పండ్ల చెట్ల మాదిరిగా శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ చేస్తే తీరని నష్టం
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సుందరరాజ్ హెచ్చరిక
దీర్ఘకాలంలో రూ. కోట్ల ఆదాయాన్నిస్తుందనే ఆశతో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు శ్రీగంధం సాగును ఎంచుకుంటున్నారు. చెట్టు త్వరగా నిటారుగా ఎదుగుతుందని, నాణ్యమైన కలప వస్తుందనే అపోహలతో చాలామంది రైతులు శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ (కొమ్మల కత్తిరింపు) చేస్తున్నారు. కానీ, ఈ ప్రూనింగే శ్రీగంధం తోటలకు శాపంగా మారి, రైతులను నిలువునా ముంచుతోందని బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ– ఐడబ్ల్యూఎస్‌టీ)’ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సుందరరాజ్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అనేక శ్రీగంధం తోటలను పరిశీలించినప్పుడు ప్రూనింగ్ వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని చూసి కలత చెందానని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.
పండ్ల తోటలు, పూల తోటల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఆకులు, కాయలు రావడానికి ప్రూనింగ్ ఉపయోగపడుతుంది. కానీ కలపనిచ్చే శ్రీగంధం లాంటి చెట్లకు ప్రూనింగ్ చెయ్యటం తీవ్ర నష్టదాయకం. చెట్టు కాండం పైభాగంలో ఉండే బెరడు ప్రకృతిసిద్ధమైన మొదటి రక్షణ కవచం. ప్రూనింగ్ ద్వారా కొమ్మలను నరికినప్పుడు కాండంపై లోతైన గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాల ద్వారా చెక్కను కుళ్ళింపజేసే ప్రమాదకర శిలీంధ్రాలు, చెక్కను తొలిచే పురుగులు సులువుగా కాండం లోపలికి ప్రవేశిస్తాయి.
బెరడు దెబ్బతిన్న తర్వాత ఆ శిలీంధ్రాలు, కీటకాల దాడిని అడ్డుకోవటం ఏ పురుగుమందులు చల్లినా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కేరళ అటవీ పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం.. శ్రీగంధం వంటి కలప చెట్లలో ఆకులు లేదా పక్క కొమ్మలు కోల్పోవటం వల్ల కలప పెరుగుదల ఏకంగా 44% వరకు తగ్గిపోతుంది. ప్రూనింగ్ గాయాలతో లోపలి చెక్క క్రమంగా కుళ్ళిపోయి కాండం మొత్తం డొల్లగా, బోలుగా మారిపోతుంది. ఫలితంగా, 15–20 ఏళ్లు బతకాల్సిన శ్రీగంధం చెట్లు కేవలం 7–10 ఏళ్ల లేత వయసులోనే ఎండిపోయి చనిపోతున్నాయని డాక్టర్ సుందరరాజ్ స్వయంగా గుర్తించారు.
ఎలాంటి రంధ్రాలు, డొల్లతనం లేకుండా ఉంటే చెట్టుకు కనీసం 9 కిలోల బరువుండే మేలైన నాణ్యమైన శ్రీగంధం కలప రావాలి. ప్రూనింగ్ వల్ల ఒక్క కిలో కూడా మొదటి రకం గుజ్జు రావట్లేదు. దీంతో భారీ లాభాలు ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. శ్రీగంధం తోటల రైతులు ఎలాంటి ప్రూనింగ్ చేయకూడదు. చెట్లను సహజంగా ఎదగనివ్వాలి. కాండంపై ఎలాంటి గాయాలు చేయకూడదు. నిరాధార ప్రచారాలను నమ్మి కొమ్మలను కత్తిరించి తోటలను నాశనం చేసుకోవద్దని డాక్టర్ సుందరరాజ్ (97404 33959) విజ్ఞప్తి చేస్తున్నారు.


