ఓట్ల కోసం వందేమాతరానికి అవమానమా?  | BJP passes resolution to honour and protect legacy of Vande Mataram | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం వందేమాతరానికి అవమానమా? 

Aug 23 2026 5:03 AM | Updated on Aug 23 2026 5:03 AM

BJP passes resolution to honour and protect legacy of Vande Mataram

కాంగ్రెస్‌ తీరుపై బీజేపీ మండిపాటు 

జాతీయ పదాధికారుల భేటీలో ఏకగ్రీవ తీర్మానం 

నితిన్‌ నబీన్‌ అధ్యక్షతన తొలి సమావేశం 

సీడబ్ల్యూసీ తాజా నిర్ణయంపై మండిపాటు

సాక్షి, న్యూఢిల్లీ: బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ వందేమాతర గీతాన్ని అవమానిస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ ఆగస్టు 19న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన జాతీయ పదాధికారుల తొలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. 

ఈ సమావేశంలో వందేమాతరం ప్రతిష్టను, చారిత్రక ప్రాముఖ్యతను పరిరక్షించేందుకు 10 అంశాలతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వందేమాతరం గేయ విశిష్టతను చాటేలా, దాని ప్రాముఖ్యతపై యువతలో అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ కాంగ్రెస్‌ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దశాబ్దాల క్రితం ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలకు కొనసాగింపేనని పదాధికారుల భేటీ అభిప్రాయపడింది.

 మరోవైపు, వందేమాతరానికి గేయం గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసిందని బీజేపీ వెల్లడించింది. ఇటీవల ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు. కానీ అదే రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పాడుతుండగా, రెండో చరణం తర్వాత ఆపేయాలని సోనియా గాంధీ సైగ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. 1937 నాటి నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ రెండు చరణాలు మాత్రమే పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆగస్టు 19న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించడాన్ని బీజేపీ విమర్శించింది. 

ముస్లిం లీగ్‌ లాంటి శక్తుల అభ్యంతరాలకు తలొగ్గిన నాటి మనస్తత్వమే కాంగ్రెస్‌లో నేటికీ ఉందని మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా, జాతీయ గీత పరిరక్షణ కోసం పదాధికారుల సమావేశంలో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 19న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా ఖండిస్తూ, పూర్తి వందేమాతరం గౌరవాన్ని పరిరక్షిస్తామని తీర్మానించింది. వందేమాతరం ఒక శక్తిమంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదమని, శుద్ధమైన జాతీయ భావనకు ప్రతీక అని నాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. జాతీయ స్ఫూర్తిని రగిలించిన ఈ గీతాన్ని సంకుచిత రాజకీయాలకు వాడుకోవడాన్ని అడ్డుకుంటామని తీర్మానంలో స్పష్టం చేసింది.  

నూతన పదాధికారులతో ప్రధాని భేటీ 
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన జాతీయ పదాధికారులతో ప్రధాని మోదీ శనివారం భేటీ అయ్యారు. కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాల సమ్మేళనంగా పార్టీని మార్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా పదాధికారులను ఎంపిక చేసినట్లు వారితో మోదీ చెప్పారు. ‘‘సంస్థాగత సమావేశాలు అనేవి కొత్త ఆలోచనల సమ్మేళనంగా జరుగుతాయి. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కొత్త నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను వినేందుకు పార్టీ సమావేశాలు జరుగుతుంటాయి. పారీ్టలో కొత్త బాధ్యతలు భుజాలకెత్తుకున్న నూతన పదాధికారులతో భేటీ అద్భుతంగా సాగింది’’అని వాళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement