టెక్కీకి బైబై! సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లే వద్దు బాబోయ్‌.. | Techies Want to Quit Software Jobs AI Fears Layoffs | Sakshi
Sakshi News home page

టెక్కీకి బైబై! సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లే వద్దు బాబోయ్‌..

Nov 29 2026 3:18 PM | Updated on Nov 29 2026 3:34 PM

Techies Want to Quit Software Jobs AI Fears Layoffs

వేరే రంగానికి మారేందుకు 72 శాతం మంది సై

30 శాతం మంది వెంటనే మారేందుకు, ప్రస్తుత జీతంతో వెళ్లేందుకు 42% సిద్ధం

ప్రస్తుత ఉద్యోగాల్లో సంతోషంగా ఉన్నామంటున్న వారు 13% మాత్రమే

ఏఐ భయాలు, వరుస లేఆఫ్స్‌ కారణాలు

తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఒకప్పుడు అత్యంత సురక్షితమైన, ఆకర్షణీయమైన కెరీర్‌గా భావించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ రంగం ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశంలోని సుమారు 60 లక్షల మంది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తును ఏఐ మార్చేస్తోంది. ముఖ్యంగా బేసిక్‌ కోడింగ్, అకౌంట్స్‌ రీకన్సిలియేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ వంటి ప్రాథమిక స్థాయి పనులను ఏఐ సులభంగా చేస్తుండటంతో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ), ఐటీ సర్వీస్‌ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు మందగించాయి.

దీంతో టెక్కీలు సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ ఉద్యోగాలకు కాలం చెల్లుతోందని, ఏఐ భర్తీ చేయలేని వైద్యం, ప్రభుత్వ రంగం వంటి స్థిరమైన వృత్తులు లేదా నేరుగా ఏఐ స్పెషలైజేషన్‌ వైపు మళ్లడమే భవిష్యత్తుకు భరోసా అని వారు విశ్వసిస్తున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ వేదిక ‘బ్లైండ్‌’ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐ భయాలు, వరుస లేఆఫ్స్‌ (ఉద్యోగాల కోత) కారణంగా మెజారిటీ టెక్కీలు ఈ రంగాన్ని వీడాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.

నివేదికలో ఏముందంటే...

🔻    ఎలాంటి అదనపు ఖర్చు లేదా రీ–ట్రైనింగ్‌ అవసరం లేకపోతే 72% మంది టెక్కీలు వెంటనే పూర్తిగా వేరే రంగంలోకి మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
🔻   ఇందులో 30% మంది తక్షణమే మారిపోతామని చెప్పగా, ప్రస్తుత జీతం లభిస్తే చాలు 42% మంది వెళ్లిపోతామన్నారు.
🔻   ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్లో సంతోషంగా ఉన్నామన్న వారు కేవలం 13% మందే.
🔻   తమ పిల్లలను టెక్‌ రంగంలోకి పంపడానికి 56% మంది తల్లిదండ్రులు (టెక్కీలు) ఇష్టపడటం లేదు
🔻   మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న వారిలో 67%, గూగుల్, అమెజాన్‌ ఉద్యోగుల్లో 50% పైగా తమ పిల్లలను ఐటీ వైపు ప్రోత్సహించబోమన్నారు.
🔻   కెరీర్‌ ప్రారంభించే యువతకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ను సూచించిన వారు 4 శాతమే. గూగుల్, మెటా, ఎన్విడియా  సంస్థల ఉద్యోగుల్లో ఎవరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ను ఉత్తమ కెరీర్‌గా సూచించలేదు

టెక్కీలు ఎందుకు భయపడుతున్నారు?

చాలామంది టెక్కీలు అధిక వేతనాల కారణంగా ఇష్టం లేకపోయినా ఇదే రంగంలో కొనసాగుతు­న్నారు. వేరే రంగంలో ఇంత జీతం రాదనే భయంతో వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2025తో పోలిస్తే 2026లో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వీడటంపై బ్లైండ్‌ వేదికపై చర్చలు 37.5% పెరిగాయి.

సాఫ్ట్‌వేర్‌ వద్దు.. కానీ ఏఐ  ముద్దు

ఈ సర్వేలో ఒక వైరుధ్యం కనిపించింది. యువతకు సాఫ్ట్‌వేర్‌ వద్దని చెప్పిన టెక్కీలే అత్యధికంగా సిఫార్సు చేసిన రంగాల్లో వైద్యారోగ్య రంగానికి (34%) తొలి స్థానం ఇవ్వగా ఏఐ/ఎంఎల్‌ రంగానికి రెండో స్థానం (19%) ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు (15%) ప్రాధాన్యత ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement