రాఖీ కట్టనిస్తారా? | Rakhi Twist In Telangana Politics, Will Revanth Reddy Meet Konda Surekha Amid Political Tensions, Check More Details | Sakshi
Sakshi News home page

రాఖీ కట్టనిస్తారా?

Aug 28 2026 8:28 AM | Updated on Aug 28 2026 8:45 AM

Rakhi Twist in Telangana Politics: Will Revanth Meet Konda Surekha

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.

సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..
కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్‌) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.

అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.

అధిష్టానం వద్దకు వ్యవహారం..
ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.

మౌనంగా సురేఖ.. అపాయింట్‌మెంట్‌పై ఉత్కంఠ
కొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్‌మెంట్‌ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్‌.. లాస్ట్‌ మినిట్‌లో ఆ ట్విస్ట్‌ తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement