హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల వేలం రికార్డు స్థాయిలో జరిగింది. తాజాగా 5.38 ఎకరాల P2 ప్లాట్ ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడంతో ప్రభుత్వానికి మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు జరిగిన P1 ప్లాట్ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర లభించి, రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో రెండు వేలాల్లో కలిపి 10.63 ఎకరాల భూమికి రూ.2,833.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర రావడం, రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికంగా ఉండటం విశేషం.
ఐటీ, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రాయదుర్గ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతంలో భూములకు మంచి విలువ ఉంటుందని పెట్టుబడిదారులు ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.
ఈ వేలం ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదికగా పారదర్శకంగా నిర్వహించారు. టీజీఐఐసీకి లావాదేవీ సలహాదారుగా జేఎల్‌ఎల్ వ్యవహరించింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శకమైన వేలం ప్రక్రియ వల్ల ప్రభుత్వ భూములకు గరిష్ఠ విలువ లభించిందని టీజీఐఐసీ పేర్కొంది. మొత్తం మీద.. రాయదుర్గ్ భూముల వేలం ప్రభుత్వ ఆస్తుల నగదీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడమే కాకుండా, హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న బలమైన విశ్వాసాన్ని కూడా ప్రతిబింబించింది.


