బంగారం ధరలు నవంబర్‌లో తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఒకవైపు భారీగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసిన పసిడి.. మరోవైపు అనూహ్యంగా పుంజుకుని మళ్లీ ఆశలు రేకెత్తించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ కాంట్రాక్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నవంబర్ 25న 10 గ్రాములకు రూ.1,17,906 కనిష్ఠ స్థాయిని తాకాయి. అయితే, అక్కడి నుంచి కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. నవంబర్ 27న ఇంట్రాడేలో రూ.1,26,251 గరిష్ఠ స్థాయికి చేరాయి. అంటే కనిష్ఠ స్థాయి నుంచి రెండు సెషన్లలోనే సుమారు 7.1 శాతం పెరిగాయి.
ఫెడ్ నిర్ణయంపైనే ఆశలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం బంగారం ధరల తదుపరి గమనాన్ని నిర్దేశించనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫెడ్ ద్రవ్య విధాన సమావేశం జరగనుంది. వడ్డీ రేట్లపై నిర్ణయంతో పాటు 2027లో అనుసరించబోయే విధానంపై ఫెడ్ అధికారులు ఇచ్చే సంకేతాలనూ ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.
వడ్డీ రేట్ల నిర్ణయం ఇప్పటికే మార్కెట్ అంచనాల్లో కొంతమేర ప్రతిఫలించిందని సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ గుప్తా అభిప్రాయపడ్డారు. అందువల్ల బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల్లో కొంతకాలం స్థిరంగా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే, భవిష్యత్తులో మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించే సంకేతాలు వెలువడితే పసిడిపై ఒత్తిడి పెరగవచ్చని పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు నిలిపివేయడం లేదా తగ్గింపునకు అవకాశాలు కనిపిస్తే మాత్రం బంగారానికి మద్దతు లభిస్తుందని వివరించారు.
డాలర్, ట్రెజరీ రాబడుల ప్రభావం
అమెరికా డాలర్ బలహీనపడటం, ట్రెజరీ బాండ్ల రాబడులు తగ్గడం బంగారం, వెండి ధరలకు అనుకూలంగా మారవచ్చని ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ తెలిపారు. దీనికి భిన్నంగా ఫెడ్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్నారు. మధ్యప్రాచ్య పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు సరఫరాపై ఆందోళనలు కూడా కమోడిటీ మార్కెట్లలో అస్థిరతకు కారణమవుతాయని పేర్కొన్నారు.
బంగారానికి కీలక స్థాయిలివే!
సాంకేతికంగా చూస్తే ఎంసీఎక్స్ గోల్డ్‌కు రూ.1,26,300–రూ.1,27,000 పరిధి తక్షణ నిరోధంగా ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే తదుపరి రూ.1,30,000–రూ.1,30,700 పరిధి దిశగా వెళ్లే అవకాశం ఉందని పొన్ముడి విశ్లేషించారు. మరోవైపు రూ.1,21,000–రూ.1,21,700 స్థాయిని కీలక మద్దతుగా పేర్కొన్నారు. ఈ పరిధిని కోల్పోతే మళ్లీ రూ.1,17,500–రూ.1,18,500 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వారపు చార్టులో కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరగడం పసిడికి కొంత ఊరటనిచ్చిందని ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కోలుకోవడం కూడా దేశీయ ఫ్యూచర్స్‌కు మద్దతుగా నిలిచింది. అయితే, ఫెడ్ నిర్ణయం వెలువడే వరకు డాలర్ కదలికలు, బాండ్ రాబడులు, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం (నవంబర్ 29 నాటికి) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడొచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


