ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి నేడు
స్మరణ
జననం వల్ల వంశగౌరవం తెలుస్తుందేమో గానీ, మరణం వల్ల ఆ మనిషి ప్రపంచం మీద చూపిన ప్రభావం, ప్రజల మీద వేసిన ప్రత్యేక ఆత్మీయ ముద్ర, చెలిమితో చేసిన పని, గుండెల్ని తట్టిలేపి అందులో వికసిత సితవదన రాజశేఖరమై వెలుగొందడం తెలుస్తుంది. ఇది అక్షరాలా ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ దివంగత ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వర్తిస్తుంది. మహాత్ములకు మరణం ఉండదు. వారు భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ కొన్ని తరాల వరకు వారి జ్ఞాపకాలు నిత్య హరితంగా, నిత్యస్మరితంగా మనవెంట ఉంటాయి. వారు చేసిన మంచి పనులు మనసుకు కనిపిస్తూ వారి కీర్తి స్ఫూర్తి కాయాన్ని కళ్ళముందు నిలిపి కన్నులు చెమ్మగిల్లేలా చేస్తాయి. రాజన్న శరీరం మనల్ని వదలి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను నిత్యం తలచుకుంటున్నారు అంటే ఆశ్చర్యం, ఆనందం. ప్రజలను ఆయన తన గుండెలా చూసుకుంటే, ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు. మానుషరూప దైవం ఆయనే అన్నట్లు తమ పూజా మందిరాలలో ఆయన చిత్ర పటాన్ని ఉంచారు. అంత గొప్ప స్థానం దక్కించుకోవడం ఎవరికి సాధ్యమౌతుంది, అసాధ్యాలను సాధ్యాలు చేసిన రాజశేఖరరెడ్డికి తప్ప.
ఇచ్చుటలో ఉన్న హాయి...
కొందరు కారణం లేకుండా సమాజంతో, పరిస్థితులతో రాజీపడరు. సేవ చేయటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అధికారం ఉన్నా, లేకున్నా. అదీ రాజశేఖరరెడ్డి. అందుకే ఆకాశ మంత ప్రేమ ఆయనంటే అందరికీ. అప్పట్లో వెనుకబడిన పేదరిక ప్రాంతం కడప జిల్లాలో జన్మించి గడపగడపలో ఆయన చిత్ర పటాన్ని పెట్టుకునే స్థాయికి ఎదగడం సామాన్యం కాదు. బాల్యం నుంచే భిన్నంగా ఆలోచించడం, చుట్టూ ఉన్న పేదరికానికి చలించి వారికి ఏదో చేయాలి అని తపించడం వల్లే అది సాధ్యమైంది. నేర్చుకునే గుణాన్ని ఆయన ఆఖరి క్షణం వరకు వదలలేదు. ‘తీసుకోవడం కాదు ఇవ్వడం వల్ల ప్రేమ రెట్టింపు అవుతుంది’ అనేవాడు. ఇవ్వడంలో ఉన్న హాయి ఆయన తెలుసుకోవడమే గాక అందరికీ తెలియచెప్పాడు. చెప్పడమే కాదు ఆచరించాడు. ఆ గుణం వల్లే దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేనన్ని వరాలు, సౌకర్యాలు, పథకాలు ఆయన ఉభయ రాష్ట్రాల తెలుగువారికి అందించాడు. కడపజిల్లా మట్టి వాసన పీల్చిన మొరటు మొండితనం, తప్పునకు ఏమాత్రం తలవంచక నిలబడి కలబడటం, వైద్యం చదివినందువల్ల మనసంతా కరుణ, ఎదుటివారి ప్రాణం ఎలాగైనా కాపాడి తీరాలన్న తపన, మాట ఇస్తే అందుకోసం ఎందాకా అయిన నిలబడి తీరాలన్న నిజాయితీ, అందిన అధికారాన్ని సేవకోసం మాత్రమే ఉపయోగించాలన్న ఆశయం– ఇవన్నీ సాకార ఆకారమై ముందు నిలిస్తే అది వైఎస్ రాజశేఖరరెడ్డి! ఆయన వ్యక్తిత్వం గురించి, మంచితనం గురించి ఎంత చెప్పినా ఏదో మిగిలే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనూ, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాలంలోనూ ఎందరికో సహాయం చేశాడు. బహిరంగంగా ఆయనను తిట్టినవాళ్ళు, రాజకీయంగా విమర్శించినవాళ్ళు సైతం ఆయన సహాయాన్ని పొందారన్నది పచ్చినిజం. ‘సహాయం చేయడంలో రాజకీయాలు, పార్టీలు ఎందుకు? మనం మనుషులం. ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చి అడిగినపుడు, మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు చేసి తీరాలి’ అనేవాడు.
ప్రజారోగ్యాన్ని నెత్తికెత్తుకొని...
మానవీయ విలువల మహోన్నత వికాస మానసం ఆయనది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది! ఈ రోజు రాజశేఖరరెడ్డి కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆ కుటుంబాలు చితికిపోకుండా చిగురు వేశాయి. వారందరికీ ఆయన ప్రాణదాత, విధాత, విధి రాతను తిరిగి రాసిన నేత అన్నది సర్వాంగీకార సత్యం. జనం కోసం, రైతుకోసం, నీటికోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సొంత పార్టీవారితో పోరాటం చేశాడు. పదవులు, పార్టీల కన్నా ప్రజలు, వారి అవసరాలు ముఖ్యం అని నిలబడ్డాడు. కుటుంబానికి పరిమి తమైన విద్యార్థి ‘రాజా’, ‘డాక్టరు రాజా’ అయ్యాడు. పేదల వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా ప్రయాణిస్తూ మరింత సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘రాజన్న’ అయ్యాడు. సమస్యను తక్షణం పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. చూద్దాం, చేద్దాం అన్న మాట ఆయన నోట వినలేదు. ఎప్పుడూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవాడు. ఎండిన పొలాలు, మండుతున్న రైతు గుండెల్ని చూసి... పొలం గట్టు మీద కూర్చొని మథనపడేవాడు. ఒక్క ఎకరా కూడా నీరు లేకుండా ఎండకూడదు, అలా చేయటానికే అధికారంలోనికి రావాలి అనుకున్నాడు. ఇతరులు అధికారం పొంది ధనయజ్ఞం చేస్తే, రాజన్న జలయజ్ఞం చేశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఎందరు కాదన్నా పట్టుదలతో రైతులకు ఉచిత విద్యుత్తు అందించాడు.
రాజన్న తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అనుసరించాయి. ప్రజల హృద యాలను, అవసరాలను, పేదరికపు వ్యథా భరిత జీవితాలను ఎంత చదివాడో, ఎంతగా ఆయన లోలో నలిగాడో గానీ... ఆయన ప్రవేశపెట్టిన ప్రజారోగ్య, విద్యా పథకాలను కాదని ఏ ప్రభు త్వమూ మనుగడ సాగించలేదు. పల్లె పల్లెలో, వీధి వీధిలో ఆయన విగ్రహాలు వెలిశాయి అంటే అందుకు కారణం ఇదే. చెప్పుకోవడం కాదు, చేతల్లో ఎలా ఉన్నాం, చేతనంలో ఎలా ఉన్నాం అన్నది మౌనంగా గ్రహిస్తారు ప్రజలు. వారికి తెలియ దనుకోవడం అమాయకత్వం. రాజశేఖరుని ఆంతర్యం ఆసాంతం అందరు గ్రహించారు. కాబట్టి ఆ విగ్రహాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో అసాధారణం, అసామాన్యం కదా! ఎంతమంది నాయకులు లేరు! ఆయన కన్నా ముందు ఎందరు పరిపాలించలేదు! ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్ఠలు రాజశేఖరరెడ్డికే దక్కడం ఆయన అదృష్టం కాదు. ఆయన చేసిన కృషి, సేవ అందుకు కారణం. ఆగ్రహంతో అడవులలో ఆయుధా లతో తిరిగే అన్నలతో సైతం శాంతి చర్చలు జరిపాడే... అది చాలదా ఆయన శాంతి కామన ఆరాధన. ఎంతటి వారికైనా మరణం అనివార్యం. మరణం అంటే మనిషి లేకపోవడం. కానీ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు, కీర్తి, చేసిన పనులు, వారి నుండి సహాయం పొందిన వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఆయన మనమధ్యే ఉన్నారు, మనతో ఉన్నారు. నిత్య స్మరణలో ఉన్న మనిషికి మరణం ఉంటుందా!
కొందరు సమాజాన్ని మార్చటానికే జన్మిస్తారట. అలాంటి సార్థక ధన్యజన్మ ఆయనది. అతి కొద్ది పరిపాలన కాలంలోనే, తిరుమల తిరుపతి దేవస్థానాలతో సహా రాష్ట్రంలోని అన్ని విభా గాలను ప్రక్షాళితం, ప్రజ్వలితం చేయగలిగాడు. రైతులు, ఉద్యో గులు, విద్యార్థులు, కార్మికులు అందరి ముఖాలలోను చిరునవ్వులు వెలిగించాడు. ఆయనతో కలిసి నడిచిన వ్యక్తిగా, ఆత్మబంధువుగా ఆయనను ఈ రోజు స్మరించుకోవడం నా భాగ్యం, నా ధర్మం, నా కర్తవ్యం. రామాలయం లేని గ్రామం ఉండవచ్చు కానీ రాజన్న జ్ఞాపక చిత్రం లేని ఒక్క హృదయాలయమూ ఉండదని గుర్తు చేస్తూ...
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు


