Bittu Tabahi : ‘బిట్టు’కు బంపరాఫర్‌ | Dutch CEO offers job to Bittu Tabahi | Sakshi
Sakshi News home page

Bittu Tabahi : ‘బిట్టు’కు బంపరాఫర్‌

Sep 6 2026 7:35 AM | Updated on Sep 6 2026 7:59 AM

Dutch CEO offers job to Bittu Tabahi

భోపాల్‌: డబ్బు లేకపోవచ్చు, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు.. కానీ గుండెల్లో కసి, చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. ఎదిగేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు! డిజిటల్ రీల్స్, ఫాలోవర్ల కోసం పాకులాడే ఈరోజుల్లో.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, కనీసం ఈత రాకపోయినా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో ప్లాస్టిక్ చెత్తను తొలగించాడు ఆ యువకుడు. అతని అంకితభావాన్ని గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ స్వయంగా మాతో కలిసి పనిచేయండి అంటూ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నయా సోషల్‌ మీడియా సెన్సేషన్‌?

సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్‌ ‘బిట్టు తబాహి’(ఉర్దూలో ‘తబాహి’ అంటే విధ్వంసం). మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాలో నివసించే 21 ఏళ్ల యువ పర్యావరణ వాలంటీర్. పర్యావరణ ప్రేమికుడైన బిట్టు, ఒక రోజు తన ఇంటి సమీపంలో ప్రవహిస్తున్న అజ్నార్‌ నది పూర్తిగా కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒంటిచేత్తో నదిని శుభ్రం చేసేందుకు పూనుకున్నాడు.

సాయం కోసం ఎదురు చూడలేదు. డబ్బులు ఉన్నాయా? లేదా? అని ఆలోచించలేదు. ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్‌ డేని పురస్కరించుకొని నదిలో చెత్తను తొలగించే యజ్ఞాన్ని ప్రారంభించాడు. మొదట్లో బిట్టుకు అతని స్నేహితులు, స్థానికులు సాయం చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనొక్కడే సైన్యంలా మారాడు. కేవలం ప్రాథమిక పనిముట్లతో, సరైన భద్రతా పరికరాలు లేకుండా, ఈత కూడా రాకపోయినా, అతను చేతితో నది నుండి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు.

ఈ క్రమంలో బిట్టు తబాహి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రకరకాల ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. కొన్ని సార్లు పాముల బెడద ఎక్కువైంది. అయినా, వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాడు. దీంతో బిట్టు లోకల్‌ హీరో అయ్యాడు. అతని పనితీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టిని ఆకర్షించడంతో, ఆయన బిట్టును తన ఇంటికి ఆహ్వానించారు. సీఎం అతని చొరవను ప్రశంసించడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.

అతని ప్రయత్నాలకు ప్రశంసలు మాత్రమే కాకుండా, డచ్ స్వచ్ఛంద సంస్థ జాబ్‌ ఆఫర్‌ చేసింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కాలుషితమైన నదిని నెలల తరబడి స్వతంత్రంగా శుభ్రం చేసిన యువకుడిగా అతన్ని ప్రశంసిస్తూ, నది ప్రక్షాళనకు ముందు, తర్వాత తీసిన చిత్రాలను డచ్‌ కంపెనీ ఫౌండర్‌, సీఈఓ  ట్వీట్‌ చేశారు. అతని అంకితభావాన్ని చూసి ముగ్ధుడైన స్లాట్ వచ్చి మా దగ్గర పని చేయండి అంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement