సందర్భం
ఎంఎస్ స్వామినాథన్‌కూ, వైఎస్ రాజ శేఖరరెడ్డికీ మధ్యన పోలికేంటి? వారిద్దరూ ఎక్కడైనా, ఎప్పుడైనా కలసి పనిచేశారా? లేదు. వారిద్దరూ నడిచిన బాటలు వేరే అయినప్పటికీ గమ్యం ఒక్కటే. అదే రైతు సంక్షేమం. స్వామినాథన్ ప్రముఖ శాస్త్ర వేత్త. భారత దేశంలో హరిత విప్లవానికి పితామహుడు. 1971 వరకూ ఇండియా ఆహార కోరతతో, పీఎల్ 420 పేరిట అమె రికా పంపుతున్న గోధుమల సాయంతో భారంగా బండినీడ్చుకుంటూ వస్తున్న దేశం. స్వామినాథన్ సృజన, పరిశ్రమ, దూరదృష్టితో దేశంలో ఆహార కొరతను అధిగమించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగాయి. రైతు పరిస్థితి మాత్రం అధ్వాన్నమైంది. ఈ దశలో రైతును ఆదుకునే రాజకీయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. స్వామినాథన్ శాస్త్రీయ దృక్పథం, వైఎస్ రైతుబాంధవ్యం కలసి రైతులను ఆదుకున్నాయి.
హరిత విప్లవానికి కొనసాగింపు...
‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్’ అనే మాటను సృష్టించిన వ్యక్తి ‘భారతరత్న’ స్వామినాథన్. గ్రీన్ రివల్యూషన్ తాత్కాలికమైనది కాదనీ, అది ఎప్పటికీ పురోభివృద్ధి చెందుతూ ఉండాలనీ ఆయన ఉద్దేశం. పంట దిగుబడి పెంచడం ఒక ఎత్తయితే, రైతుకు నష్టం లేకుండా చూడటం మరో ఎత్తు. స్వామినాథన్ పంట దిగుబడిని పెంచగలిగాడు కానీ ఉత్పత్తిదారులు అంటే రైతులు సంతోషంగా, సుఖంగా జీవించే విధంగా వారి జీవితాలను మార్చలేకపోయారు. ఇది శాస్త్రవేత్తల వల్ల అయ్యే పనికాదు. ఇందుకు అంకితభావం కలి గిన రాజనీతిజ్ఞుడు అవసరం. రాజశేఖరరెడ్డి వంటి నాయకుడు, పల్లెలు, రైతుల జీవితాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని శాస్త్రవేత్త కోణంలో చూడ లేదు. రాజకీయవేత్తగా చూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మూడున్నర దశాబ్దాల కిందటి నుంచి గ్రామాలు గురించీ, రైతుల గురించీ, రైతులు ఎదుర్కొనే కష్టాల గురించీ అవగాహన పెంచుకున్న రాజకీయ నాయకుడు ఆయన. కడపలో వైద్యుడిగా పని చేసిన రోజుల నుంచి 1978లో శాసన సభకు ఎన్నికైన తర్వాత ఓటమి ఎరుగకుండా అసెంబ్లీలోనో, పార్ల మెంటులోనో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ప్రజాసమస్యలను అవగాహన చేసుకున్న ప్రజల మనిషి ఆయన. 2003లో సుమారు పదిహేను వందల కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ పల్లెలనూ, పొలాలనూ, చిన్నపట్టణాలనూ దాటుకుంటూ, రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు. ఆ పాద యాత్రలో అవగతమైన అంశాలే ముఖ్యమంత్రిగా తాను రూపొందించిన విధానాలకు ప్రాతిపదికలైనాయి.
రైతులు ఎదుర్కొంటున్నది ఒక సమస్య కాదు. మంచి వంగడం దొరికితే నీరు అందదు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ వడ్డీకి రుణాలు లభించవు. ఇవన్నీ ఉన్నప్పటికీ సకాలంలో వానలు కురియవు. అన్నీ సవ్యంగా ఉండి పంట దిగుబడి అధికంగా వచ్చి నప్పటికీ మార్కెట్‌లో పంటకు తగిన ధర పలకదు. ఈ కష్టాలన్నీ వైఎస్‌కు కరతలామలకం కనుకనే ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలూ, కార్యక్రమాలూ అన్ని సమస్యలకూ సమాధానాలు అందించాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నచ్చజెప్పి రెండు లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేయించారు. ఇది దేశంలో మరో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయని సాహసం. నీరు అందించడం కోసం జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడానికీ, రైతుల గుండెలలో ధైర్యం నింపడానికీ అవసరమైన చర్య. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత విస్తృతంగా జలవనరుల అభివృద్ధికి చొరవ తీసుకోలేదు. వ్యవసాయదారులకు కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజులలోనే (2004 మేలోనే) ఈ సంస్కరణ ప్రవేశపెట్టారు. రైతులకు ఆరోగ్య బీమా ప్రవేశ పెట్టారు. ఒక సమగ్రమైన రైతు సంక్షేమ పథకాల ప్రణాళికను వైఎస్ తన ప్రభుత్వంలో ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఆయనకు రైతుల ఖర్చుల పట్ల, కష్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండటమే.
సరిగ్గా ఇక్కడే స్వామినాథన్, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాలని తరచి చూడాలి. స్వామినాథన్ సైన్సుద్వారా కృషి చేశారు. రాజ శేఖరరెడ్డి పరిపాలన ద్వారా రైతు జీవితాలలో ఆనందం తొంగి చూసేందుకు సహకరించారు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, గిట్టు బాటు ధరల ద్వారా రైతుల దిగుబడి పెంచి, వారికి గిట్టుబాటు ధర లభించడం ఎట్లాగా అన్న ప్రశ్నలకు సమాధానాలను స్వామినాథన్ అన్వేషించారు. వ్యవసాయపు ఖర్చుల భారాన్ని రైతుల భుజాలపై నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఏమి చేయగలదో రాజశేఖరరెడ్డి ఆలోచించారు. ఒకరు వ్యవసాయానికి శాస్త్రీయ పునాదులు వేస్తే, మరొకరు వ్యవసాయం గిట్టుబాటు కావడానికి అవసరమైన రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇద్దరూ కలసి ఎవరి దారిలో వారు చొరవ తీసుకున్నప్పుడే వ్యవసాయం బాగుంటుంది. రైతుల జీవితాలు గౌరవప్రదంగా ఉంటాయి. అందుకే, ‘డాక్టర్ వైఎస్ రాజ శేఖర రెడ్డి అవార్డు– 2026’ను నేడు దిల్లీలో జరిగే సభలో స్వామి నాథన్ ఫౌండేషన్‌కు ఇవ్వడం, అవార్డును ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్వీకరిస్తుండటం సముచితం.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యులు


