీ ప్రజలు మెలోనీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ఇది నిదర్శనమని ప్రధాని మోదీ శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

 ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేత నా మిత్రురాలు, ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు. ఈ చరిత్రాత్మక మైలురాయి ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం’అని ప్రధాని మోదీ తెలిపారు. స్పందించిన మెలోనీ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన మోదీ.. మీ సందేశానికి, మీ స్నేహానికి ధన్యవాదాలు. భారత్‌–ఇటలీ సంబంధాలు మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉన్నాయి’అని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement