పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 8 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాస్పెక్టస్‌ను సెబీ గతేడాది పక్కనపెట్టిన వేదాంతా గ్రూప్ కంపెనీ స్టెరిలైట్ ఎలక్ట్రికాన్ సైతం తాజా జాబితాలో చోటు సాధించింది. అనుమతి పొందిన ఇతర కంపెనీలలో అనన్య బిర్లా కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్, గౌరిక్ ఫ్యాషన్స్, ఎమరాల్డ్ జ్యువెల్ ఇండస్ట్రీ ఇండియా, బ్యూటీ గ్యారేజ్, నోబుల్ హైజీన్, ఎంపీ స్టీల్(ఇండియా), కటారియా ధూల్‌చంద్ పన్నాలాల్ జ్యువెలర్స్ చేరాయి.
విద్యుత్ కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ స్టెరిలైట్ ఎలక్ట్రికాన్ 2025 అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. సెబీ తొలుత పక్కనపెట్టిన విషయం విదితమే. తిరిగి ఈ నెల 20న ఆమోదించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లు తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆగస్ట్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన స్వతంత్ర మైక్రోఫిన్ ఐపీవో ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడంతోపాటు, ప్రస్తుత వాటాదారులు మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. గౌరిక్ ఫ్యాషన్స్ ఐపీవోలో భాగంగా 62 లక్షల ఈక్విటీ షేర్లు కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 8 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్ ఆఫర్ చేయనున్నారు. ఎమరాల్డ్ జ్యువెలరీ జూలైలో గోప్యతా మార్గాన సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. బ్యూటీ గ్యారేజ్ ఐపీవోకింద రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
వీటితోపాటు మరో 78.36 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌కు పెట్టుబడులున్న నోబుల్ హైజీన్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.55 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈ బాటలో స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్టుల కంపెనీ ఎంపీ స్టీల్(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 25 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
కటారియా జ్యువెలర్స్ ఐపీవోకింద 1.6 కోట్ల ఈక్విటీ షేర్లు కొత్తగా జారీ చేయనుంది. ఈ కంపెనీలన్నీ మే- సెప్టెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులకు వినియోగించనున్నాయి. కాగా.. ఈ నెల 19న బ్రిషాల్ ఆయిల్ అండ్ ఎనర్జీ, 25న పెంటకిల్ కన్సల్టెంట్స్(ఐ) లిమిటెడ్ ఐపీవో బాటను వీడుతూ ప్రాస్పెక్టస్‌ను సెబీ నుంచి వెనక్కి తీసుకోవడం గమనార్హం!
స్వరాజ్ గ్రీన్ సన్నాహాలు.. సెబీకి అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు
సమీకృత ఇథనాల్, షుగర్ తయారీ కంపెనీ స్వరాజ్ గ్రీన్ పవర్ అండ్ ఫ్యూయల్ ఐపీవో బాటలో ముందడుగు వేసింది. సెబీకి తాజాగా నవీకరించిన(అప్‌డేటెడ్) ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,100 కోట్ల సమీకరణ ప్రణాళికలు వెల్లడించింది. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆర్‌హెచ్‌ఎన్ నింబాల్కర్ విక్రయానికి ఉంచనున్నారు.
కంపెనీ తొలుత గోప్యతా విధానంలో సెబీ నుంచి జూన్‌లో ఐపీవోకు అనుమతి పొందడంతో తాజాగా అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను అందించింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 621 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. మహారాష్ట్రలోని సాత్రాలో సమీకృత ప్లాంటును కలిగి ఉంది. రోజుకి 7,500 టన్నుల(టీసీడీ) చక్కెర క్రషింగ్ సామర్థ్యం, 636 మెగావాట్ల సహవిద్యుదుత్పత్తి యూనిట్, రోజుకి 500 కిలోలీటర్ల(కేఎల్‌పీడీ) డిస్టిల్లరీ యూనిట్‌లను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: బ్లింకిట్ యాప్ గుట్టు విప్పిన యువతి!


