న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ కొలువుదీరనుంది. సభా కార్యకలాపాల అవసరాలను బట్టి ఈ రెండు సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఉండవు.
లోక్‌సభ బులెటిన్ ప్రకారం.. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన లోక్‌సభ తిరిగి నవంబర్ 30, సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసభ బులెటిన్‌లోనూ సమావేశాల పునఃప్రారంభానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన ఎగువ సభ.. డిసెంబర్ 2 (బుధవారం) ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానుంది. కీలక ప్రభుత్వ కార్యకలాపాలను చేపట్టేందుకు రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ రెండు సభల సమావేశాలను తిరిగి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లను కోరింది. కీలకమైన ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి చేసేందుకు నవంబర్ 30, డిసెంబర్ 2 తేదీల్లో సభలను సమావేశపరచాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఆగస్టు 13న లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ.. వర్షాకాల సమావేశాలను ఇప్పటివరకు అధికారికంగా ముగిస్తూ ప్రొరోగేషన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో అదే సమావేశాల కొనసాగింపుగా తాజాగా సభలను తిరిగి నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ప్రైవేట్ సభ్యుల కార్యకలాపాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3 నాటికి నిర్దేశిత ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తవుతాయా అన్నది గమనించాల్సి ఉంది.
పార్లమెంట్‌లో పరిస్థితులెలా ఉంటాయో..
నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించే రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన విధానంలో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే, జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా కేంద్రం గతంలో పునర్విభజన చట్టాన్ని ప్రతిపాదించింది.


