బహుళ సంపాదనే నేటి యువత కొత్త మాట
ప్రపంచవ్యాప్తంగా సరికొత్త పని సంస్కృతి
అమెరికా నుంచి భారత్ వరకు ఇదే జోరు
బహుళ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 55% మంది నవతరం
సాక్షి, హైదరాబాద్: సాయంత్రం ఆరు గంటలకు ఆఫీస్ కంప్యూటర్ మూసేసి.. రాత్రి ఏడు గంటలకు మరో కంప్యూటర్ తెరిచి వేరే ప్రాజెక్టుపై పనిచేయడం.. ఒకప్పుడు ఇది వినడానికి వింతగా ఉండేది. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జెన్–జీ ఉద్యోగులకు ఇదే కొత్త జీవనశైలిగా మారుతోంది. దీనినే ఆధునిక భాషలో ’పాలీవర్కింగ్’ (బహుళ వృత్తుల విధానం) అని పిలుస్తున్నారు. ఒకే సంస్థపై ఆధారపడకుండా, ఒక పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే స్వతంత్ర ప్రాజెక్టులు, కన్సల్టెన్సీ, ఆన్‌లైన్ బోధన, సృజనాత్మక రచనలు లేదా చిన్న వ్యాపారాల ద్వారా బహుళ ఆదాయ మార్గాలను నిర్మించుకోవడమే ఈ విధానం. కేవలం చిల్లర ఖర్చుల కోసం చేసే అదనపు పనిలా కాకుండా, ఇదొక పక్కా వృత్తిపరమైన వ్యూహంగా మారుతోంది.
ప్రపంచ గణాంకాలు ఏం చెబుతున్నాయి?
మెజారిటీ వాటా వీరిదే: ’డిప్యూటీ’ సర్వే ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 55 శాతం మంది జెన్–జీ యువతే ఉన్నారు. ’ఫైవర్’ సర్వే ప్రకారం 64 శాతం మంది జెన్–జీ ఉద్యోగులు ఆర్థిక భద్రతకు బహుళ ఆదాయ మార్గాలు తప్పనిసరి అని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఒకే సంస్థలో పనిచేసే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని 55 శాతం మంది నమ్ముతున్నారు.
అమెరికాలో..: కార్మిక గణాంకాల సంస్థ ప్రకారం 2026 సెప్టెంబర్ నాటికి దాదాపు 90 లక్షల మంది.. అంటే మొత్తం ఉద్యోగులలో 5.5 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది వీరి సంఖ్య 87.9 లక్షలుగా ఉండేది. ముఖ్యంగా ఏడాదికి 50,000– 1,50,000 డాలర్లు సంపాదించే మధ్యతరగతి ఆదాయ వర్గాలలో ఈ ధోరణి 4.7 నుంచి 5.6 శాతానికి పెరిగింది.
ప్రపంచవ్యాప్త పరిస్థితి: రాండ్‌స్టాడ్ సర్వేలో 35 దేశాల్లోని 27 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 40 శాతం మంది ఇప్పటికే రెండో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకోవడానికి 36 శాతం మంది తమ పని గంటలను పెంచుకున్నారు లేదా పెంచుకోవాలని చూస్తున్నారు. బ్రిటన్, బెల్జియం (ఇక్కడ సుమారు 5.5 శాతం మంది రెండో ఉద్యోగం చేస్తున్నారు), యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ విధానంలో ముందున్నాయి.
భారత్ లో.. : ఒకే జీతంపై ఆధారపడకూడదనే ఆలోచన మన దేశ యువతలో కూడా బలంగా నాటుకుపోతోంది. రాండ్‌స్టాడ్ ప్రకారం.. ఏకంగా 58 శాతం మంది ఉద్యోగులు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి రెండో ఉద్యోగం చేస్తున్నారు లేదా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారత ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం దేశంలో తాత్కాలిక, ప్రాజెక్ట్ ఆధారిత కారి్మకుల సంఖ్య 2020–21లో 77 లక్షలు ఉండగా, 2024–25 నాటికి 55 శాతం పెరిగి 1.2 కోట్లకు చేరుకుంది. స్వతంత్ర పనులకు భారత్‌లో ఎంత గిరాకీ ఉందో ఇది స్పష్టం చేస్తోంది.
చట్టం ఏం చెబుతోంది?
ప్రైవేట్ రంగ సాంకేతిక లేదా కార్పొరేట్ ఉద్యోగులు రెండో పని చేయకూడదని నిషేధించే ప్రత్యేక కేంద్ర చట్టం ఏదీ లేదు. 1948 నాటి కర్మాగారాల చట్టంలోని నిబంధన కేవలం కర్మాగార కారి్మకులు ఒకేరోజు రెండు చోట్ల పనిచేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. అయితే భారత్‌లో ఇది పూర్తిగా ఉద్యోగ ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో చేరేటప్పుడు సంతకం చేసిన ఒప్పంద పత్రంలో ’వేరే పని చేయకూడదు’ అనే నిబంధన ఉంటే.. సంస్థ అనుమతి లేకుండా రెండో పని చేయడం ఒప్పంద ఉల్లంఘన అవుతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రోత్సహిస్తున్న దేశాలు..
పలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో పన్నుల పరంగా బహుళ ఉద్యోగాలు చేయడం చట్టబద్ధం. ప్రధాన సంస్థకు పోటీ కానంత వరకు, పనితీరు దెబ్బతిననంత వరకు రెండో ఉద్యోగం చేసుకోవడానికి హంగేరీ వంటి దేశాల కార్మిక చట్టాలు స్పష్టమైన అనుమతి ఇస్తున్నాయి. బెల్జియంలో ’సౌకర్యవంతమైన ఉద్యోగాలు’ పేరిట పూర్తిస్థాయి ఉద్యోగం చేసేవారు ఇతర రంగాల్లో పన్ను రాయితీలతో రెండో ఉద్యోగం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోంది. బ్రిటన్లో అలాగే అమెరికాలో ప్రధాన సంస్థతో ప్రయోజనాల ఘర్షణ లేకపోతే ముందస్తు సమాచారంతో రెండో పని చేసుకోవడానికి చట్టపరమైన అడ్డంకులు తక్కువ.
భారత సంస్థలు అనుమతిస్తాయా?
నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నందున భారత సంస్థలు కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగులు దొరకనప్పుడు.. కంపెనీలు ‘నిపుణుల సేవల’వైపు మొగ్గు చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగి మరో పోటీ సంస్థలో పనిచేయడానికి భారత సాంకేతిక సంస్థలు ఇప్పుడప్పుడే ఒప్పుకోవు. సంస్థ అనుమతితో విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పడం, కొత్త వ్యాపార సంస్థలకు సలహాలు ఇవ్వడం, లేదా ఉమ్మడి సాంకేతిక ప్రాజెక్టులలో సలహాదారుడిగా పనిచేయడం వంటి వాటికి భవిష్యత్తులో తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.
ఆ రెండూ వేర్వేరు..
1. మూన్‌లైటింగ్: ప్రధాన సంస్థకు తెలియకుండా, రహస్యంగా రాత్రిపూట లేదా వారాంతాల్లో మరో పోటీ సంస్థకు పనిచేయడం. దీనివల్ల సంస్థ రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని, పనితీరు దెబ్బతింటుందని సంస్థలు దీనిని వ్యతిరేకిస్తాయి.
2. పాలీవర్కింగ్: ఇది పారదర్శకంగా, ఒక ప్రణాళిక ప్రకారం సాగే వృత్తి విధానం. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడు పగలు కార్యాలయ పని చేస్తూ, వారాంతాల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం, సొంతంగా వీడియో ఛానల్ నడపడం లేదా ఇతర రంగాల్లో సలహాదారుడిగా వ్యవహరించడం దీని కిందకు వస్తుంది.


