దేశంలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటైన బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. కొత్త నివాస ప్రాజెక్టులు భారీగా అందుబాటులోకి వస్తుండగా, వాటికి తగిన స్థాయిలో కొనుగోలుదారులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 75 వేలకుపైగా అపార్ట్‌మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్ ‘సెన్సిబుల్’ సహ వ్యవస్థాపకుడు అబిద్ హసన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ఇక కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టకుండా నిలిపేసినా, ఇప్పటికే మిగిలిపోయిన ఇళ్లను విక్రయించడానికి సుమారు 15 నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి పెరగడం గృహ కొనుగోళ్లను కూడా ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ ఆందోళనలకు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలోని గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. 2026 జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరులో అమ్ముడుపోని ఇళ్ల నిల్వ గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరిగింది. వీటిని విక్రయించడానికి పట్టే సమయం 4.6 త్రైమాసికాల నుంచి 5.5 త్రైమాసికాలకు చేరింది. అంటే సుమారు 16.5 నెలలు పడుతుందన్నమాట.
కొత్త ప్రారంభాలే ఎక్కువ
నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరు నగరంలో 18,393 కొత్త ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. ఇదే సమయంలో 15,172 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. విక్రయాలు సైతం 4 శాతం పెరిగినప్పటికీ, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఇళ్ల సంఖ్య వాటి కంటే ఎక్కువగా ఉండటం నిల్వలు పెరగడానికి కారణమవుతోంది. మరోవైపు, నగరంలో నివాస గృహాల సగటు ధరలు ఏడాదిలో 11 శాతం పెరిగాయి.
ఐటీ రంగం మందగిస్తే ఇబ్బందులే!
బెంగళూరు గృహ మార్కెట్‌పై ఐటీ రంగ పరిణామాలు కూడా ప్రభావం చూపే అవకాశముంది. నగరంలో ఇళ్లను కొనుగోలు చేసేవారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కీలక వర్గం. అయితే ఏఐ వినియోగం పెరుగుతుండటంతో ఐటీ కంపెనీల వ్యాపార విధానాలు, ఉద్యోగుల అవసరాల్లో మార్పులు వస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2026 తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మూడో పక్ష ఐటీ సేవల సంస్థల కార్యాలయ స్థలాల లీజింగ్ 36 శాతం తగ్గింది. అయితే ఇదే సమయంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) లీజింగ్ 10 శాతం పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాల మందగమనం, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా కొందరు టెక్ ఉద్యోగులు ఇళ్ల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక ధరలకు ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు మరింత ఆచితూచి వ్యవహరించవచ్చు.
ధరలు తగ్గుతాయా?
ఉత్తర బెంగళూరుతో పాటు మెట్రో మార్గాలకు సమీపంలోని ప్రాజెక్టులకు డెవలపర్లు వసూలు చేస్తున్న అదనపు ధరలపైనా చర్చ జరుగుతోంది. అమ్ముడుపోని ఇళ్లు, తక్కువ ధరలకు లభిస్తున్న రీసేల్ ప్రాపర్టీలు కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి.
ఇదీ చదవండి: బెంగళూరులో అద్దె ఇల్లు.. వింత షరతులు!
మొత్తంగా చూస్తే.. బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ పూర్తిగా పడిపోలేదు. అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, సరఫరా అంతకంటే వేగంగా విస్తరిస్తుండటం సమస్యగా మారింది. ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటం, ఐటీ ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కొనుగోలుదారులను వెనక్కి తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ, ధరల నిర్ణయంలోనూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అబిద్ హసన్ ట్వీట్ ఈ కింద చూడొచ్చు..


