మందు గోలీ.. ఖాళీ! | Government hospitals in Telangana stare at shortage of life-saving drugs | Sakshi
Sakshi News home page

మందు గోలీ.. ఖాళీ!

Sep 5 2026 4:34 AM | Updated on Sep 5 2026 4:34 AM

Government hospitals in Telangana stare at shortage of life-saving drugs

ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను, ప్రాంతీయ ఆసుపత్రులను పీడిస్తున్న కొరత 

4 నెలలుగా బీపీ, షుగర్‌ మాత్రలకూ దిక్కులేని పరిస్థితి 

ఓపీ చెకప్‌తో సరి.. మందులు బయట కొనాలంటున్న సిబ్బంది 

ప్రాంతీయ ఆస్పత్రుల్లో సర్జరీ చేస్తే రెండ్రోజుల మందులిచ్చి దులుపుకుంటున్న వైనం... నెలవారీ చందా చెల్లిస్తున్నా

సేవలు అందకపోవడంపై రోగుల ఆగ్రహం 

తాజాగా మందుల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు 

క్షేత్రస్థాయి నుంచి నివేదిక వచ్చిన తర్వాతే కొనుగోలు..  

(చిలుకూరి అయ్యప్ప) 
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలతో పాటు ఈఎస్‌ఐ ప్రాంతీయ ఆస్పత్రులు కూడా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్నపాటి జబ్బులకు కూడా సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా మందులు కరువయ్యాయి. కొన్ని డిస్పెన్సరీల్లో జ్వరం, దగ్గు మందులు కూడా లేవు. అనారోగ్యంతో వెళ్లే రోగులకు సాధారణ పరిశీలన నిర్వహించి మందు బిళ్లలు రాసిస్తున్నారు. మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కార్మీకుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేస్తున్న ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఈఎస్‌ఐ) స్ఫూర్తి దెబ్బతింటోంది. నిధుల కొరత, క్షేత్రస్థాయి డిమాండ్‌పై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. 

ఆర్నెల్లుగా సమస్య జఠిలం 
    గత ఆర్నెల్లుగా సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ ఈ సమస్య తీవ్రమైంది. కొన్ని డిస్పెన్సరీల్లో పారాసిటమల్‌ మాత్రలు కూడా నిండుకున్నాయి. మందులు ఇవ్వకపోవడంపై కొన్నిచోట్ల రోగులు, వైద్య సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ప్రాంతీయ ఆస్పత్రుల్లో సర్జరీలు చేయించుకున్న రోగులకు కేవలం రెండ్రోజులకు సరిపడా మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వాటిని డిస్పెన్సరీల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడ స్టాక్‌ లేకపోవడంతో మందులు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

డిమాండ్‌ తెలిస్తేనే కొనుగోలు.. 
    ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందుల అంశం ఇప్పుడు అధికారులు, సిబ్బంది మధ్య దుమారం రేపుతోంది. ఉన్నతాధికారులకు ఈ అంశంపై ఫిర్యాదులు, వినతులు అందుతున్నాయి. సాధారణంగా మందుల కొనుగోలు ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. దీంతో వారు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో మందుల కొనుగోలుకు అనుమతి వచి్చనట్లు సమాచారం. కాగా ఈ అంశంపై నాచారం ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘మందుల కొనుగోలుకు పది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో డిస్పెన్సరీల నుంచి డిమాండ్‌ రిపోర్టును తెప్పించుకుంటున్నాం. ఈ నెల ఐదో తేదీ కల్లా సమరి్పంచాలని ఆదేశించాం. 

అక్కడ్నుంచి నివేదికలు అందిన తర్వాత వాటిని క్రోడీకరించి కొనుగోలు ప్రక్రియ చేపడతాం’అని ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు పద్ధతి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎస్‌ఎంఐడీసీ) నేరుగా మందులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మాత్రం సూపరింటెండెంట్లు.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. వాటిని తమ పరిధిలోని డిస్పెన్సరీలకు సరఫరా చేయాలి. బిల్లుల చెల్లింపులు మాత్రం సూపరింటెండెంట్‌ స్థాయిలోనే ఉంటుంది. 

రాష్ట్రంలో ఈఎస్‌ఐ స్వరూపం 
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈఎస్‌ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులున్నారు. ఒక్కో చందాదారు నెలకు తన వేతనంలో 0.75 శాతం చందా ఇస్తుండగా, యాజమాన్యం 3.25 శాతం చొప్పున చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు జమ అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్‌ ఎంప్లాయిస్‌ సేŠట్‌ట్‌ ఇన్సూరెన్స్‌ విభాగానికి నిధులు విడుదల చేస్తుంది. ఏటా సగటున రూ.650 కోట్ల మేర కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర విభాగానికి నిధులు అందుతాయి. దీంతో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తోంది. 

