ఆధునిక సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి ఉద్యోగ ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం పట్టభద్రులైతే చాలు ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉండేది. కానీ నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) కొత్తగా ఉద్యోగాల్లో చేరే ఫ్రెషర్లకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అర్హతగా మారాయి.
పెరుగుతున్న ప్రాధాన్యం
భారత్‌లో కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ప్రారంభమవుతుండటంతో పాటు, ఇప్పటికే ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆల్టెడో నిర్వహించిన డేటా విశ్లేషణ ప్రకారం, 2026 తొలి పది నెలల్లో జీసీసీ సంస్థల్లో ఫ్రెషర్లకు సంబంధించిన ఏఐ నైపుణ్యాల డిమాండ్ 45 శాతం పెరిగింది. కొత్తగా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో దాదాపు 65 శాతం పోస్టులకు ఏఐ పరిజ్ఞానం అవసరమవుతోంది. సాధారణ పనులను ఏఐతో వేగంగా పూర్తి చేసే వీలుండటంతో సంప్రదాయ ఐటీ, బీపీఎం ఉద్యోగాల స్వరూపం కూడా వేగంగా మారుతోంది.
తాజా గణాంకాలు
కంపెనీలు కొత్తగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుని, ఏఐ సాంకేతికతతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేలా తీర్చిదిద్దుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం జీసీసీ సంస్థల్లో ఫ్రెషర్ నియామకాలు 20 నుంచి 25 శాతం పెరగగా, ఐటీ సేవల సంస్థల్లో 10 నుంచి 15 శాతం వృద్ధి కనిపించింది. మరోవైపు సాధారణ ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) రంగాల్లో ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు 5 నుంచి 10 శాతం తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, ఐటీ సేవల సంస్థల్లో ఏఐ నైపుణ్యాల డిమాండ్ 19 శాతం, బీపీఎం సంస్థల్లో 10 నుంచి 15 శాతం మేర పెరగడం గమనార్హం.
డిమాండ్ ఉన్నవి ఇవే
సంస్థలు తమ వ్యాపార విలువను పెంచుకునేందుకు కేవలం ఏఐ నిపుణులనే కాకుండా, ఏఐని వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉపయోగించగల ఉద్యోగులను కోరుకుంటున్నాయి. ప్రస్తుతం డేటా ఇంజినీరింగ్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి అత్యధిక అవకాశాలు లభిస్తున్నాయి.
శిక్షణ, అధిక వేతనాలు
రాండ్‌స్టాడ్ ఇండియా అధ్యయనం ప్రకారం, ఏఐ ఉద్యోగాలకు డేటా పరిజ్ఞానం ఎంతో ముఖ్యం. డేటా ఇంజినీరింగ్, డేటా సైన్స్ అనేవి ఏఐ వైపు వెళ్లడానికి సహజమైన మార్గాలుగా మారుతున్నాయి. కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారికి మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా ఏఐ శిక్షణ ఇస్తున్నాయి. సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి అధిక వేతనాలు చెల్లించేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభ్యర్థుల కొరత ఇంకా కొనసాగుతోంది.
రాబోయే రోజుల్లో ఏఐ కేవలం ఉద్యోగాలను ప్రభావితం చేయడమే కాకుండా, ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన అర్హతలను కూడా నిర్దేశించబోతోంది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఇప్పటి నుంచే ఏఐ టూల్స్, డేటా, క్లౌడ్ టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.


