దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాలే టార్గెట్
ప్రధానంగా వృద్ధులను దృష్టి మళ్లించి నేరాలు
పెళ్లిళ్లలో అతిథులుగా వెళ్లి చిన్న పిల్లల్ని వినియోగించి భారీ దొంగతనాలు
చాకచక్యంగా గుట్టురట్టు చేసిన మంగళ్‌హాట్ పోలీసులు
ఇద్దరు అరెస్టు, తృటిలో తప్పించుకున్న మరో నలుగురు
సాక్షి, హైదరాబాద్ : రసోడా గ్యాంగ్..ఇదే గనుక టార్గెట్ చేస్తే క్షణాల్లో దొంగతనం జరగాల్సిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాకు ఓ ప్రత్యేకత ఉంది. దీనిలో ఉండే మహిళలు పురుషులకంటే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. చాలా టెక్నిక్‌గా చోరీ చేస్తారు. మరో విశేషమేంటంటే పిల్లలకు దొంగతనం ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విషయమై శిక్షణ ఇస్తారు. వృద్ధులను లక్ష్యం చేసుకోవడం ఒక ఎత్తయితే పెళ్లిళ్లకు అతిథులుగా వెళ్లి అందరిలో కలిసిపోయి చిన్నారులతో దొంగతనాలు చేయించడం ఈ మహిళా గ్యాంగ్ ప్రత్యేకత. అయితే సాధారణ సమయాల్లో కేవలం మహిళలే బృందాలుగా వెళ్తారు. అనువైన లాడ్జీల్లో బస చేస్తారు. ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేస్తారు.అదును చూసుకుని వారి దృష్టి మళ్లించి నగదు తస్కరిస్తారు.
ఇక ముహూర్తాల సీజన్‌లో అయితే స్త్రీ పురుషులు ‘సుశిక్షితులైన’ చిన్న పిల్లలను తీసుకుని వస్తారు. కాస్త ఖరీదైన హోటళ్లలో బస చేస్తారు.పెళ్లి మండలాలకు అతిథులుగా వెళ్తారు. వధూవరుల గదుల్లోకి పిల్లల్ని పంపి బంగారం చోరీ చేయిస్తారు. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో పంజా విసిరే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా నర్సింగ్ గఢ్ తహసీల్ పరిధిలోని పిప్లా్య రసోడా, గుల్ఖేడీ, కడియా గ్రామాలకు చెందిన రసోడా గ్యాంగ్ వ్యవహారమిది. హైదరాబాద్, మల్కాజ్‌గిరితో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఈ ముఠా గుట్టును మంగళ్‌హాట్ పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. ఇద్దరు మహిళల్ని అరెస్టు చేయగా...మరో నలుగురు తృటిలో తప్పించుకున్నారు.
మహిళల పంథా మరోరకంగా...
మెట్రో నగరాల్లోని ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకునే మహిళలు గ్రూపులుగా ఆ ప్రాంతానికి చేరుకుని లాడ్జీల్లో బస చేస్తారు. ప్రతి రోజూ ఉదయం కొందరు బయటకు రాగా... మరికొందరు గదిలోనే ఉంటారు. వీరు అనువైన ప్రాంతం, టార్గెట్‌ను గుర్తించడానికి సమయం పడుతుంది. ఈలోపు అలసిపోయిన వాళ్లు తమ షిఫ్ట్ ముగించుకుని లాడ్జీకి వెళ్లగా.. అక్కడ రెస్ట్‌లో ఉన్న వాళ్లు స్పాట్‌కు చేరుకుంటారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ చేరి, అలజడి సృష్టిస్తూ దృష్టి మళ్లించి వారి బ్యాగ్‌లు కట్ చేయడం ద్వారా నగదు తస్కరిస్తారు. ఆ వెంటనే అక్కడ నుంచి లాడ్జీకి వచ్చేస్తారు.
ఒక నేరం చేసిన తర్వాత కొన్నాళ్లు ఆ ప్రాంతానికి మళ్లీ రారు. ఇలా గడిచిన రెండు నెలల్లో ఫిల్మ్‌నగర్, సరూర్‌నగర్, మంగళ్‌హాట్‌ల్లో మూడు నేరాలు చేశారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర చాకచక్యంగా నిఘా ఉంచారు. శనివారం మరోసారి వచ్చిన గ్యాంగ్ లాడ్జీలో బస చేయగా... తన బృందంతో దాడి చేశారు. అనిత బాయ్, మల్కా శిసోడియా చిక్కగా... పూజ, లలిత శిసోడియా, బాబ్లీ శిసోడియా, రామ్‌సాఖీ తృటిలో తప్పించుకున్నారు.
చిన్నారులకు చోరీల్లో శిక్షణ ఇచ్చి...
ఈ రసోడా గ్యాంగ్‌కు పిప్లా్య రసోడా గ్యాంగ్ అనే పేరు కూడా ఉంది. ఈ ముఠాల్లో పురుషుల కంటే మహిళలే యాక్టివ్‌గా ఉంటారు. పెళ్లి మండపాలను టార్గెట్‌గా చేసుకునే వీళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారుల్ని వినియోగిస్తారు. తొలుత తమ గ్రామాల్లోని పిల్లల్లో చలాకీగా ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించేలా వారి తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటారు. చోరీలు ఎలా చేయాలనే అంశంపై ఆ చిన్నారులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ వ్యవహారం మొత్తం మహిళల నేతృత్వంలోనే సాగుతుంది.
చిక్కితే డిస్ట్రాక్షన్ టెక్నిక్ వాడి...
ఆ తర్వాత కొందరు పురుషులతో కలిసి మెట్రో నగరాలకు వస్తారు. అక్కడ జరిగే వివాహాలకు అతిథులుగా వెళ్తారు. వందలాది మంది అతిథుల్లో కలిసిపోయి వధువు, వరుడితోపాటు ఇతరు కీలక అతిథులకు కేటాయించిన గదుల్ని గుర్తిస్తారు. ఆపై అదును చూసుకుని చిన్నారుల్ని వాటిల్లోకి పంపి బంగారం, వెండి నగలతో పాటు నగదు తీసుకువచ్చేలా చేస్తారు. ఇవి చేతికి చిక్కిన వెంటనే ఆ ప్రాంతం నుంచి ఉడాయిస్తారు.
ఈ చిన్నారులు అనుమానాస్పదంగా యజమానులకు పట్టుండితే ‘డిస్ట్రాక్షన్ టెక్నిక్’వాడతారు. ‘చాక్లెట్ల కోసం లోపలికి ఎందుకు వెళ్లావు?, అది మన గది కాదు’అంటూ పిల్లవాడిని మందలిస్తున్నట్లుగా నటించి ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ స్థానిక నిర్వహణ, పిల్లలను సమకూర్చడం, శిక్షణ ఇవ్వడం, టార్గెట్లను గుర్తించడం, చిన్నారుల్ని నగరాలకు తీసుకెళ్లడం, దొంగతనం సమయంలో పర్యవేక్షించడం, దొంగిలించిన వస్తువులను తరలించడం, విక్రయించడానికి వేర్వేరు సభ్యుల్ని వాడుతూ వ్యవస్థీకృతంగా పని చేస్తుంది.


