పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్! | Online Shopping Scams 2026, How To Spot Fake E-Commerce Deals And Stay Safe During Festive Sales, Check Stay Safe Tips | Sakshi
Sakshi News home page

పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

Oct 12 2026 8:48 AM | Updated on Oct 12 2026 9:43 AM

Online Shopping Scams 2026 How to Spot Fake ECommerce Deals Stay Safe tips

దసరా, దీపావళి పండగల సీజన్ వచ్చిందంటే చాలు ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీ డిస్కౌంట్లు, బిగ్ సేల్స్ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మురిసిపోయి, తొందరపాటులో కొనుగోళ్లు చేస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. పండగ షాపింగ్‌ను సురక్షితంగా చేసుకోవడానికి ప్రతి వినియోగదారుడు కొన్ని కీలకమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆన్‌లైన్ షాపింగ్‌లో జరిగే ప్రధాన మోసాలు

ఫేక్ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు: అసలైన ఈ-కామర్స్ సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు (ఫిషింగ్‌ సైట్లు) సృష్టించి సోషల్ మీడియా లేదా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రూ.99లకే స్మార్ట్‌ఫోన్, 90 శాతం డిస్కౌంట్ అంటూ ఊరించే లింకులను పంపుతారు. ఈ లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కుతాయి.

డార్క్ ప్యాటర్న్స్: కొన్ని సంస్థలు ‘ఫేక్ అర్జెన్సీ’ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ‘ఈ ఆఫర్ కేవలం మరో 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది.. స్టాక్ కేవలం ఒకటి మాత్రమే మిగిలింది’ అని హడావుడి చేసి ఆలోచించే సమయం ఇవ్వకుండా కొనుగోలు చేసేలా ఒత్తిడికి గురిచేస్తాయి.

ఫేక్ రివ్యూలు, ఎంఆర్‌పీ మాయాజాలం: వస్తువుల అసలు ధర కంటే ఎంఆర్‌పీని బాగా పెంచి చూపి దానికి భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు భ్రమ కలిగిస్తారు. అలాగే, సదరు వస్తువు నాణ్యతను పెంచి చూపేందుకు నకిలీ రివ్యూలు, రేటింగ్‌లను ఉపయోగిస్తారు.

పేమెంట్ గేట్‌వే మోసాలు: ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు డిపాజిట్ అవుతాయని నమ్మించి మోసం చేయడం లేదా నకిలీ పేమెంట్ లింక్‌ల ద్వారా బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు.

తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వెబ్‌సైట్ చిరునామాను పరిశీలించండి: ఏ సైట్‌లోనైనా షాపింగ్ చేసే ముందు అడ్రస్ బార్‌లో ‘https://’, లాక్ (Padlock) సింబల్ ఉందో లేదో సరిచూసుకోండి. నకిలీ వెబ్‌సైట్ల డొమైన్ పేర్లలో అక్షరాల తేడాలు (ఉదాహరణకు amazon బదులు amazonn) ఉంటాయి.

ధరల పోలిక, హిస్టరీ చెక్: ఆఫర్ నిజమైనదేనా అని తెలుసుకోవడానికి వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఆ వస్తువు ధరను సరిపోల్చండి. ‘ప్రైస్ ట్రాకర్’ టూల్స్ ఉపయోగించి ఆ వస్తువు అసలు ధర గతంలో ఎంత ఉందో చెక్ చేయవచ్చు.

కస్టమర్ రివ్యూలు: కేవలం 5-స్టార్ రేటింగ్‌లను మాత్రమే నమ్మకుండా, నెగటివ్ రివ్యూలు (1 లేదా 2 స్టార్ రేటింగ్స్) కూడా చదవండి. వెరిఫైడ్ బయ్యర్లు ఇచ్చిన కామెంట్లను సరిచూసుకోండి.

సురక్షితమైన పేమెంట్ విధానాలు: పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడూ క్రెడిట్ కార్డు లేదా వర్చువల్ డెబిట్ కార్డులను ఉపయోగించడం సురక్షితం. అపరిచిత సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవడం ఉత్తమం.

ఓటీపీ, పిన్ గోప్యత: యూపీఐ ద్వారా డబ్బులు స్వీకరించడానికి ఎప్పుడూ పిన్‌ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బులు పంపేటప్పుడు మాత్రమే పిన్ కొట్టాలి. బ్యాంక్ క్రెడెన్షియల్స్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఒకవేళ మీరు ఆన్‌లైన్ మోసానికి గురైతే తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. పండుగ సంబరాల్లో అప్రమత్తతే సరైన రక్షణ!

ఇదీ చదవండి: సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రమాదంలో దేశ ఆహార రంగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement