చివరి ప్రయత్నం.. స్టాలిన్‌తో కాంగ్రెస్‌ అగ్ర నేతల భేటీ! | Congress final attempt to persuade DMK regarding Delimitation Bill | Sakshi
Sakshi News home page

చివరి ప్రయత్నం.. స్టాలిన్‌తో కాంగ్రెస్‌ అగ్ర నేతల భేటీ!

Nov 29 2026 4:27 PM | Updated on Nov 29 2026 5:08 PM

Congress final attempt to persuade DMK regarding Delimitation Bill

సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దంటూ డీఎంకేను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వీరితో పాటు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు రేవంత్‌ రెడ్డి, డీకే శివకుమార్‌, సతీశన్‌లు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. బిల్లుపై డీఎంకే తన వైఖరిని మార్చుకోవాలని వారు కోరినట్టు తెలుస్తోంది.

అయితే డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నేతల చివరి నిమిషం ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు లేవనెత్తిన అన్ని డిమాండ్లకు అంగీకరించిందని, ఇది రాష్ట్రానికి దక్కిన విజయమని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించాయి.

ఇక మరోవైపు.. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనలో తమిళనాడు ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించడం కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి ముందే డీఎంకే తన వైఖరిని స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదనపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్య భారత ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆయన అభివర్ణించారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో డీఎంకే మద్దతు విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న వైఖరికే కట్టుబడి ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్ వెబ్‌సైట్‌లో భద్రతా లోపాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement