హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో “అమెరికన్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్” అంశంపై ఉన్నతస్థాయి పబ్లిక్ లెక్చర్, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమెరికా జాతీయ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (NCAA) మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పాలసీ అండ్ గవర్నెన్స్) శ్రీ కెవిన్ లెన్నన్ పాల్గొని అమెరికా కాలేజియేట్ క్రీడా వ్యవస్థ, క్రీడా పాలన, అథ్లెట్ అభివృద్ధి, స్కాలర్‌షిప్‌లు, క్రీడా-విద్య సమతుల్యత, క్రీడా శాస్త్రం, హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ తదితర అంశాలపై తన అనుభవాలను పంచుకున్నారు.
భారత్–అమెరికా క్రీడా వ్యవస్థల మధ్య జ్ఞాన మార్పిడిలో భాగంగా విశ్వవిద్యాలయ క్రీడల నిర్మాణం, ప్రతిభా గుర్తింపు, కోచింగ్, పరిశోధన, క్రీడా సాంకేతికత, క్రీడాకారుల సంక్షేమం, వాణిజ్య భాగస్వామ్యాలు మరియు అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రపంచ స్థాయి, క్రీడాకారుల కేంద్రిత క్రీడా విద్యా వ్యవస్థను తెలంగాణలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, అధ్యాపకులు–విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధన, కోచ్‌ల శిక్షణ, క్రీడా శాస్త్రం, సాంకేతికత మరియు ఆవిష్కరణలకు sports university ప్రాధాన్యం ఇస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి వైపెసు వైస్ చాన్సలర్ డాక్టర్ కిశోర్ గోపీనాథన్ అధ్యక్షత వహించగా, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ప్రతినిధులు శ్రీమతి ఎమీలియా స్మిత్, శ్రీ టి. సెంథిల్ కుమార్, మాజీ ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ చిన్నప్ప రెడ్డి, , ఓఎస్‌డీ డాక్టర్ కె. నరసయ్య, క్రీడా నిపుణులు, విద్యావేత్తలు, క్రీడాకారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
క్రీడలు విద్య, పరిశోధన, సాంకేతికత, ఆరోగ్యం, ఉపాధి మరియు మానవ వనరుల అభివృద్ధితో అనుసంధానమైన సమగ్ర వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉత్తమ విధానాలను తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధికి అనుసంధానించేందుకు వైపెసు కట్టుబడి ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు.


