సీజేపీ ఎఫెక్ట్‌.. సంచలన విషయాలు వెలుగులోకి! | CJP Effect: Rajasthan School Infrastructure Crisis Exposed | Sakshi
Sakshi News home page

సీజేపీ ఎఫెక్ట్‌.. సంచలన విషయాలు వెలుగులోకి!

Aug 22 2026 2:00 PM | Updated on Aug 22 2026 2:15 PM

CJP Effect: Rajasthan School Infrastructure Crisis Exposed

కాక్రోచ్‌ జనతా పార్టీ కొత్త ఉద్యమంతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త చర్చ మొదలైంది. స్కూల్‌ ఠీక్‌ కరో పేరిట చేపట్టిన ఆ కార్యక్రమం.. నిన్న రాజస్థాన్‌లో తీవ్ర దుమారం రేపింది. జైపూర్‌ శివారులోని బాగ్రు గ్రామానికి వెళ్లిన ఆ బృందంపై దాడి జరిగింది. ఇది బీజేపీ చేయించిన పనేనని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డెడ్‌లైన్‌ కూడా విధించింది. ఈలోపు.. అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

సీజేపీ తనిఖీ ఎఫెక్ట్‌ ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాగ్రు స్కూల్‌ గురించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. 

అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు దానిని వినియోగానికి అనర్హంగా ప్రకటించారట. దీంతో విద్యార్థులను తాత్కాలిక ఏర్పాట్లలోకి తరలించారు. అయితే తరగతులు పశువుల కొట్టం తరహా ప్రదేశంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలతోనే CJP బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఘటన తర్వాతే సంచలన విషయాలు బయటపడ్డాయి. 

సమగ్ర శిక్షా అభియాన్‌ కింద యూడీఐఎస్‌ఈ (UDISE) 2025–26 గణాంకాల ప్రకారం.. రాజస్థాన్‌లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి.  అందునా.. రాజధాని జైపూర్‌లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవు. జలావర్‌ జిల్లాలోని అక్లేరా బ్లాక్‌లో అత్యధికంగా 23 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఖాన్‌పూర్‌లో 16, ఝల్రాపటన్‌లో 11 పాఠశాలలు భవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం బడులలో.. 10 బాలికల పాఠశాలలకు భవనాలు లేవని తేలింది. 

భవనాలు ఉన్నా.. సదుపాయాల కొరత
కేవలం భవనాల కొరత మాత్రమే కాకుండా.. ఉన్న పాఠశాలల్లోనూ మౌలిక వసతుల లోపాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బన్స్వారా జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 188 పాఠశాలల్లో టాయిలెట్‌ సౌకర్యం లేదు. దుంగర్‌పూర్‌లో 124, ఉదయ్‌పూర్‌లో 98 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు దౌసా జిల్లాలో అత్యధికంగా 96 ఉన్నాయి.

దిద్దుబాటు చర్యలు
పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, భవనాలు లేని లేదంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే ఐదేళ్లలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం
భజన్‌లాల్‌ శర్మ సర్కార్‌పై ప్రతిపక్షం మండిపడుతోంది. వివరాలు దాస్తూ ప్రభుత్వం నీళ్లు నములుతోందని మండిపడింది. ఆడిట్‌ వివరాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత టీకారామ్‌ జూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితిపై సర్కార్‌కు స్పష్టమైన కార్యాచరణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, 83,783 తరగతి గదులు వినియోగానికి అనర్హంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితి కారణంగా కొన్ని చోట్ల తరగతులు నిలిపివేయాల్సి వచ్చిందని, విద్యార్థుల చేరికలపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.

అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భద్రత, పాఠశాలల ప్రమాణాల మెరుగుదల తమ ప్రాధాన్య అంశాలని స్పష్టం చేసింది.  ఈ మొత్తం ‍వ్యవహారం CJP తనిఖీల ఘటన నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. 

స్కూల్‌ తనిఖీలపై సర్కారీ ఆంక్షలు
ఇంతేకాదు.. కొద్ది రోజుల ముందే రాజస్థాన్‌ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని స్పష్టం చేసింది.

విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేకుండా ఎవరూ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా, అనధికారిక చిత్రీకరణను నియంత్రించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీజేపీ తనిఖీల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఆగమేఘాల మీద తీసుకొచ్చారని మండిపడ్డారు. పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం తగ్గించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే CJP ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమం, బాగ్రు ఘటన, ఆ తర్వాత బయటపడిన 611 పాఠశాలల గణాంకాలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో వివాదాస్పద ఉత్తర్వులను సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ మీటింగ్‌.. కొట్టుకున్న స్టూడెంట్‌ యూనియన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement