సాక్షి, హైదరాబాద్: రాఖీ సందర్భంగా నగరంలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. ఐదు వేల ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా సిటీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఈ నెల 31 వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. గతేడాది కంటే అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఉప్పల్ నల్లచెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. నల్లచెరువు నుంచి వరంగల్, హన్మకొండ, నర్సంపేట, జనగాం, యాదాద్రి, తొర్రూరు వైపు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తోంది. రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా రద్దీ మరింత పెరగనుంది. రాఖీ రోజు తర్వాత తిరుగు ప్రయాణాల్లోనూ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ


