విద్వేషాల లోకంలో వివేకపు మట్టివాసన | Tribute to Wendell Berry by Agricultural Journalist Pantangi RamBabu | Sakshi
Sakshi News home page

విద్వేషాల లోకంలో వివేకపు మట్టివాసన

Sep 8 2026 2:31 PM | Updated on Sep 8 2026 2:39 PM

Tribute to Wendell Berry by Agricultural Journalist Pantangi RamBabu

ప్రముఖ అమెరికన్‌ రైతు–తాత్వికుడు, పర్యావరణ ఉద్యమకారుడు వెండెల్‌ బెర్రీ (92) మరణంతో ప్రపంచం ఒక గొప్ప శాంతి స్వరాన్ని కోల్పోయింది. కెంటకీ రాష్ట్రంలోని హెన్రీ కౌంటీకి చెందిన ఆయన గొప్ప సమగ్ర మానవుడిగా ప్రసిద్ధి గాంచారు. మరణం గురించి ఆయన ఒకసారి ఇలా రాశారు: ‘దీర్ఘాయువు అనే యంత్రాంగం విష యంలో జాగ్రత్త వహించండి. ఒక మనిషి జీవితం ముగిసినప్పుడు, అతను మరణించటమే సరైన పని. అడవి కూడా మరణం నుంచి తనను తాను కాపాడుకోదు’.

హెన్రీ కౌంటీలో ఆయన కుటుంబం 200 ఏళ్లకు పైగా వ్యవ సాయం చేస్తోంది. 1934లో వర్జీనియా ఎర్డ్‌మన్, న్యాయవాది జాన్‌ మార్షల్‌ బెర్రీ దంపతులకు జన్మించిన వెండల్‌ బెర్రీ డజన్ల కొద్దీ పుస్తకాలు రాశారు. భూమిని పరిరక్షించటం, భూమిని నైతికంగా ఉపయోగించవలసిన ఆవశ్యకత గురించి తన కవిత్వంలో, కాల్పని కేతర సాహిత్యంలో నిండుగా రాశారు. ఇంగ్లిష్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందిన బెర్రీ అనేక విశ్వవిద్యాలయాల్లో బోధించారు. అయినా, మట్టిని గాఢంగా ప్రేమించారు. ఆ గాఢతతోనే తన ఉద్యోగ జీవితా నికి స్వస్తి పలుకుతూ న్యూయార్క్‌ నగరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా తన సొంత ఊరు వెళ్లిపోయారు. చివరికి అక్కడే మొన్న ఆగస్ట్‌ 31న కన్నుమూశారు.

యుద్ధం–పర్యావరణ విధ్వంసం
తన సామానంతటినీ ఒక వోక్స్‌వ్యాగన్‌ బీటిల్‌ కారులో సర్దు కుని, ఇంటికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక పత్రి కతో ఇలా చెప్పారు: ‘కొంత భయం, వణుకుతో పాటూ సరైన పని చేస్తున్నాననే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు గొప్ప, గాఢమైన ఉపశమనం కలిగింది. చివరికి నేను నా నిజమైన మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా అనిపించింది’. భూమిని సంరక్షించటం మానవ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని ఆసాంతం ఆయన భావించారు.

యుద్ధాలు, వాతావరణ సంక్షోభం చుట్టుముట్టిన నేటి తరుణంలో ఆయన ప్రబోధించిన ‘న్యాయంతో కూడిన శాంతి’ సిద్ధాంతం ఎప్పటికీ ప్రాసంగికమే. ప్రకృతిని గౌరవిస్తూ మమేకమై జీవించటం, స్థానిక సమాజాల తరఫున నిలబడటం ద్వారానే శాశ్వత శాంతి, సామాజిక న్యాయం సాధ్యమని ఆయన తన జీవితం ద్వారా చాటిచెప్పారు.

మనిషి ప్రకృతిపై సాగిస్తున్న దాడికి, తోటి మనుషులపై చేస్తున్న యుద్ధాలకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని బెర్రీ ఎత్తి చూపారు. ఆయుధాలతో రక్తపాతం సృష్టించటం ఎంతటి హింసో... కార్పొరేట్‌ అత్యాశతో నేలను, నీటిని, అడవులను కొల్ల గొట్టటం కూడా అంతే తీవ్రమైన హింస అని ఎలుగెత్తారు. ప్రకృతిని దోచుకునే సమాజం తోటి మానవుల పట్ల శాంతియుతంగా ఉండలేదని హెచ్చరించారు. భూమికి జరుగుతున్న అన్యాయం అంతిమంగా మానవాళి వినాశనానికే దారితీస్తుందన్నది ఆయన ఆలోచనల మూలసూత్రం.

చ‌ద‌వండి: వందేమాత‌రం అస‌లు అర్థం ఇదే!

చాలా సందర్భాల్లో శాంతి అంటే కేవలం తుపాకుల మోత ఆగ టమో లేదా రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందమో అనుకుంటారు. కానీ బెర్రీ దృష్టిలో ‘న్యాయం లేని శాంతి’ నిలబడదు. వనరుల అసమాన పంపిణీ, అట్టడుగు వర్గాల ఆర్థిక దోపిడీ, బల హీనులను అణచివేసే వ్యవస్థలు కొనసాగినంత కాలం నిజమైన శాంతి సాధించలేం. యుద్ధ యంత్రాలు, ఆయుధ సంపత్తిని పోగెయ్యటం మాని... ఆకలి నిర్మూలన, నేల పునరుజ్జీవనం, పేదల హక్కుల పరిరక్షణవైపు మళ్లించినప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుందనేది ఆయన నిశ్చితాభిప్రాయం.

చిన్న రైతుల సేద్యమే...
ప్రపంచీకరణ తెచ్చిన విచ్చలవిడి వినియోగ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ‘స్థానిక సమాజాలు, స్వయంసమృద్ధి’ భావనలను బెర్రీ సమర్థించారు. బహుళజాతి సంస్థల గుత్తాధిపత్య వ్యవసాయం కంటే, స్థానిక నేలను అర్థం చేసుకునే చిన్న రైతుల వ్యవసాయమే భూమిని కాపాడుతుందన్నారు. సమాజాలు స్వయంసమృద్ధిని కోల్పోయి, అపరిమిత లాభాల వెంట పరుగులెత్తినప్పుడే వనరుల కోసం అంతర్జాతీయ యుద్ధాలు పుడతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, పొరుగు వారితో ప్రేమానుబంధాలను బలోపేతం చేయటమే హింసను అడ్డుకునే మొదటి మార్గం అంటారాయన. అధికారం, యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న నేటి ప్రపంచానికి ఆయన బోధించిన వినయం, ప్రకృతితో సహజీవనం, నైతిక బాధ్యతలే నిజమైన సంజీవని.

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement