అమెరికా బ్యాంకింగ్ రంగంలో మరో కలకలం చోటుచేసుకుంది. ఇండియానా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యునైటెడ్ ఫిడెలిటీ బ్యాంక్ (United Fidelity Bank)ను ఫెడరల్ నియంత్రణ సంస్థలు నవంబర్ 27న మూసివేశాయి. దేశంలో సెలవుల సీజన్‌లో అతిపెద్ద షాపింగ్ రోజులలో ఒకటైన బ్లాక్ ఫ్రైడే రోజునే ఇది జరగడం గమనార్హం. 2024లో రిపబ్లిక్ ఫస్ట్ బ్యాంక్ కుప్పకూలిన తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద బ్యాంక్ వైఫల్యం. సుమారు రెండేళ్ల తర్వాత చోటుచేసుకున్న ఈ పరిణామం ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఎందుకు మూసేశారంటే..?
బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారడం, ఖాతాదారుల నగదు ఉపసంహరణ డిమాండ్లను సాధారణంగా తీర్చలేని పరిస్థితి ఏర్పడటంతో అమెరికా కరెన్సీ నియంత్రణ సంస్థ (OCC) ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు కార్యకలాపాలు సురక్షితంగా లేవని, తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చలేకపోయే ప్రమాదం ఉందని OCC గుర్తించింది. దీంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC)ను రిసీవర్‌గా నియమించింది.
సెప్టెంబర్ 30, 2026 నాటికి యునైటెడ్ ఫిడెలిటీ బ్యాంక్‌కు సుమారు 5.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54 వేల కోట్లు) ఆస్తులు, 5.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంక్ వైఫల్యం వల్ల FDIC డిపాజిట్ ఇన్సూరెన్స్ నిధికి 1.83 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని అంచనా వేసింది.
ఫస్ట్ సిటిజన్స్ చేతికి కార్యకలాపాలు
బ్యాంక్ డిపాజిట్లు, రుణాలు, ఇతర ఆస్తుల్లో అధిక భాగాన్ని నార్త్ కరోలినా కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. FDIC నిర్వహించిన పోటీ ప్రక్రియలో ఈ బ్యాంక్ కొనుగోలుకు ఎంపికైంది. ఈ ఒప్పందంలో భాగంగా సెప్టెంబర్ చివరి నాటి లెక్కల ప్రకారం 4.5 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 3.1 బిలియన్ డాలర్ల రుణాలు, 5.9 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.
యునైటెడ్ ఫిడెలిటీకి ఇండియానా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, కొలరాడో రాష్ట్రాలతో పాటు అమెరికా వర్జిన్ దీవుల్లో మొత్తం 22 శాఖలు ఉన్నాయి. ఇవి ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ శాఖలుగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.
ఖాతాదారుల డబ్బుకు భద్రత
బ్యాంక్ మూసివేతతో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని FDIC భరోసా ఇచ్చింది. వారి డిపాజిట్ ఖాతాలు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. ఖాతాదారులు తమ పాత చెక్కులు, ఏటీఎం, డెబిట్ కార్డులను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. రుణాలు తీసుకున్నవారు కూడా గతంలో మాదిరిగానే వాయిదాలు చెల్లించాలి.
అమెరికాలో FDIC బీమా పరిధిలోని బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి, ఒక్కో డిపాజిట్ యాజమాన్య కేటగిరీకి గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్ల వరకు (సుమారు రూ.2.25 కోట్లు) డిపాజిట్ బీమా లభిస్తుంది. యునైటెడ్ ఫిడెలిటీ ఖాతాదారులు ఫస్ట్ సిటిజన్స్ ఖాతాదారులుగా మారినప్పటికీ వారి డిపాజిట్ బీమా కవరేజీ కొనసాగుతుందని FDIC వెల్లడించింది.
2026లో ఏడు బ్యాంకుల వైఫల్యం
FDIC జాబితా ప్రకారం 2026లో ఇప్పటివరకు అమెరికాలో ఏడు బ్యాంకులు మూతపడ్డాయి. జనవరి, మే నెలల్లో ఒక్కొక్కటి, జూలైలో రెండు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఒక్కొక్కటి చొప్పున విఫలమయ్యాయి. తాజాగా యునైటెడ్ ఫిడెలిటీ మూసివేతతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. అంతకుముందు 2024 ఏప్రిల్‌లో సుమారు 6 బిలియన్ డాలర్ల ఆస్తులున్న రిపబ్లిక్ ఫస్ట్ బ్యాంక్ మూతపడింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యంగా నిలిచింది.
ఇదీ చదవండి: ATM విత్‌డ్రాపై ‘అలర్ట్’! RBI కొత్త రూల్స్..


