ఏఐ ప్రభావం సినీ పరిశ్రమలోనూ వేగంగా విస్తరిస్తోంది. సెలబ్రిటీల రూపాలతో డ్యాన్స్‌లు, సన్నివేశాలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలు ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో కృత్రిమ మేధతో తనపై వస్తున్న డ్యాన్స్ వీడియోలను ప్రస్తావిస్తూ మలయాళ స్టార్ మమ్ముట్టి సరదాగా స్పందించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన డ్యాన్స్ రీల్స్ చూసి ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. ఏఐ టెక్నాలజీతో తనను ఊహించని విధంగా డ్యాన్స్ చేయిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.
‘సోషల్ మీడియాలో నాకు సంబంధించిన డ్యాన్స్ రీల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినీ పరిశ్రమపై ఏఐ ప్రభావం మొదలైంది. ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతోనే కృత్రిమ మేధ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. యువత వాటితో రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. జీవితంలో ఎన్నడూ ఊహించని రీతిలో నాతో డ్యాన్స్ చేయిస్తున్నారు. అందుకే ఇక నేను సినిమాల్లో డ్యాన్స్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఇప్పుడు నేను చేసినా.. ప్రేక్షకులు అది నిజం అని నమ్మే పరిస్థితి లేదేమో’ అని మమ్ముట్టి చమత్కరించారు.
(ఇదీ చదవండి: ఇడుపు కాయితం.. అక్కడ ఆడుతుందా?)
అయితే ఏఐని కేవలం వినోద కోణంలోనే చూడకూడదని ఆయన అన్నారు. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్‌లో తీవ్రమైన ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ‘మనం ఈ విషయాలన్నింటినీ సరదాగా మాట్లాడుకుంటున్నాం. కానీ, ఏఐతో తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. త్వరలోనే అదే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. మన కదలికలను కూడా ఏఐ నియంత్రించే రోజులు రావొచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ పురోగతిలో ముందున్నాయి. ఈ సాంకేతికత తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయి’ అని మమ్ముట్టి అభిప్రాయపడ్డారు.
కాగా, సినిమాల విషయానికొస్తే.. మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ఓం’ (OM). ఇందులో ఆయనతో పాటు ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబరు 20న రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తోంది.


