వడ్డీ రేట్ల పెంపులో తొందరపాటు తగునా? | India Rate Hike, Why RBI Must Resist Global Pressure To Protect Business Growth And Boost Job Creation | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్ల పెంపులో తొందరపాటు తగునా?

Oct 12 2026 1:02 PM | Updated on Oct 12 2026 1:41 PM

India Rate Hike Why RBI Must Resist Global Pressure to Save Business Boom

సమతుల్య విధానమే బెటర్‌ అంటున్న నిపుణులు

భారతీయ వ్యాపార రంగం ప్రస్తుతం కీలక దశలోకి అడుగుపెట్టింది. గత మూడేళ్ల కాలంలోనే మనదేశంలో క్రియాశీలక (యాక్టివ్) కంపెనీల సంఖ్య 16 లక్షల నుంచి ఏకంగా 22 లక్షలకు చేరింది. అంటే సుమారు అర మిలియన్ పైగా కొత్త కంపెనీలు వ్యవస్థలోకి వచ్చాయి. నిబంధనల సరళీకరణ, చవకగా లభిస్తున్న పెట్టుబడి (కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గడం) ఈ ప్రగతికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలో కొందరి విశ్లేషణలు కింది విధంగా ఉన్నాయి.

ఆర్థిక క్రమశిక్షణ.. దాని సవాళ్లు

ప్రభుత్వం తీసుకుంటున్న లోతైన ఆర్థిక క్రమశిక్షణ చర్యల వల్ల నేడు భారత్‌లో పెట్టుబడి వ్యయం తగ్గింది. కొవిడ్ ముందస్తు స్థాయికి ఆర్థిక లోటును తీసుకువచ్చిన అతికొద్ది ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే, ఈ లోటును తగ్గించుకునే ప్రక్రియ ఆర్థిక వృద్ధి వేగాన్ని కొంత నియంత్రణలో ఉంచుతుంది. మన ఉత్పాదకత కొవిడ్‌ పూర్వ స్థాయి కంటే ఒక సంవత్సరం వెనుకబడి ఉంది. ఇది ముఖ్యంగా ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు సరిపోకపోవడంతో నైపుణ్యానికి తగిన వేతనాలు లభించక సామాన్యుల జీవన ప్రమాణాల్లో మార్పులు నెమ్మదించాయి.

ప్రైవేట్ రంగానికి ఊతం.. క్యాపిటల్ లభ్యత

ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త ఉద్యోగాలు, వ్యాపారాలు సృష్టించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ఆధారంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభంగా రుణాలు అందుతున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పటికీ 7% పరిధిలోనే కొనసాగుతుండటం శుభపరిణామం. స్టాక్ మార్కెట్లో కంపెనీలు ఈ ఏడాది దాదాపు రూ.6 లక్షల కోట్ల ఈక్విటీని సమీకరించే దిశగా పయనిస్తున్నాయని అంచనా. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధుల ప్రవాహం పెరగడం వల్ల కొత్త స్టార్టప్‌లకు విస్తారంగా నిధులు అందుతున్నాయి.

అంతర్జాతీయ వడ్డీ రేట్ల ఒత్తిడి.. మన వ్యూహం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాండ్, కరెన్సీ మార్కెట్లు భారత్‌లో కూడా వడ్డీ రేట్లను పెంచాలని ప్రతిపాదిస్తున్నాయి. కానీ, కేవలం గ్లోబల్ ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరిస్తూ వడ్డీ రేట్లను పెంచడం మన దేశీయ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా వడ్డీ రేట్లు పెంచే తొందరపాటు చర్యలను కట్టిపెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం కొన్ని అంశాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

విదేశీ మూలధన ప్రవాహాన్ని సులభతరం చేయడం: పన్ను చట్టాలను మరింత సరళీకరించి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా నిబంధనలను సడలించాలి. బాండ్ ఇన్వెస్టర్లకు ఇటీవల ఇచ్చిన మినహాయింపులు దీనికి మంచి ఉదాహరణ.

మూలధన డిమాండ్‌ను పెంచడం: మార్కెట్లలోకి వస్తున్న భారీ నిధులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి పెన్షన్, ఇన్సూరెన్స్ ఫండ్స్ నిధులను ఉత్పత్తి రంగానికి, మౌలిక సదుపాయాల కల్పనకు మళ్లించేలా నిర్ణయాత్మక విధాన రూపకల్పన జరగాలి. ఆర్థిక లోటును పూడుస్తూనే వ్యాపార రంగానికి తక్కువ ధరలో నిధులు లభించేలా చూడడమే దేశీయ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సరైన దిశానిర్దేశం చేస్తుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement