ప్లానింగ్ కమిషన్, ‘కుడా’ పదవుల నియామకంపై అంతర్గత రచ్చ
ఎలా ఇస్తారని ఓ ముఖ్య నేత మండిపాటు.. అధిష్టానానికి ఫిర్యాదు లేఖ?
ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లోనూ ఈ నియామకాలపై అసంతృప్తి
అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టడంపై కినుక
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారనే ప్రశ్న
వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని తెరపైకి తెస్తున్న కొందరు
అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ కోణంలోనూ ఎమ్మెల్యేల చర్చలు
సురేఖ పోయి సుధారాణి వచ్చారంటూ వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: అసలే కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్‌తో అతలాకుతలమవుతున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త కుతకుతలు మొదలయ్యాయి. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా గుండు సుధారాణిల నియామకాలు దేనికి సంకేతాలనే చర్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రచ్చకు కారణమవుతోంది. పార్టీలో చర్చించి నియామకాలు చేపట్టాల్సి ఉండగా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నియామకాలు చేపట్టడంపై అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న ఓ కీలక నేత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పార్టీలో చర్చించి, టీపీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాల్సి ఉండగా, ఏకపక్షంగా పదవులు ప్రకటించడాన్ని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
ముఖ్య నేత గుర్రు..
సురేఖకు ఉద్వాసన పలకగానే సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ ముగ్గురు మహిళలకు కీలక పదవులిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన హైదరాబాద్ నగర మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించారు.
ఆమెకు కేబినెట్ హోదా కల్పించడమే కాకుండా గతంలో చిన్నారెడ్డి తరహాలోనే మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనకూ కేబినెట్ హోదా ఉంది. మళ్లీ ఇప్పుడు కుమార్తెకు ఎందుకు పదవి ఇవ్వాల్సి వచ్చిందని, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమెను అక్కడి నుంచి తొలగించి మరీ కేబినెట్ హోదా గల పదవిలో ఎందుకు నియమించారని, కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా నేతల్లో ఆ పదవి నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్న వారు లేరా అనే ఆవేదన వ్యక్తమవుతోంది.
అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలకు ఎందుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వరనే వాదనా వినపడుతోంది. ఉత్తమ్ పద్మావతికి మంత్రి పదవి, భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ అడిగినప్పుడు ఈ కుటుంబ నిబంధన ఎలా అడ్డువచ్చిందని కొందరు బాహాటంగానే ప్రశి్నస్తున్నారు. మరోవైపు వరంగల్ మాజీ మేయర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని ప్రాధాన్యం గల పోస్టులో నియమించారు. ఈ ఇద్దరూ కష్టకాలంలో పార్టీలో లేరని, అధికారం వచ్చాక పార్టీలోకి వచ్చిన వీరికి క్లిష్ట సమయంలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా మున్నూరుకాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు ఏదో అవకాశం కల్పించామని చెప్పుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలం కావనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
పెనం మీద నుంచి పొయ్యిలోకి...
తాజా పరిణామాలపై పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మనసుకు బాధ అనిపిస్తుంది. సురేఖ కుమార్తె చేసిన దానికి ఆమెను బలిచేశారు. పార్టీలో కనీసం మూడేళ్లు పనిచేసి ఉంటేనే మండల పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నప్పుడు ఎన్నేళ్లు పనిచేశారని గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా, కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించారు? తన మేయర్ పదవిని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సుధారాణి పార్టీ అభివృద్ధి కోసం ఏం కష్టపడ్డారని కుడా చైర్మన్ ఇచ్చారో అర్థం కావడం లేదు.
అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడింది ఇందుకేనా? పంతాలకు పోయి పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పడుతోంది.
గుండు సుధారాణికి కుడా చైర్మన్ ఇవ్వడం పట్ల వరంగల్ కాంగ్రెస్ నేతలు, ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సురేఖ పోయి సుధారాణి వచ్చిందని, తద్వారా తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విధేయ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి లాంటి వారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా... భవిష్యత్ ఓరుగల్లు రాజకీయాలు మరింత రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.


