ఇడుపు కాయితం.. అక్కడ ఆడుతుందా? | Is Idupu Kayitham Movie Success In AP, Bunny Vasu Intersting Comments | Sakshi
Sakshi News home page

ఇడుపు కాయితం.. అక్కడ ఆడుతుందా?

Nov 28 2026 4:23 PM | Updated on Nov 28 2026 4:32 PM

Is Idupu Kayitham Movie Success In AP, Bunny Vasu Intersting Comments

టాలీవుడ్‌లో ఇటీవల ఓ ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒక ప్రాంతం ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలకు.. ఆ ప్రాంతంలోనే ఎక్కువ ఆదరణ లభిస్తుండగా, ఇతర ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే చర్చ మొదలైంది. తాజాగా ‘ఇడుపు కాయితం’ సినిమాకు సంబంధించి నిర్మాత బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి.

డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఇడుపు కాయితం’పై తెలంగాణలో మంచి బజ్ కనిపిస్తోంది. అయితే ఏపీలో మాత్రం సినిమాపై అదే స్థాయిలో హైప్ కనిపించడం లేదని నిర్మాత బన్నీ వాస్ స్వయంగా వెల్లడించారు. కొత్త పాటను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో సినిమాపై ప్రేక్షకులకు ఇప్పటికే మంచి అవగాహన ఉందని, అక్కడ బజ్ కూడా బాగానే క్రియేట్ అయిందని తెలిపారు.

(ఇదీ చదవండి: ఆమె కోసం అబ్బాయిని చూస్తున్నా..: అల్లు అరవింద్‌)

తెలంగాణ ప్రజలకు ‘ఇడుపు కాయితం’ కథ, దాని నేపథ్యం గురించి బాగా తెలుసన్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం సినిమా గురించి పెద్దగా చర్చ జరగడం లేదని పేర్కొన్నారు. అక్కడ కూడా సినిమాపై హైప్ పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్న నిర్మాత.. ఏపీలో తొలి రోజు వసూళ్ల విషయంలో మాత్రం కొంత సందేహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ మొదటి రోజు కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా.. సినిమా కంటెంట్ బలంగా ఉంటే తర్వాతి రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కథపై ఉన్న నమ్మకమే అందుకు కారణమని చెప్పారు.

‘ప్యారడైజ్‌’ నుంచి ‘గరివిడి లక్ష్మి’ వరకు..
ఇలాంటి పరిస్థితి ‘ఇడుపు కాయితం’కే పరిమితం కాదనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన నాని ‘ది ప్యారడైజ్‌’కు నైజాం ప్రాంతంలో మంచి స్పందన లభించింది. అయితే ఏపీ మార్కెట్‌లో మాత్రం ఆ స్థాయిలో ఆదరణ కనిపించలేదనే టాక్ వచ్చింది. అలాగే రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన ‘రణబాలి’కి కూడా ఆ ప్రాంతంలో మంచి స్పందన లభించగా.. ఇతర ఏరియాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంతో రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమాకు మంచి ఆదరణ లభించగా.. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

‘ఇడుపు కాయితం’ పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఇదే అంశం ‘ఇడుపు కాయితం’ విషయంలోనూ చర్చకు వస్తోంది. తెలంగాణ నేపథ్యంతో ముడిపడిన కథ కావడంతో ఆ ప్రాంతంలో సినిమాపై సహజంగానే ఆసక్తి, బజ్ ఏర్పడిందని చిత్రబృందం భావిస్తోంది. కానీ ఏపీ మార్కెట్‌లో మాత్రం సినిమాకు మరింత ప్రచారం అవసరమని నిర్మాత బన్నీ వాస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సుకుమార్‌ సతీమణి తబితతో కలిసి బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటించారు. వంశీ రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement