breaking news
Shortage funds
-
మందు గోలీ.. ఖాళీ!
(చిలుకూరి అయ్యప్ప) ఈఎస్ఐ డిస్పెన్సరీలతో పాటు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులు కూడా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్నపాటి జబ్బులకు కూడా సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా మందులు కరువయ్యాయి. కొన్ని డిస్పెన్సరీల్లో జ్వరం, దగ్గు మందులు కూడా లేవు. అనారోగ్యంతో వెళ్లే రోగులకు సాధారణ పరిశీలన నిర్వహించి మందు బిళ్లలు రాసిస్తున్నారు. మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కార్మీకుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేస్తున్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) స్ఫూర్తి దెబ్బతింటోంది. నిధుల కొరత, క్షేత్రస్థాయి డిమాండ్‌పై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్నెల్లుగా సమస్య జఠిలం గత ఆర్నెల్లుగా సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ ఈ సమస్య తీవ్రమైంది. కొన్ని డిస్పెన్సరీల్లో పారాసిటమల్ మాత్రలు కూడా నిండుకున్నాయి. మందులు ఇవ్వకపోవడంపై కొన్నిచోట్ల రోగులు, వైద్య సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ప్రాంతీయ ఆస్పత్రుల్లో సర్జరీలు చేయించుకున్న రోగులకు కేవలం రెండ్రోజులకు సరిపడా మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వాటిని డిస్పెన్సరీల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడ స్టాక్ లేకపోవడంతో మందులు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డిమాండ్ తెలిస్తేనే కొనుగోలు.. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందుల అంశం ఇప్పుడు అధికారులు, సిబ్బంది మధ్య దుమారం రేపుతోంది. ఉన్నతాధికారులకు ఈ అంశంపై ఫిర్యాదులు, వినతులు అందుతున్నాయి. సాధారణంగా మందుల కొనుగోలు ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. దీంతో వారు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో మందుల కొనుగోలుకు అనుమతి వచి్చనట్లు సమాచారం. కాగా ఈ అంశంపై నాచారం ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘మందుల కొనుగోలుకు పది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో డిస్పెన్సరీల నుంచి డిమాండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నాం. ఈ నెల ఐదో తేదీ కల్లా సమరి్పంచాలని ఆదేశించాం. అక్కడ్నుంచి నివేదికలు అందిన తర్వాత వాటిని క్రోడీకరించి కొనుగోలు ప్రక్రియ చేపడతాం’అని ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు పద్ధతి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎస్‌ఎంఐడీసీ) నేరుగా మందులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. ఈఎస్ఐ ఆస్పత్రులకు మాత్రం సూపరింటెండెంట్లు.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. వాటిని తమ పరిధిలోని డిస్పెన్సరీలకు సరఫరా చేయాలి. బిల్లుల చెల్లింపులు మాత్రం సూపరింటెండెంట్ స్థాయిలోనే ఉంటుంది. రాష్ట్రంలో ఈఎస్ఐ స్వరూపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈఎస్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. ఒక్కో చందాదారు నెలకు తన వేతనంలో 0.75 శాతం చందా ఇస్తుండగా, యాజమాన్యం 3.25 శాతం చొప్పున చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్‌కు జమ అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్ ఎంప్లాయిస్ సేŠట్ట్ ఇన్సూరెన్స్ విభాగానికి నిధులు విడుదల చేస్తుంది. ఏటా సగటున రూ.650 కోట్ల మేర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర విభాగానికి నిధులు అందుతాయి. దీంతో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. ⇒ రాష్ట్రంలో నాలుగు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఇవి నడుస్తున్నాయి. ⇒ వీటి పరిధిలో 71 డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ రీజియన్ పరిధిలో 53 డిస్పెన్సరీలుండగా, వరంగల్ రీజియన్ పరిధిలో 18 ఉన్నాయి. ⇒ అదేవిధంగా రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు నిజామాబాద్, జీడిమెట్లలో ఉన్నాయి. ⇒ 21 లక్షల ఈఎస్ఐ చందాదారులకు సంబంధించి మొత్తం 90 లక్షల నుంచి కోటి మంది సభ్యులున్నట్లు అంచనా. ఒక్కో కార్డుదారు కుటుంబంలో తల్లిదండ్రులు, ఇతర సభ్యులు కూడా ఉంటారు. దీంతో సేవలు అందుకునే వారి సంఖ్య కోటికి చేరువలో ఉంది. ⇒ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఓపీ సేవలు అందిస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు సర్జరీలు, ఇన్‌పేషంట్ సేవలు, స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ సేవలు అందించాలి. సేవలు అందుబాటులో లేకుంటే రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. ఈ కేసులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విడుదల చేస్తారు. అదేవిధంగా కొత్త డిస్పెన్సరీల ఏర్పాటు బాధ్యత ఇన్సూరెన్స్ మెడికల్ స ర్వీసెస్ డైరెక్టరేట్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి ఈఎస్ఐసీ రేట్ కాంట్రాక్ట్ ప్రకారం1,200ల రకాల మందులు కొనుగోలు చేయాలి. కానీ ఆస్పత్రులలో కేవలం 200లోపు రకాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు 365 రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మందులు లేకపోవడం బాధాకరం. కనీసం టీటీ ఇంజక్షన్ కూడా లేదనడం దారుణమైన విషయం. కార్మీకుల నుంచి ప్రతి నెలా చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేషన్.. మందులను కూడా సకాలంలో కొనుగోలు చేసి పంపించాలి. అలాకాకుండా క్షేత్రస్థాయిలో మందులు కొనుగోలు చేసుకోవాలని చెప్పడం విచారకరం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మందుల సమస్యను పరిష్కరించాలి. – బి.అర్జున్, సీఐటీయూ నాయకులు, సంగారెడ్డి సేవలు అధ్వానం షుగర్ కిట్లు అందుబాటులో లేవు. ఆర్నెల్లుగా వీటి జాడ లేదు. చాలావరకు టెస్టులు బయటే చేయిస్తున్నారు. నా మిత్రుడు అత్యవసర పరిస్థితిలో సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేందుకు ప్రయత్నిస్తే అక్కడి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. ఈఎస్ఐ సేవలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. – గంగాధర్‌రావు బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వట్లేదు మా తల్లిదండ్రులకు బీపీ, షుగర్ ఉంది. దీంతో ప్రతి నెలా మాత్రల కోసం ఈఎస్ఐ ఆర్సీపురం ఆస్పత్రికి వెళ్తాను. గత నాలుగు నెలలుగా ఈ మాత్రలు లభించడం లేదు. ఇద్దరికీ బీపీ, షుగర్ మాత్రలకు రూ.వెయ్యి ఖర్చు అవుతోంది. నెలవారీ చందా చెల్లిస్తున్నా నాకు పెద్దగా ఉపయోగం కలగడంలేదు. – బి.విష్ణు, పటాన్చెరుఇంజక్షన్ కోసం ఇబ్బందులు మా బాబుకు హిమోఫిలియా అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. దీనికి ప్రత్యేక ఇంజక్షన్ అవసరం. ఆర్సీపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో సంప్రదించా. అక్కడ స్టాక్ లేదని చెప్పారు. నాచా రం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి ఆ ఇంజక్షన్ తెచ్చుకునేందుకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. – అశోక్ ముదిరాజ్, ఆర్సీపురం -
Sri Lanka economic crisis: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత
కొలంబో: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు. ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్ కంపెనీలు ఇష్టపడడం లేదు. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. చమురు కొరతతో గత నెలలో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి. -
పీహెచ్సీ నిధుల్లో కోత
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కోఆస్పత్రికి అభివృద్ధి కింద ఎన్హెచ్ఎం నిధులు రూ.1.75 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.1.27 కోట్లు రావాల్సి ఉండగా గతేడాది కేవలం రూ.27.74 లక్షలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాది ఒక్కో పీహెచ్సీ కి రూ.75లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇలా ఏడాదికేడాది ఈ నిధులను తగ్గిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)లు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆస్పత్రి అభివృద్ధి కోసం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ప్రతీ సంవత్సరం వచ్చే నిధుల్లో కోత పెట్టడమే దీనికి కారణమైంది. దీంతో అరకొర నిధులతో ఆరోగ్య కేంద్రాలను నెట్టుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ నిధిని వినియోగించుకునే పరిస్థితి ఉండగా నిధుల కోత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకులతో పాటు అధికారులు ఈ నిధుల విషయంలో పట్టించుకుంటేనే ఏదైనా ప్రయోజనం దక్కే పరిస్థితి ఉంది. అభివృద్ధి ఆ నిధులతోనే.. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ప్రతీ ఏడాది ఆసుపత్రి అభివృద్ధి నిధులు మంజూరవుతాయి. ఒక్కో ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లకు రూ.5లక్షల చొప్పున, ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కి రూ.1.75లక్షల చొప్పున ప్రతీ ఏడాది నిధులు రావడం జరుగుతోంది. ఏహెచ్, సీహెచ్‌సీలకు నిర్ధారిత ఎన్హెచ్ఎం నిధులు వస్తుండగా పీహెచ్‌సీలకే పూర్తిస్థాయిలో రావడంలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, బోథ్, సిర్పూర్, ఆసిఫాబాద్, జైనూర్‌లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్, నిర్మల్(ఎంసీహెచ్)లలో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధి నిధులకు సంబంధించిన ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులకు ఆయా ఎమ్మెల్యేలు చైర్మన్‌గా, సూపరింటెండెంట్లు మెంబర్ కన్వీనర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పీహెచ్‌సీలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షుడు చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా, స్థాని క జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులు గా ఉంటారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు సమావేశమై నిధుల వినియోగానికి సంబంధించిన తీ ర్మాణం చేసి వినియోగిస్తారు. ప్రధాన ఆస్పత్రుల్లో భవన మరమ్మతులు, రంగులు వేయడం, ల్యాబ్ పనిముట్ల కొనుగోలు, రోగికి సౌకర్యంగా ఉండే విధంగా ఈ నిధులను వెచ్చించాలి. ఆస్పత్రుల్లో మందులు లేనిపక్షంలో, సెంట్రల్ డ్రగ్‌స్టోర్ (సీడీసీ)లో కూడా ఆ మందులు అందుబాటులో లేకుంటే ఈ నిధుల నుంచి వాటిని బయట కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిధులలేమి కారణంగా ఒకవేళ సీడీసీలో కూడా ఆ మందులు అందుబాటులో లేకపోతే ఏంచేయలేని పరిస్థితుల్లో చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పేదలకు మందులు అందని పరిస్థితి. వరుసగా కోత.. ఎన్హెచ్ఎం నిధుల విషయంలో గత రెండేళ్లుగా నిర్ధారిత కోటా రావడం లేదు. దీంతో పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. ప్రతీ సంవత్సరం రెండు విడతల్లో రూ.1.75 లక్షలు విడుదల చేసేవారు. అయితే గత మార్చిలో కేవలం రూ.38వేలు, అంతకుముందు ఏడాది రూ.75వేలు మాత్రమే విడుదల చేశారు. వరుసగా ఈ నిధుల్లో భారీగా కోత విధిస్తుండడంతో ఆస్పత్రుల్లో చిన్నచిన్న మరమ్మతులకు కూడా నిధులు లేని పరిస్థితి కనిపిస్తోంది. కారణాలేమిటి? ఎన్హెచ్ఎం నిధులు పీహెచ్‌సీలకు కోత విధించడం పట్ల కారణం ఏమై ఉంటుందన్న అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిధుల వినియోగం అంచనా ప్రకారం కేంద్రం నుంచి ఆ నిధులను విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ) అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇది ప్రతీ సంవత్సరం నిరంతరంగా జరిగే ప్రక్రియ. అయితే నిధుల వినియోగంలో అసమర్థత కారణంగా ఈ కోత జరిగిందా?..లేనిపక్షంలో యూసీలు సమర్పించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం నిధులకు అనుగుణంగా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఎన్హెచ్ఎం నిధులకు అనుగుణంగా జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. గతం కంటే ఇప్పుడు నిధులు తక్కువగా వచ్చాయి. రాష్ట్రం నుంచి నేరుగా ఈ ఎన్హెచ్ఎం నిధులు ఆస్పత్రులకు వస్తాయి. ఒకవేళ ఈ నిధులు సరిపోని పక్షంలో కలెక్టర్‌కు నోట్ పెట్టి ఏదైనా పనులు చేపడతారు. దానికి సంబంధించి కలెక్టర్ నుంచి నిధులు ప్రత్యామ్నాయంగా ఇస్తారు. – డాక్టర్ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
గ్రామాభివృద్ధికి అవరోధంగా నిధుల కొరత
శ్రీకాకుళం: గ్రామ వికాసంతోనే దేశ వికాసం సాధ్యమన్నది నానుడి. ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యాలను నిర్ధేశించుకొని వాటి ల క్ష్యాలను సాధించేందుకు గ్రామ పంచాయతీలు కృషిచేయాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పంచాయతీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. గ్రామీణులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. జిల్లాలో 1101 పంచాయతీలున్నాయి. వీటి ద్వారా పంచాయతీ శాఖ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.9 కోట్లకు పైగా ఆదాయం రావలసి ఉంది. పంచాయతీల జనాభా సుమారు 24 లక్షల వరకు ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటి ఖర్చులకు సంబంధించి ముందుగానే నిర్ధేశం చేస్తుండడంతో వేరొక అవసరాలకు నిధులు ఖర్చుచేసే అవకాశం లేకుండా పోతోంది. రాష్ట్రం ఇచ్చేది తక్కువే... రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులు రూ.1 లక్ష లోపే ఉంటుంది. ఆ నిధులు పంచాయతీల విద్యుత్ చార్జీలకు కూడా చాలకపోవడంలో అతిశయోక్తి లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ కారణంగా ఆ నిధులు వేరొక అవసరానికి వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. పంచాయతీలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూళ్లపై ల క్ష్యాలను నిర్ధేశించి వాటి వసూళ్లలో పంచాయతీ కార్యదర్శులు కఠినంగా వ్యవహరించేలా చేసింది. జిల్లాకు రూ. 25 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా నిర్ధేశించగా రూ.10 కోట్లు మాత్రమే కార్యదర్శులు వసూలు చేయగలిగారు. ఈ పన్ను వసూళ్లకు పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్, వార్డు సభ్యులతో బృందాలుగా ఏర్పరచి కమిటీని నియమించింది. అయితే వారినుంచి సరైన సహకారం లేకపోగా రాజకీయంగా ప్రజల వద్ద చెడ్డ కాకుండా ఉండేందుకు పరోక్షంగా ప్రజలు పన్ను చెల్లించకుండా ఉండేలా కొందరు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వ్యవహరించారు. ఇది కూడా పన్ను వసూళ్లకు అవరోధం కల్పించింది. ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధికారులు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వారంతా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. పన్నును మూడింతలు చేయడంతో గ్రామీణులు అవస్థలు పడుతుండగా అసౌకర్యాలు వారిని వేధిస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మండు వేసవిలో నీటి ఎద్దడిని గ్రామస్థులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. విద్యుత్ బకాయిలు పెరిగిపోవడంతో వాటిని చెల్లించాలంటూ అప్పుడప్పుడూ విద్యుత్‌శాఖ సరఫరాను నిలిపివేస్తుండడంతో గ్రామాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. ఇలా అన్ని విషయాల్లో పంచాయతీలు సమస్యల్లో ఉండడం వల్ల ఆ ప్రభావం రాష్ట్ర, దేశ ప్రగ తిపై పడేలా కనిపిస్తోంది.


