రేపు ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ | BRS Legislature Party meeting in Erravalli on September 6 | Sakshi
Sakshi News home page

రేపు ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ

Sep 5 2026 4:57 AM | Updated on Sep 5 2026 4:57 AM

BRS Legislature Party meeting in Erravalli on September 6

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ కార్యాలయం సమాచారం పంపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే పాలక పక్షం వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ చార్జ్‌షిట్‌ విడుదల చేసింది. 

మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 2వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలు, పార్టీ సభ్యుల నడుమ సమన్వయంపై కేసీఆర్‌ మార్గదర్శనం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్, సీఎం లక్ష్యంగా కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన ఆరోపణలను అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ సభ్యులు దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్‌ చెప్పే అవకాశముంది. 22ఏ జాబితాలో ప్రైవేట్‌ భూములు చేర్చడం, కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపైనా వ్యూహం ఖరారు చేయనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement