ప్రజల హృదయాల్లో చెరగని సంతకం | Sakshi Guest Column On YS Rajasekhara Reddy By Mahesh Kumar Goud | Sakshi
Sakshi News home page

ప్రజల హృదయాల్లో చెరగని సంతకం

Sep 2 2026 7:34 AM | Updated on Sep 2 2026 7:43 AM

Sakshi Guest Column On YS Rajasekhara Reddy By Mahesh Kumar Goud

ప్రజల జీవితాలను మార్చిన నాయకులు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన ప్రజా నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమం, వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ, సామాజిక చరిత్రను మార్చేశాయి. వైఎస్సార్‌ పాలనకు అసలు బలం ఆయన అధికారంలోకి రావడానికి ముందే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకవడమే. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,470 కిలోమీటర్లకు పైగా సాగిన ఆయన ప్రజా ప్రస్థానం కేవలం ఒక రాజకీయ పాదయాత్ర కాదు. అది గ్రామీణఆంధ్రప్రదేశ్‌ వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న ఒక నాయకుడి సామాజిక అధ్య యనం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ‘ప్రజలు’ కేంద్ర బిందువుగా పలు చారి త్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

రైతు సంక్షేమానికి వైఎస్సార్‌ ఇచ్చిన ప్రాధాన్యం ఆయన పాలనా తత్వానికి అద్దం పడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించే నిర్ణయంపై తొలి సంతకం చేయడం ఒక సాధారణ ప్రభుత్వ ఉత్తర్వు కాదు. విద్యుత్‌ బకాయిల రద్దు, వ్యవసాయానికి ప్రోత్సాహం, సాగునీటి విస్తరణ వంటి చర్యలతో రైతాంగానికి ఆయన ఒక కొత్త భరోసాను కల్పించారు. అదే సమయంలో కరవుతో అలమటిస్తున్న ప్రాంతా లను శాశ్వతంగా మార్చాలన్న సంకల్పంతో ‘జలయజ్ఞం’కు శ్రీకారం చుట్టారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నాయి.

స్వయంగా వైద్యుడైన వైఎస్సార్‌ పేదలకు వైద్యం భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆరోగ్యశ్రీ, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 108, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు 104 వంటి కార్య క్రమాలు తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంది రమ్మ ఇళ్లు, పావలా వడ్డీ రుణాలు, పింఛన్ల పెంపు వంటి చర్యలు... సంక్షేమాన్ని వైఎస్సార్‌ ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా మార్చాయి.

హైదరాబాద్‌ అభివృద్ధిలోనూ వైఎస్సార్‌ దూరదృష్టి స్పష్టంగా కనిపిం చింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్‌ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పాలనలోనే తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌ గ్రేటర్‌ నగరం విస్తరణకు పునాదులు వేశాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా రైతు పొలంలో, పేదవాడి ఇంటిలో, విద్యార్థి కలలో, రోగి చికిత్సలో, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయన పరిపాలనా ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

చదవండి: మానవతా మహర్షి...

బి. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ 
వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement