మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ లభించింది. మూడురోజుల పాటు ఉక్రెయిన్‌పై ఎటువంటి దాడులు చేయవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల నేపథ్యంలో అమెరికా ప్రతినిధులు రష్యా వచ్చిన నేపథ్యంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మారణహోమం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు కొంతమేర ఊపశమనం లభించింది.
ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై చర్చలకు అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో చేరుకున్నారు. వారిద్దరితో యుద్ధం అంశమై పుతిన్ చర్యలు జరపనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ శనివారం (ఈ రోజు) అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు కీవ్‌పై ఎలాంటి దాడులు జరపకూడదని పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే చర్చలు ముగిసిన అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మాస్కో చేరుకున్న అమెరికా ప్రతినిధులు
కాగా గత కొంతకాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశాన్ని అమెరికా పట్టించుకోవడం లేదు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై ట్రంప్ ఆసక్తి కనబరచలేదు. దీంతో చర్చలను మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో చేరుకున్నారు. వీరికి రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియెవ్.. మాస్కో విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
యుద్దంపై ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశమై మాట్లాడుతూ యుద్ధానికి ముగింపు పలికేందుకు వాషింగ్టన్ వద్ద తాజాగా ఒక స్పష్టమైన ప్రతిపాదన ఉందని తెలిపారు.కాగా ఈ పర్యటన అనంతరం అమెరికా ప్రతినిధులు రేపు ఆదివారం అమెరికా ప్రతినిధులు మాస్కో పర్యటన ముగించుకుని ఆదివారం ఉక్రెయిన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం


