నా చేతిలో ఏమీ లేదు.. ఆ నిర్ణయం అధిష్టానానిదే
కేబినెట్‌లో విస్తరణపై హైకమాండ్‌దే తుది నిర్ణయం
ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని..అయితే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై హైకమాండ్ సమానంగా చర్యలు తీసుకుందని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ‘కూతురు సుస్మిత తెలిసి చేసినా తెలియక చేసినా.. సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సింది. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండేది. అలా చేయలేదు కాబట్టే ఏఐసీసీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది’అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బ్లాక్‌మెయిల్ చేసే అవసరం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కొండా సురేఖపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సర్దిచెప్పానని మహేశ్‌గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల అంత కఠినంగా కూడా వ్యవహరిస్తుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేశ్‌గౌడ్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలను పంచుకోవాలని, ప్రతిపక్ష నేతగా తన వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకోవడం సహజమే అయినా అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నో సమీకరణాలు ఉంటాయని చెప్పారు.