రాష్ట్రంలో నాలుగు ఈఎస్‌ఐ ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఇవి నడుస్తున్నాయి. 
వీటి పరిధిలో 71 డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో 53 డిస్పెన్సరీలుండగా, వరంగల్‌ రీజియన్‌ పరిధిలో 18 ఉన్నాయి. 
అదేవిధంగా రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు నిజామాబాద్, జీడిమెట్లలో ఉన్నాయి.  

21 లక్షల ఈఎస్‌ఐ చందాదారులకు సంబంధించి మొత్తం 90 లక్షల నుంచి కోటి మంది సభ్యులున్నట్లు అంచనా. ఒక్కో కార్డుదారు కుటుంబంలో తల్లిదండ్రులు, ఇతర సభ్యులు కూడా ఉంటారు. దీంతో సేవలు అందుకునే వారి సంఖ్య కోటికి చేరువలో ఉంది. 
ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఓపీ సేవలు అందిస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు సర్జరీలు, ఇన్‌పేషంట్‌ సేవలు, స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్‌ సేవలు అందించాలి. సేవలు అందుబాటులో లేకుంటే రిఫరల్‌ ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. ఈ కేసులకు సంబంధించి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ద్వారా విడుదల చేస్తారు. అదేవిధంగా కొత్త డిస్పెన్సరీల ఏర్పాటు బాధ్యత ఇన్సూరెన్స్‌ మెడికల్‌ స ర్వీసెస్‌ డైరెక్టరేట్‌ పర్యవేక్షిస్తుంది. 

ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి 
ఈఎస్‌ఐసీ రేట్‌ కాంట్రాక్ట్‌ ప్రకారం1,200ల రకాల మందులు కొనుగోలు చేయాలి. కానీ ఆస్పత్రులలో కేవలం 200లోపు రకాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు 365 రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్‌ మందులు లేకపోవడం బాధాకరం. కనీసం టీటీ ఇంజక్షన్‌ కూడా లేదనడం దారుణమైన విషయం. 

కార్మీకుల నుంచి ప్రతి నెలా చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేషన్‌.. మందులను కూడా సకాలంలో కొనుగోలు చేసి పంపించాలి. అలాకాకుండా క్షేత్రస్థాయిలో మందులు కొనుగోలు చేసుకోవాలని చెప్పడం విచారకరం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మందుల సమస్యను పరిష్కరించాలి. 
– బి.అర్జున్, సీఐటీయూ నాయకులు, సంగారెడ్డి 

సేవలు అధ్వానం  
షుగర్‌ కిట్లు అందుబాటులో లేవు. ఆర్నెల్లుగా వీటి జాడ లేదు. చాలావరకు టెస్టులు బయటే చేయిస్తున్నారు. నా మిత్రుడు అత్యవసర పరిస్థితిలో సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే అక్కడి సిబ్బంది అడ్మిట్‌ చేసుకోలేదు. ఈఎస్‌ఐ సేవలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. 
– గంగాధర్‌రావు 

బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు ఇవ్వట్లేదు 
మా తల్లిదండ్రులకు బీపీ, షుగర్‌ ఉంది. దీంతో ప్రతి నెలా మాత్రల కోసం ఈఎస్‌ఐ ఆర్సీపురం ఆస్పత్రికి వెళ్తాను. గత నాలుగు నెలలుగా ఈ మాత్రలు లభించడం లేదు. ఇద్దరికీ బీపీ, షుగర్‌ మాత్రలకు రూ.వెయ్యి ఖర్చు అవుతోంది. నెలవారీ చందా చెల్లిస్తున్నా నాకు పెద్దగా ఉపయోగం కలగడంలేదు. 
– బి.విష్ణు, పటాన్‌చెరు

ఇంజక్షన్‌ కోసం ఇబ్బందులు 
మా బాబుకు హిమోఫిలియా అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. దీనికి ప్రత్యేక ఇంజక్షన్‌ అవసరం. ఆర్సీపురం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సంప్రదించా. అక్కడ స్టాక్‌ లేదని చెప్పారు. నాచా రం ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ్నుంచి ఆ ఇంజక్షన్‌ తెచ్చుకునేందుకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు.  
– అశోక్‌ ముదిరాజ్, ఆర్సీపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement