ATM విత్‌డ్రాపై ‘అలర్ట్‌’! RBI కొత్త రూల్స్‌.. | RBI new rules for cash withdrawals via ATM PoS machines | Sakshi
Sakshi News home page

ATM విత్‌డ్రాపై ‘అలర్ట్‌’! RBI కొత్త రూల్స్‌..

Nov 28 2026 11:39 AM | Updated on Nov 28 2026 11:48 AM

RBI new rules for cash withdrawals via ATM PoS machines

ఏటీఎంలలో నగదు ఉపసంహరణ, లావాదేవీల ఛార్జీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) యంత్రాల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఒకే మాస్టర్ డైరెక్షన్ కిందకు తీసుకొచ్చింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత సర్క్యులర్లను ఉపసంహరించుకుంది. నవంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం.. వినియోగదారులు నెలలో ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉపయోగించుకున్నారు? తదుపరి లావాదేవీకి ఎంత ఛార్జీ పడుతుంది? అనే వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా తెలియజేయాలి.

అలర్ట్‌ చేయాల్సిందే..

వినియోగదారులు తమకు లభించే ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని దాటకుండా బ్యాంకులు తగిన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉచిత లావాదేవీల సంఖ్య పూర్తయిన తర్వాత చేసే లావాదేవీలకు వర్తించే ఛార్జీల గురించి ముందుగానే అలర్ట్‌లు పంపాలి. అలాగే ఏటీఎంలు మెట్రో పరిధిలో ఉన్నాయా.. లేదా నాన్‌మెట్రో ప్రాంతాల్లో ఉన్నాయా అన్నది స్క్రీన్‌పై సందేశం, స్టిక్కర్ లేదా పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలియజేయాలి. ఏటీఎం ప్రాంతానికి సంబంధించిన వివరాలు బ్యాంకుల డేటాబేస్‌లోనూ ఎప్పటికప్పుడు సరిగా ఉండాలని ఆర్బీఐ సూచించింది.

ఉచిత ఏటీఎం లావాదేవీలు ఎన్నంటే?

ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. సేవింగ్స్ ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇందులో నగదు ఉపసంహరణతో పాటు ఇతర లావాదేవీలూ ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, నాన్‌మెట్రో ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. అయితే మెట్రో, నాన్‌మెట్రో ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలను కలిపి ఉపయోగించినప్పుడు నెలకు మొత్తం ఐదు ఉచిత లావాదేవీల పరిమితి వర్తిస్తుంది. మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ ఉన్నాయి.

ఈ పరిమితులు దాటిన తర్వాత ఒక్కో లావాదేవీకి బ్యాంకులు గరిష్ఠంగా రూ.23 ఛార్జీ చేయవచ్చు. దీనికి వర్తించే పన్నులు అదనం. బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం ఈ ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉచిత లావాదేవీలను అందించేందుకూ అవకాశం ఉంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఒక్కో లావాదేవీకి నగదు ఉపసంహరణ పరిమితి రూ.10,000గా ఉంటుంది.

ట్రాన్సాక్షన్‌ ఫెయిలైతే..

ఏటీఎంలో సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, కమ్యూనికేషన్ లోపాలు లేదా నగదు అందుబాటులో లేకపోవడం వల్ల లావాదేవీ విఫలమైతే దానిని ఉచిత లావాదేవీల ఖాతాలో పరిగణించకూడదు. బ్యాంకు లేదా సేవా సంస్థకు సంబంధించిన కారణాలతో తిరస్కరణకు గురైన లావాదేవీలకూ ఛార్జీలు విధించరాదు. చెల్లని పిన్‌, ధ్రువీకరణ సమస్యలతో విఫలమైన లావాదేవీలను కూడా ఈ జాబితాలో చేర్చింది. అంతేకాకుండా ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితులు, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఆంగ్లం, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

PoS యంత్రాల్లోనూ యూపీఐతో క్యాష్‌

PoS యంత్రాల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల్లోనూ ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ ఉన్న ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIs), యూపీఐ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.2,000, నెల మొత్తంలో రూ.10,000 వరకు నగదు తీసుకోవచ్చు. ఈ సేవకు వ్యాపార సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తే అవి లావాదేవీ మొత్తంలో ఒక శాతానికి మించకూడదు.

ముఖ్యంగా, వినియోగదారులు ఆ దుకాణంలో వస్తువులు కొనుగోలు చేయకపోయినా నగదు ఉపసంహరణ సదుపాయాన్ని కల్పించాలి. కొనుగోలుతోపాటు నగదు తీసుకుంటే, రసీదులో కొనుగోలు మొత్తం, నగదు ఉపసంహరణ మొత్తాన్ని విడివిడిగా చూపించాలి. ఈ సదుపాయాన్ని కల్పించే వ్యాపార సంస్థలపై బ్యాంకులు తగిన తనిఖీలు నిర్వహించాలి.

కార్డు లేకుండానే క్యాష్‌

ఏటీఎంలలో కార్డు అవసరం లేకుండా నగదు ఉపసంహరించుకునే ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్నీ ఆర్బీఐ కొనసాగించింది. ఇందులో యూపీఐ ద్వారా వినియోగదారుడి అనుమతి తీసుకుని నగదు అందించే విధానం అమల్లో ఉంటుంది. లావాదేవీల సెటిల్‌మెంట్‌ను నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ లేదా సంబంధిత ఏటీఎం నెట్‌వర్క్‌ల ద్వారా నిర్వహిస్తారు.

ఈ మార్గదర్శకాలు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత చెల్లింపు వ్యవస్థల ప్రదాతలు, ఇతర సంబంధిత సంస్థలకు వర్తిస్తాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ విధానం, విఫలమైన లావాదేవీలకు సంబంధించిన పరిహార నిబంధనలను అనుసరించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement