దేశానికే ఆదర్శం కావాలి | Revanth Inspects Hakimpeta Edn Hub: Telangana | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శం కావాలి

Sep 5 2026 4:14 AM | Updated on Sep 5 2026 4:14 AM

Revanth Inspects Hakimpeta Edn Hub: Telangana

హకీంపేటలో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ డిజైన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నఎడ్యుకేషన్‌ హబ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి

తమ ప్రభుత్వం పేదలను అమ్మలా ఆదుకుంటుందని వెల్లడి 

రెండు రోజుల కొడంగల్‌ పర్యటనలో భాగంగా పలు మండలాల్లో పర్యటన 

వివిధ అభివృద్ధి పనుల పరిశీలన.. గడువులోగా  పూర్తి చేయాలని ఆదేశం 

నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

కొడంగల్‌/బొంరాస్‌పేట/కోస్గి: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని.. అమ్మలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. వికారాబాద్‌ జిల్లాలోని మద్దూరు, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్‌లో దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారుకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ (విద్యా ప్రాంగణం) నిర్మాణ పనుల్లో పురోగతిని పరిశీలించారు. ఈ విద్యా ప్రాంగణం దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. 

పనుల్లో వేగం పెంచాలని.. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూనే 2027 మార్చిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు విధించారు. విద్యా ప్రాంగణం చుట్టూ వర‡్ష్షం నీరు నిలవకుండా ఏర్పాట్లు చేయాలని.. ఇందుకోసం టెక్నాలజీ వినియోగించుకోవాలని సూచించారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విద్యా ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్‌ కళాశాల, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్, ఏటీసీ, సైనిక్‌ స్కూల్, వెటర్నరీ కళాశాల, 430 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 

కొడంగల్‌ ఎత్తిపోతలను త్వరలో పూర్తి చేయాలి 
మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హకీంపేటలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కొడంగల్‌ ఎత్తిపోతల భూసేకరణ పూర్తి చేయాలని.. ఫేజ్‌– 2 పనులకు త్వరలో టెండర్లు పిలవాలని సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా చర్చించి డిజైన్లు రూపొందించాలన్నారు. అలాగే మలీ్టపర్పస్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌ భూసేకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్‌ వరకు నిర్మించనున్న రేడియల్‌ రోడ్డుపైనా దృష్టి పెట్టాలన్నారు.  

మద్దూరులోనూ అభివృద్ధి పనుల పరిశీలన.. 
సీఎం రేవంత్‌రెడ్డి అంతకుముందు మద్దూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులతోపాటు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పదేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమి.. నేడు పేద పిల్లల భవిష్యత్తుకు పునాదిగా మారిందన్నారు. నాడు ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తించి నేడు ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంకను ఆదేశించారు. నాడు ప్రజల కోసం వేసిన అడుగు.. నేడు పేద పిల్లల భవిష్యత్తుకు బాటగా మారడం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నేడు నకిరేకల్‌కు సీఎం 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాకు రానున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. 100 పడకల ఆసుపత్రి భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు త్వరలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా నకిరేకల్‌లో నిర్వహించే ప్రజావికాస బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement