వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో తదుపరి దశ సంస్కరణలకు రంగం సిద్ధమవుతోంది. తొలుత అక్టోబర్ 7న జరగాల్సిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తాజాగా అక్టోబర్ 8కి వాయిదా పడింది. పన్ను రేట్ల మార్పులకంటే వ్యవస్థాగత సంస్కరణలు, రిజిస్ట్రేషన్, రిఫండ్, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), వివాద పరిష్కారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చని సమాచారం.
ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్టు అధికారాలు ప్రధాన చర్చగా మారాయి. దీనికి కారణం.. 2021-22 నుంచి 2024-25 మధ్య కేంద్ర జీఎస్టీ ఏర్పాట్ల పరిధిలో 72,393 నేర కేసులు గుర్తించగా, 887 అరెస్టులు జరిగాయి. ఈ సంఖ్యలో రాష్ట్ర జీఎస్టీ విభాగాల అరెస్టులు చేరలేదు.
అసలు ఏ నేరాలకు అరెస్టు?
ప్రస్తుత సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం, సెక్షన్ 132లో పేర్కొన్న కొన్ని తీవ్రమైన నేరాలపై కమిషనర్‌కు ‘నమ్మదగిన కారణం’ ఉంటే అరెస్టుకు అధికారం ఉంది. ముఖ్యంగా నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడం, సరఫరా లేకుండానే బిల్లులు సృష్టించి ఐటీసీ లేదా రిఫండ్ పొందడం, మోసపూరితంగా ఐటీసీ వినియోగించడం, పన్ను ఎగవేత, తప్పుడు ఖాతాలు లేదా పత్రాలు సృష్టించడం వంటి చర్యలు ఇందులోకి వస్తాయి. పన్ను ఎగవేత/మోసపూరిత ఐటీసీ/రిఫండ్ కేసుల్లో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధన ఉంది.
ఇటీవలి అధికారిక కేసుల్లో ఈ మోసాల స్వరూపం స్పష్టమవుతోంది. ఉదాహరణకు, ఢిల్లీ సౌత్ సీజీఎస్టీ అధికారులు బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా రూ.60.59 కోట్ల మోసపూరిత ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(అంటే వ్యాపారం కోసం కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించిన జీఎస్టీని, విక్రయాలపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి తగ్గించుకునే అవకాశం) పొందిన కేసులో అరెస్టు చేశారు. దర్యాప్తులో వాస్తవ వ్యాపారం లేకుండా కేవలం కాగితాలపై సంస్థలను నిర్వహించినట్లు గుర్తించారు.
ఇప్పుడు ఏం మారొచ్చు?
ఇక్కడే అసలు చర్చ మొదలైంది. వ్యాపార వర్గాల అభ్యంతరాల నేపథ్యంలో జీఎస్టీ చట్టంలోని అరెస్టు అధికారాలను తొలగించడం లేదా పరిమితం చేయడం, ఉద్దేశపూర్వక మోసాలను సాధారణ పన్ను ఉల్లంఘనల నుంచి వేరు చేయడం వంటి ప్రతిపాదనలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తుది నిర్ణయం మాత్రం కౌన్సిల్ సిఫారసు అనంతరం అవసరమైన చట్ట సవరణలపైనే ఆధారపడి ఉంటుంది.
దీని అర్థం అరెస్టులన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయని కాదు. అసలు లక్ష్యం.. సాంకేతిక లోపాలు, పన్ను వివాదాలు, నిజమైన వ్యాపార తప్పిదాలను క్రిమినల్ చర్యలుగా కాకుండా ఉద్దేశపూర్వక మోసం, నకిలీ బిల్లులు, బోగస్ ఐటీసీ వంటి తీవ్రమైన నేరాలపై కఠిన చర్య కొనసాగించేలా వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని చూస్తున్నారు.


