లిస్టింగ్‌కు 4 కంపెనీలు రెడీ | SEBI Clears IPO Plans of Four Companies Know The Details | Sakshi
Sakshi News home page

లిస్టింగ్‌కు 4 కంపెనీలు రెడీ

Aug 29 2026 1:45 AM | Updated on Aug 29 2026 1:45 AM

SEBI Clears IPO Plans of Four Companies Know The Details

న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిస్తూ తాజాగా నాలుగు కంపెనీల లిస్టింగ్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జాబితాలో పారస్‌ హెల్త్‌కేర్, భారత్‌ పెట్‌ లిమిటెడ్, ఎంకే సన్స్‌ ఫైన్‌ జ్యువెల్స్, సద్భావ్‌ ఫ్యూచర్‌టెక్‌ చేరాయి. ఈ ఏడాది మార్చి-జూన్‌ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కాగా.. ఇప్పటికే ప్యాకేజ్‌డ్‌ మసాలా దినుసుల కంపెనీ పుష్ప్‌ బ్రాండ్‌(ఇండియా)సహా.. ఫిన్‌టెక్‌ సంస్థ పారామోటార్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఐపీవోలకు సైతం సెబీ అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..

రూ. 1,800 కోట్లకు రెడీ
పారస్‌ హెల్త్‌కేర్‌ జూన్‌ 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి అదనంగా రూ. 1,300 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులకు, సొంత అనుబంధ సంస్థ పీఎంహెచ్‌పీఎల్‌ రుణాల చెల్లింపులకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. పారస్‌ హెల్త్‌ బ్రాండుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తున కంపెనీ 2026 మార్చి31కల్లా 2,211 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల వాటా..
సద్భావ్‌ ఫ్యూచర్‌టెక్‌ ఏప్రిల్‌ 7న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా 2.55 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 235 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌తోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

రూ. 760 కోట్లపై దృష్టి
భారత్‌ పెట్‌ మార్చి 25న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు(పెట్టుబడి వ్యయాలు)కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.

ఈక్విటీ షేర్ల జారీతో..
ఎంకే సన్స్‌ ఫైన్‌ జ్యువెల్స్‌ మే 14న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా 1.36 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 34 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ రామ్‌చంద్‌ మురళీధర్‌ ఆర్‌. విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో కొత్త షోరూముల ఏర్పాటుతోపాటు.. గుజరాత్‌లోని ప్రస్తుత స్టోర్ల విస్తరణకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement