వందేమాతరం.. అస‌లు అర్థం ఇదే! | Vande Mataram real meaning by Dr Raghu Chaliganti | Sakshi
Sakshi News home page

వందేమాతరం... ఆ తర్వాత?

Sep 7 2026 7:20 PM | Updated on Sep 7 2026 7:37 PM

Vande Mataram real meaning by Dr Raghu Chaliganti

అభిప్రాయం

‘వందేమాతరం’ అనగానే మనలో గర్వం ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, మన జాతీయ చైతన్యంలో ఈ గేయానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని 150వ వార్షికోత్సవాన్ని గర్వంగా జరుపుకోవడం సముచితమే. ఆ గేయం మనకు చూపించిన మాతృభూమి స్వరూపాన్ని నేటి పరిస్థితుల్లో మరోసారి అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం.

బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృభూమిని కేవలం భౌగోళిక సరిహద్దులుగా ఊహించలేదు. సుజలాం– సమృద్ధిగా జలాలు కలది. సుఫలాం– ఫలసంపదతో నిండినది. సస్య శ్యామలాం– పచ్చని పంటలతో కళ కళలాడేది. అంటే ‘వందేమాతరం’లోని మాతృభూమి కేవలం భూభాగం కాదు. మనిషి, నేల, నీరు, వ్యవసాయం, ప్రకృతి పరస్పరం ఆధారపడిన ఒక సజీవ వ్యవస్థ. వందే మాతరం మన గర్వానికి ప్రతీక అయితే, ఆ మాతృభూమిని కాపాడటం మన బాధ్యత.

స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి భారతదేశం వరకు మన జాతీయ ఆలోచనా రూపకల్పనలో ఎన్నో శక్తిమంతమైన భావనలు రూపుదిద్దుకున్నాయి– భారతమాత, గ్రామ స్వరాజ్యం, స్వదేశీ, సర్వోదయం నుంచి బేటీ బచావో బేటీ పఢావో, వికసిత భారత్‌ వరకు ఎన్నో. ఇవి కేవలం నినాదాలు కావు. మాతృభూమిని ‘సుజలాం’ అని కీర్తిస్తే మన నీటి నాణ్యత, జలవనరుల స్థిరత్వం ముఖ్యం. ‘సస్య శ్యామలాం’ అని పాడితే నేల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం ముఖ్యం. ‘గ్రామ స్వరాజ్యం’ అంటుంటే గ్రామాలకు తమ వనరులను సంరక్షించుకునే సామర్థ్యం ఉండాలి. ‘సర్వోదయం’ అంటుంటే అభివృద్ధి అట్టడుగు వర్గాల వరకు చేరాలి. ‘బేటీ పఢావో’ అంటుంటే ప్రతి బాలిక పాఠశాలలో గౌరవంగా చదువుకోగలగాలి.

కేవలం నినాదాలా?
ఒక గ్రామ పాఠశాలను ఊహించుకుందాం. ఉదయం పిల్లలు కలిసి ‘వందేమాతరం’ ఆలపిస్తారు. కానీ పాఠశాల పైకప్పు సురక్షితంగా ఉందా? మరుగుదొడ్లు పనిచేస్తున్నాయా? బాలికలు వాటిని గోప్యతతో, గౌరవంగా ఉపయోగించగలుగుతున్నారా? ఉపాధ్యాయులు ఉన్నారా? పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారా? అని పరిశీలించాలి. ఇవి దేశభక్తికి వ్యతిరే కమైన ప్రశ్నలు కావు. పాఠశాలలో కుళాయి ఉండటం మాత్రమే కాదు– పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందడం ముఖ్యం. మరుగుదొడ్డి ఉండటం మాత్రమే కాదు– అది పరిశుభ్రంగా, ఉపయోగించడానికి అనువుగా ఉండటం ముఖ్యం. బాలికను బడికి పంపించడంతోనే మన బాధ్యత తీరిపోదు. ఆమె ఎలాంటి ఇబ్బంది, భయం, అవమానం లేకుండా గౌరవంగా చదువు కొనసాగించగల వాతావరణం కూడా కల్పించాలి.

ఇదీ చ‌ద‌వండి: ఉపాధ్యాయుడికి ఏఐ ప్ర‌త్యామ్నాయం కాదు!

నీటి భద్రత, నేల క్షీణత, కాలుష్యం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, సహజ పర్యావరణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి సవాళ్ల సమయంలో ‘వందేమాతరం’లోని ప్రకృతి దృశ్యానికి కొత్త ప్రాసంగికత ఉంది. బంకించంద్రుడు మనం ఏమి కాపాడాలో చెప్పారు. గాంధీజీ ఆ బాధ్యత ఎక్కడ (గ్రామస్వరాజ్యం) మొదలవ్వాలో చూపించారు. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి సుస్థిరమైన వికసిత భారత్‌ను నిర్మించడం మన ముందున్న సవాలు.

- డాక్ట‌ర్‌ రఘు చలిగంటి 
అగ్రికల్చరల్‌ ఎకానమిస్ట్, పాలసీ రిసెర్చర్, జర్మనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement