రీజియన్ వ్యాప్తంగా రూ.83 కోట్ల రుణాల పంపిణీ
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 'మెగా అగ్రి క్రెడిట్ అవుట్‌రీచ్ క్యాంప్'లో భాగంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక రుణ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.83.00 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను (చెక్కులను) బ్యాంక్ అధికారులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ (ట్రెజరీ విభాగం) డాక్టర్ బి. భాస్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, శివ సత్య పౌల్ట్రీస్, వెంకటరామ మోడరన్ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్ డైరెక్టర్ కోర దుర్గా కిషోర్ హాజరయ్యారు.
రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ''వ్యవసాయ రంగం, అనుబంధ పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి బ్యాంకు ప్రత్యేక రుణ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు, మహిళా సంఘాలు, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెగా క్యాంప్ ద్వారా అర్హులైన వారికి సులభతరమైన రుణ సదుపాయాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాము'' అని పేర్కొన్నారు.
బ్యాంక్ అందిస్తున్న ప్రధాన రుణ పథకాలు
వ్యవసాయ రంగం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక పథకాలు..
సెంట్ SHG NRLM పథకం: మహిళా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ / టర్మ్ లోన్. గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు (వడ్డీ రేటు 7% నుంచి).
సెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ – రైస్ మిల్ క్లస్టర్: రైస్ మిల్లులు, రైస్ షెల్లింగ్ యూనిట్లకు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం (వడ్డీ రేటు 7.75% నుంచి).
సెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లస్: రైస్ మిల్, ఆయిల్ మిల్, పప్పు మిల్లులు, పాల ఉత్పత్తులు తదితర ఆహార పరిశ్రమలకు రూ.100 కోట్ల వరకు రుణం (వడ్డీ రేటు 8% నుంచి).
సెంట్ కిసాన్ వాహన్ పథకం: రైతులకు కొత్త ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు రూ.25 లక్షల వరకు రుణం (వడ్డీ రేటు 9% నుంచి).
సెంట్ ఫార్మ్ మెషినరీ పథకం: వ్యవసాయ యంత్రాల కొనుగోలు, నిర్వహణకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో టర్మ్ లోన్.
నారీ శక్తి పథకం: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం.
రైతులు, మహిళా సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నిర్వాహకులు సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ అధికారులు కోరారు.


